బడికి పంపించే తల్లులకు ఏడాదికి 15 వేలు: జగన్ సర్కారు క్లారిటీ

Update: 2019-06-24 01:17 GMT

అమ్మ ఒడి పధకం అమలుపై నెలకొన్న గందరగోళానికి ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల తల్లులకు ఈ పథకం వర్తిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకే అమ్మ ఒడి పదకం వర్తిస్తుందని ఇటీవల మంత్రులు ప్రకటించడంతో గందరగోళం ఏర్పడింది. ఈ గందరగోళానికి సీఎంఓ తెరదించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి పిల్లలను బడికి పంపించే తల్లులకు ఏడాదికి15 వేలు ఇస్తామంటూ పదే పదే హామీ ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ పథకం అమలుకు సిద్ధమయ్యారు. 2020 జనవరి 26 వ తేదీ నుంచి ఈ పధకం అమల్లో భాగంగా తల్లులకు 15 వేల రూపాయలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అమ్మ ఒడి పధకం కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివించే వారికే వర్తిస్తుందని ఏపి ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించిన నేపద్యంలో అమ్మ ఒడి పధకంపై గందరగోళం నెలకొంది. ఈ గందరగోళానికి తెర దించాలని ముఖ్యమంత్రి కార్యాలయం భావించి అమ్మ ఒడి పధకం అమలుపై స్పష్టతనిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసింది. పేద పిల్లలు చదివేది ప్రభుత్వ పాఠశాల అయినా...ప్రైవేట్ పాఠశాల అయినా ప్రతి ఒక్కరికి అమ్మ ఒడి పధకం వర్తిస్తుందని CMO స్పష్టత ఇచ్చింది.

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు, రూపురేఖలను మారుస్తామని సియం జగన్ ప్రకటించారు. ఈ దిశగా ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచే దిశగా అన్ని చర్యలు త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు సియంవో ప్రకటించింది. దేశంలో నిరక్ష్యరాస్యతా శాతం 26ఉంటే, ఏపిలో అది 33శాతం ఉందని, అంటే అక్షరాస్యతలో రాష్ట్రం దేశంలో అట్టడుగున ఉందని సియంవో ప్రకటించింది. ఈ పరిస్థితిని మార్చి పేద పిల్లల్లో ప్రతి ఒక్కరూ బడికి వెళ్లి చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క తల్లి తమ పిల్లలను మంచి చదువులు చదివించాలనే లక్ష్యంతో అమ్మ ఒడి పధకం ప్రభుత్వం ప్రకటించిందని వెల్లడించారు.

అమ్మ ఒడి పధకం అమలుపై విద్యా శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలోని పిల్లల వివరాలను, వారి కటుంబ సభ్యుల వివరాలను సేకరించే పనిలో పడింది. కొద్ది రోజుల క్రితం ఆర్ధిక శాఖ నిర్వహించిన సమావేశంలో ప్రాధమికంగా అందిన సమాచారం మేరకు ప్రభుత్వ పాఠశాలలో 39లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారని అంచనా. కాగా ప్రతి ఏటా కొత్తగా 3లక్షల 50వేల మంది విద్యార్ధులు ప్రవేశాలు జరుగుతున్నాయని నిర్ధారించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులు సుమారు 70లక్షల మంది వరకు ఉన్నారని, అయితే ప్రజా సాధికార సర్వే, ఆధార్ డేటాతో సరిపోల్చగా 61లక్షల మంది వివరాలు మాత్రమే లభించినట్లు సమాచారం. వీరంతా 40 లక్షల కుటుంబాలకు చెందిన వారుగా ప్రాధమికంగా ప్రభుత్వం గుర్తించింది. మరో 9లక్షల మంది విద్యార్ధుల వివరాలను గుర్తించాల్సి ఉంది. అయితే తల్లితండ్రులకు ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉండే కుటుంబాల సభ్యుల సంఖ్యను కూడా గుర్తించే పనిలో పడింది ప్రభుత్వం. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్ధుల వివరాలను ఇటీవల ఆర్ధిక శాఖకు విద్యాశాఖ అధికారులు అందించారు. ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పేదలైన తెల్లరేషన్ కార్డులు కలిగి ఉన్న తల్లితండ్రుల పిల్లలకు అమ్మ ఒడి పధకం వర్తింప చేయనుంది. అమ్మవడి పథకం అమలుకు ఆరునెలల సమయం ఉండటంతో పూర్తి స్థాయిలో విధి విధానాలు ఖరారుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కసరత్తు పూర్తయితే గాని ఎంతమందికి ఈ పథకం వర్తిస్తుందనే క్లారిటీ రానుంది. 

Full View

Tags:    

Similar News