అమరావతిలో తెల్లవారుజామునుంచే రోడ్లపైకి వచ్చిన రైతులు

Update: 2020-01-03 02:51 GMT

అమరావతి నుండి రాజధానిని మార్చాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కోరుతూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళన శుక్రవారం 17వ రోజుకి చేరుకుంది. రాజధాని ప్రాంతంలోని యర్రబాలెం, నీరుకొండ, కృష్ణయపాలెం, నవులూరు, మందడం , వెలగపూడి, తుల్లూరు, ఉద్దందరాయునిపాలెం మరియు ఇతర గ్రామాల రైతులు నిరసనలు తెల్లవారుజామునుంచే కొనసాగిస్తున్నారు. చలిని సైతం లెక్కచేయకుండా వారంతా రోడ్లపైకి వచ్చి టెంట్లలో కూర్చుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. కృష్ణ, గుంటూరు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల టీడీపీ నేతలు వారి ఆందోళనలకు మద్దతు తెలియజేస్తున్నారు.

రాయలసీమ ప్రాంతానికి ఉద్యమంపై అవగాహన కల్పించడమే కాకుండా గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనను ముమ్మరం చేస్తామని అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) నాయకులు ప్రకటించారు. రాజధానిపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వికేంద్రీకృత అభివృద్ధికి సంబంధించిన నివేదికను శుక్రవారం ముఖ్యమంత్రికి ఇవ్వబోతున్నందున, రైతులు, జెఎసి సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా బంద్ కోసం పిలుపునిచ్చారు. నిరసనకారులు విజయవాడ నుండి తిరుమల తిరుపతి కొండకు పాదయాత్రను చేపట్టారు. అమరావతి జెఎసి సభ్యులు తుమ్మల సత్య, పెందుర్తి శ్రీకాంత్ గురువారం బెంజ్ సర్కిల్ లోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు, అలాగే టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. 

Tags:    

Similar News