ఈనెల 6న హై పవర్ కమిటీ సమావేశం!
రాజధానిపై జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటీల సిఫారసులను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన మంత్రుల హై పవర్ కమిటీ, సీనియర్ ఐఎఎస్ అధికారులు జనవరి 6న సమావేశమయ్యే అవకాశం.
రాజధానిపై జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటీల సిఫారసులను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన మంత్రుల హై పవర్ కమిటీ, సీనియర్ ఐఎఎస్ అధికారులు జనవరి 6న సమావేశమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలోని ఈ కమిటీ సమావేశం కానుంది. ఇప్పటికే సదరు సభ్యులు ఈ కమిటీ ప్రతిపాదనలు అర్ధం చేసుకునేందుకు వీలుగా ప్రతులను పంపించినట్టు తెలుస్తోంది. ఈ నెల 6న సమావేశం అయిన తరువాత ఈ నివేదికను జనవరి 8న రాష్ట్ర మంత్రివర్గం ముందు ప్రవేశపెట్టనున్నారు.
ఆరోజు జరిగే కేబినెట్ సమావేశంలో హై పవర్ కమిటీ ఈ రెండు నివేదికలపై మొదటి అభిప్రాయాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కాగా ఈ రెండు నివేదికలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయడానికి మరియు జనవరి 26 లోపు సిఫారసులను ఇవ్వడానికి కమిటీకి మూడు వారాల సమయం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈలోపే తుది నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు జిఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలను టేబుల్ చేయడానికి అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి కూడా హై పవర్ కమిటీ సిఫారసులను అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.