'అమ్మఒడి'కి పాలనా అనుమతులు.. నిధుల సమీకరణ పూర్తి..

Update: 2020-01-05 07:44 GMT

ఏపీలో ప్రతిష్టాత్మక 'జగనన్న అమ్మ ఒడి'కి ప్రారంభానికి సర్వం సిద్ధం అయింది. అమ్మఒడి కోసం నిధుల సమీకరణ పూర్తయింది. ఈనెల తొమ్మిదో తారీఖున అమ్మఒడి కార్యక్రమం అమలు కోసం వివిధ శాఖల నుంచి నిధుల విడుదలకు పాలనా అనుమతులు లభించాయి. వివిధ శాఖల ఖాతాల నుంచి అమ్మ ఒడి కి రూ. 6 వేల 109 కోట్ల రూపాయల మేర నిధులు సమీకరించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే మరో ఐదు వందల కోట్ల రూపాయల మేర అవసరం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 42 లక్షల పైచిలుకు అమ్మఒడి లబ్ధిదారులను గుర్తించారు. మరో 8 లక్షల పేర్లు పెండింగులో ఉన్నాయి. అందులో లక్షమందికి పైగా రేషన్ కార్డులు లేకపోవడంతో జాబితాలో చేరలేదని సమాచారం.

అంతేకాదు కొంతమందికి జాయింట్ బ్యాంకు ఖాతా ఉండటంతో లింకింగ్ కుదరలేదు. రెండు మూడు రోజుల్లో మరికొంతమంది లబ్ధిదారులను అమ్మఒడి జాబితాలో చేర్చనున్నట్టు సమాచారం. కాగా పిల్లలను పాఠశాలలకు పంపించే ప్రతి నిరుపేద తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే బృహత్తర సంక్షేమ కార్యక్రమం అమ్మ ఒడి పథకాన్ని ఈనెల 9న అధికారికంగా చిత్తూరు జిల్లాలో ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.. ఇందుకోసం కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నా ఇంకా ఫైనల్ కాలేదని సమాచారం.

ఇదిలావుంటే అమ్మఒడి కి రాష్ట్రంలోని 61,271 స్కూళ్లు, 3,083 కాలేజీలు అర్హత సాధించాయని ప్రభుత్వం తెలిపింది. అయితే కొన్ని పాఠశాలలు, కాలేజీలకు గుర్తింపు రద్దైన కారణంగా అమ్మఒడి వర్తింపు కాలేదు. కానీ ఈ పాఠశాలలో విద్యార్థులు కూడా లేరని ప్రభుత్వం గుర్తించింది. కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అమ్మఒడి వర్తింపు అని ప్రచారం చేస్తున్నారని.. అది అవాస్తవమని.. రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులు/సంరక్షకులకు ఈ పథకానికి అర్హులు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. 


Tags:    

Similar News