ఈ ఘటనలు అమరావతిలో జరగలేదు..

Update: 2020-01-11 03:28 GMT

మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతిలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు అమరావతి నిరసనలకు సంబంధం లేని ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దాంతో అవి వైరల్ గా మారాయి. ఎక్కడో జరిగిన సంఘటనలను అమరావతిలో జరిగినట్టు చేస్తున్న ప్రచారంపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వ్యక్తులపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. గత రెండు రోజులగా ఒక వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని ఆత్మహత్య చేసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమరావతిలో తనపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారన్న కారణంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రచారం చేశారు. దీన్ని రాజకీయ పార్టీలు కూడా వారి పేజీలు, అకౌంట్లలో షేర్ చేశాయి. దాంతో అమరావతిలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పోలీసుల వేధింపుల వల్లే అతను ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు సామాజిక మాధ్యమాల ద్వారా ఆరోపించారు. అయితే వాస్తవానికి ఈ ఘటన అమరావతిలో జరగలేదని తెలిసింది.

తమిళనాడుకు చెందిన వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. పైగా అమరావతి సమీపంలో ఇటువంటి ఘటనే నమోదు కాలేదని పోలీసులు వెల్లడించారు. ఇదే కాక యువతి తలకు రక్తస్రావం అయిన ఫోటో కూడా వైరల్ గా మారింది. శుక్రవారం పోలీసు లాఠీ ఛార్జ్‌లో యువతికి తీవ్ర గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. అయితే పొరపాటున ఆ ఫోటోను చూపిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విమర్శలు చేశారు.

వాస్తవానికి ఈ ఫోటో కూడా అమరావతికి సంబంధించి కాదని తెలిసింది. బీహార్ లోని భాగాత్ పూర్ లో జరిగిన శోభాయాత్రలో హిందూ, ముస్లింల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఈ యువతి కూడా ఉంది. అయితే ఆమె అమరావతికి చెందిన యువతిగా ప్రచారం చేశారు. వీటి వలన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అమరావతిలో ఏమి జరుగుతుందో అర్ధం కాక ఖంగారు పడ్డారు. అయితే ఈ ఘటనలు అమరావతిలో జరగలేదని పోలీసులు వెల్లడించారు. ప్రజలను రెచ్చగొట్టేలా ఇలాంటివి ప్రచారం చేయొద్దని పోలీస్ శాఖ సూచిస్తోంది. ఫేక్ వార్తలు కూడా ప్రచారం చెయ్యొద్దని సూచిస్తున్నారు.

Tags:    

Similar News