రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదిక చాలా బాగుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద రెడ్డి అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. బోస్టన్ కమిటీని ప్రపంచంలోని ప్రముఖ సంస్థలలో ఒకటిగా పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చనే బిసిజి నివేదిక అందరికి ఉపయోగపడేలా ఉందని అన్నారు. ఒకే చోట లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి బదులు, ఈ నిధులను అన్ని ప్రాంతాలకు సమానంగా ఉపయోగించుకోవాలని బిసిజి నివేదికలో పేర్కొందని.. ఆ డబ్బుని జలవనరుల కోసం ఖర్చు చేయడం మంచిదని సూచించడం చాలా మంచి ఆలోచన అన్నారు.
అమరావతి రాజధాని నిర్మాణానికి తగినది కాదని మద్రాస్ ఐఐటి శాస్త్రీయంగా ధృవీకరించిందని గుర్తుచేశారు. అయితే వ్యవసాయ పరంగా అమరావతిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రసాద రెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు శుక్రవారం, బిసిజి కమిటీ రాజధాని మరియు అభివృద్ధి వికేంద్రీకరణపై నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమర్పించింది. అభివృద్ధిని వికేంద్రీకరించాలని కమిటీ సిఫారసు చేసింది, అందువల్ల రాష్ట్రానికి మూడు రాజధానులను ప్రతిపాదించే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, బీసీజీ కమిటీ తన నివేదిక ఇవ్వడంతో, అమరావతిలో నిరసనలు మరింత తీవ్రతరం అయ్యాయి.