Ali at Delhi BJP Office: విన్నారా.. ఆలీ అందుకే బీజేపీ ఆఫీసుకు వెళ్లారట!

Update: 2020-01-24 10:45 GMT
comedian Ali (file Photo)

ప్రముఖ కమెడీయన్.. వైసీపీ నాయకుడు ఆలీ అకస్మాత్తుగా ఢిల్లీ లో ప్రత్యక్షమయ్యారు. ఆ ఎదో పనిమీద వెళ్ళుంటారులే.. ఢిల్లీ వెళ్లడం వింత ఏమిటి? అనుకుంటున్నారా? మామూలుగా అయితే అది పెద్ద విషయం కాదు. కానీ, వెళ్ళింది ఆలీ.. అదీ ఢిల్లీలో బీజేపీ ఆఫీసు వద్ద కనిపించారు. మరి ఇది విశేషమే కాదంటారా?

ఆలీ గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. వైసీపీ లో చేరిన క్రమంలో అయన తన స్నేహితుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ ని కూడా పక్కన పట్టారు.. కొన్ని సందర్భాలలో ఆయనను తీవ్రంగా విమర్శించారు కూడా. ఎన్నికలు అయిపోయాయి. ఆ ఎన్నికల సమయంలో ఆలీ తో పాటు పలువురు సినీ నటులు వైసీపీ తరఫున నిలిచి ప్రచారం చేశారు.

ఎన్నికల సమయంలో తనకు అండగా నిలిచిన సినీ నటులకు జగన్ పదవులు పందేరం చేస్తారని అందరూ భావించారు. కొంతవరకూ అది నిజం అయింది కూడా. అందులో భాగంగా కమెడియన్ పృద్వీ కి ఎస్వీబీసీ చైర్మన్ పదవి కూడా దక్కింది. అయితే, ఆలీకి కూడా ఏదైనా పదవి వస్తుందని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. దాంతో కొంత కాలంగా ఆలీ వైసీపీ పై అసంతృప్తి తో ఉన్నారనీ, అయన పార్టీ మారే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ, ఆలీ మాత్రం ఎక్కడా ఈ విషయంలో పెదవి విప్పలేదు. ఆలీ విషయంలో వెలువడిన కథనాలన్నీ కల్పితాలుగా భావించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆలీ అకస్మాత్తుగా ఢిల్లీ బీజేపీ ఆఫీసు వద్ద ప్రత్యక్షం అవడంతో మళ్ళీ అయన పార్టీ మారుతున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే, తన ఢిల్లీ పర్యటన విషయంపై ఆలీ వివరణ ఇచ్చారని తెలుస్తోంది.

అందుకోసమేనట..

ఢిల్లీలో మీడియా తో ఆలీ మాట్లాడుతూ.. తాను వ్యక్తిగతమైన పనిమీద ఢిల్లీ వచ్చానని చెప్పుకొచ్చారట. ఓ హాలీవుడ్ డైరెక్టర్ త్వరలో భారత్‌కు రాబోతున్నారని.. ఆయన ప్రధాని మోదీని కలవాలని భావిస్తున్నారని చెప్పారట ఆలీ. ఈ పని కోసం ప్రధాన మంత్రి అపాయింట్‌మెంట్ కోసం ఢిల్లి వెళ్లినట్లు చెప్పుకొచ్చారని తెలుస్తోంది. తాను కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలిసి అపాయింట్‌మెంట్ గురించి చర్చించానని.. ఆయన సైతం సానుకూలంగా స్పందించారని ఢిల్లీ లో మీడియా వర్గాలతో ఆయన పేర్కొన్నట్టు తెలుస్తోంది. దీంతో అయన బీజేపీలో చేరడం కోసమే ఢిల్లీ వచ్చారన్న వార్తల్లో నిజం లేదని క్లారిటీవచ్చినట్టైంది.  

Tags:    

Similar News