బందరు ఫిషింగ్ హార్బర్ పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
బందరు ఫిషింగ్ హార్బర్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
బందరు ఫిషింగ్ హార్బర్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిషింగ్ హార్బర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం రూ. 280 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తోంది. సముద్ర తీరం వద్ద తరచుగా ఇసుక దిబ్బలు వస్తాయి.. కాబట్టి ఫిషింగ్ బోట్లకు అన్ని సమయాల్లో అవకాశాలు ఉండవు. కేవలం సముద్రానికి పోటు వచ్చిన సమయంలోనే వేటకు వెళ్లే వీలు ఉండటంతో నిర్వాహకులు భారీగా నష్టపోతున్నారు. అది కూడా పోటు సమయంలో సముద్రంలోకి వెళ్లాలంటే కనీసం 12 గంటల పాటు నిర్వాహకులు ఒడ్డున నిరీక్షించాల్సి వస్తోంది. పదేళ్ల క్రితం గిలకలదిండిలో రూ.4.70 కోట్లతో నిర్మించిన హార్బర్‌తో నిర్వాహకులకు పెద్దగా లబ్ధి చేకూరడం లేదు.. అంతేకాకుండా సముద్ర తీరంలో ఇసుక దిబ్బలను తొలగించడానికి పూర్తి స్థాయి చర్యలు తీసుకోలేదు.
ఇసుక దిబ్బలు ఏర్పడే హార్బర్ వద్ద క్రమం తప్పకుండా పూడిక తీయాలని నిపుణులు సూచించినా గతంలో చేయలేదు.ఇసుక మేటల సమస్య కారణంగా పడవ నిర్వాహకులు బందర్ ఫిషింగ్ హార్బర్ నుండి కాకినాడ, విశాఖపట్నం మరియు కృష్ణపట్నం ఫిషింగ్ హార్బర్ లకు వెళుతున్నారు. దీంతో హార్బర్‌లోని సమస్యలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు మంత్రులు పేర్ని నాని, మోపిదేవి వెంకటరమణ. ఈ క్రమంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
బందర్ ఫిషింగ్ హార్బర్ ప్రస్తుత పరిస్థితులు, ఫిషింగ్ హార్బర్ ను విస్తరించడానికి తీసుకోవలసిన చర్యలు మరియు అభివృద్ధి కార్యకలాపాలపై డిపిఆర్ (సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారీకి వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (వాప్కోస్) కు అప్పగించారు. ఈ సంస్థ ఎగుమతులు, దిగుమతి సౌకర్యాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ఫిషరీస్ రెస్ట్రూమ్స్, రేడియో కమ్యూనికేషన్ టవర్, బోట్ బిల్డింగ్, ఐస్ ప్లాంట్స్, కీవాల్ ఎక్స్‌టెన్షన్, ప్రొటెక్టివ్ వాటర్ సప్లై మొదలైన పైలెట్లను రూపొందించనుంది. అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఫిషింగ్ హార్బర్ విస్తరణకు టెండర్లను ఆహ్వానిస్తామని మంత్రి మోపిదేవి వెంకట రమణ తెలిపారు.