నేడు మెగా ర్యాలీ నిర్వహించనున్న అమరావతి న్యాయవాదులు

Update: 2019-12-26 02:29 GMT

అమరావతి నుండి రాజధానిని మారుస్తారన్న వ్యాఖ్యలపై అక్కడి రైతుల తీవ్రంగా మండిపడుతున్నారు. గత కొద్దిరోజులుగా వీరి ఆందోళన చర్చనీయాంశయంగా మారింది.. ఇతర వర్గాల ప్రజలు కూడా ఇందులో చేరారు. అమరావతిలో రైతుల ఆందోళన బుధవారం ఎనిమిదో రోజుకు చేరుకోవడంతో ప్రజలు వివిధ రూపాల ద్వారా తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. 'వన్ స్టేట్-వన్ క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్-క్యాపిటల్ అమరావతి' నినాదాలతో ఆందోళనలు చేశారు. కొందరు రైతులు అరగుండు కొట్టించుకొని కృష్ణా నది బ్యారేజిపై నిలబడి నిరసనలు చేస్తుంటే.. మరికొందరు చెప్పుల దండలు ధరించి, ర్యాలీలు చేపట్టడం, రోడ్ల మీద వచ్చే పొయ్యే ప్రయాణికులను అడ్డుకోవడం, చేస్తున్నారు. మహిళలు, పిల్లలు కూడా రాజధాని ప్రాంతంలోని ప్రతి గ్రామంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజధానిని మార్చాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లాకు చెందిన మహిళలు ఉద్దండరాయునిపాలెం వద్ద పూజలు చేశారు. మందడం గ్రామంలో వందలాది మంది ప్రజలు తీవ్ర నిరసన తెలియజేశారు. ప్రపంచ స్థాయి రాజధానిని ఇక్కడ నిర్మిస్తానని చంద్రబాబు అంటే తామంతా నమ్మి భూములు ఇచ్చామని.. తీరా జగన్ తమను నట్టేటా ముంచుతున్నారని ఆరోపించారు.

అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేస్తామని అంటే అందుకు జగన్ కూడా మద్దతు ఇచ్చారు. కానీ, ఇప్పుడు మూడు రాజధానులను అభివృద్ధి చేస్తానని పేర్కొంటూ యు-టర్న్ తీసుకుంటున్నాడని దుయ్యబట్టారు. మరోవైపు, ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్, అడ్వకేట్స్ జెఎసితో కలిసి ప్రకాశం బ్యారేజీపై గురువారం మెగా ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. నిరసనలలో వివిధ జిల్లాల నుండి ప్రాక్టీసింగ్ న్యాయవాదులు పాల్గొంటున్నారని తెలిపారు. హైకోర్టును ఇక్కడి నుంచి కర్నూలుకు మార్చాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చేపడతామని హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శి పీతా రామన్ తెలిపారు. అయితే తమకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం మా హక్కు. మేము పదేపదే ప్రయత్నించినప్పటికీ పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదు. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు నిర్వహిస్తాము అని ఆయన అన్నారు. 

Tags:    

Similar News