కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన అమరావతి మహిళలు

Update: 2020-01-05 10:46 GMT

విశాఖపట్నంలో పరిపాలనా, కర్నూలులోని హైకోర్టు, అమరావతిలో అసెంబ్లీ రాజధాని లను ఏర్పాటు చేయాలనీ ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుండగా.. జిఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ సంస్థ ఇప్పటికే తన నివేదికలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సమర్పించాయి. ఫైనల్ గా హై పవర్ కమిటీ నివేదిక కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఈనెల 26 న హై పవర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. మరోవైపు మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతిలో రైతులు నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో అమరావతికి చెందిన రైతులు కేంద్ర హోంమంత్రి జి కిషన్ రెడ్డిని హైదరాబాద్ లోని పద్మానగర్ లోని తన నివాసంలో కలుసుకున్నారు. మహిళా రైతులు కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లి అమరావతిని రాజధానిగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయనను వేడుకున్నారు.

భావోద్వేగానికి గురైన మహిళలు న్యాయం చెయ్యాలని కోరుతూ.. మంత్రి పాదాలకు నమస్కరించారు. రైతులను ఓదార్చిన కిషన్ రెడ్డి మీ బాధలు అర్ధం చేసుకున్నాను.. చేయగలిగింది చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర అంతర్గత వివాదాలతో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని.. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిది అని మంత్రి కిషన్ రెడ్డి ఇదివరకే స్పష్టం చేశారు. అలాగే రాజ్యసభ ఎంపి జివిఎల్ నరసింహారావు కూడా రాజధాని అంశంపై కేంద్రం జోక్యం ఉండదని చెప్పారు. ఇదిలావుంటే ఏపీ బీజేపీ నేతలు కన్నా లక్ష్మీ నారాయణ, ఎంపీ సుజనా చౌదరి, నెహ్రు యువకేంద్రం వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి లు అమరావతికి అనుకూలంగా మాట్లాడుతుండటం విశేషం. 


Tags:    

Similar News