టీచింగ్ అస్పత్రులకు 784 మంది స్పెషాలిటీ వైద్యులు
సెకండరీ/టీచింగ్ ఆసుపత్రులకు కొత్తగా 784 మంది పీజీ వైద్యులు (సీనియర్ రెసిడెంట్సు) జనవరి 1 నుంచి రాబోతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
అమరావతి: సెకండరీ/టీచింగ్ ఆసుపత్రులకు కొత్తగా 784 మంది పీజీ వైద్యులు (సీనియర్ రెసిడెంట్సు) జనవరి 1 నుంచి రాబోతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వీరి రాకతో పేదలకు వైద్య సేవలు మరింత చేరువ కాబోతున్నాయని తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరంలో పీజీ వైద్య విద్యలో రాష్ట్ర కన్వీనర్ కోటా కింద చేరి, కిందటి నెలలో చదువు పూర్తిచేసిన వారికి ప్రాంతీయ, సామాజిక, జిల్లా, బోధనాసుపత్రుల్లో పోస్టింగులు ఇవ్వబోతున్నామని మంత్రి తెలిపారు.
స్పెషాల్టీల వారీగా వీరి సేవలను సదరు ఆసుపత్రుల్లో అవసరాలకు తగ్గట్లు పొందేందుకు వీలుగా జాబితాలు రూపొందించామని శనివారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రారంభమైన ఆప్షన్ల నమోదు ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. వెంటనే పోస్టింగులు ఇస్తామని చెప్పారు. వీటిని పొందిన వారు జనవరి 5వ తేదీలోగా విధుల్లో చేరాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఖాళీలతో సంబంధం లేకుండా ఇకపై ప్రతి ఏడాది సీనియర్ రెసిడెంట్సు సేవలు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
6 నెలల చొప్పున బోధనాసుపత్రులు, సెకండరీ ఆసుపత్రుల్లో పనిచేయాలి!
784 మంది పీజీ వైద్యులు ఆరు నెలలు బోధనాసుపత్రుల్లో, మరో ఆరునెలలు సెకండరీ ఆసుపత్రుల్లో తప్పకుండా పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీరికి గౌరవ వేతనం కింద రూ.80,500ను డిసెంబరు 4, 2024న జారీచేసిన జీఓ 723 ప్రకారం ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రి వెల్లడించారు. 2022-23 విద్యా సంవత్సరంలో రాష్ట్ర కన్వీనర్ కోటాలో చేరి, పీజీ వైద్య విద్య పూర్తిచేసిన వారు 784 మంది 23 స్పెషాల్టీల్లో ఉన్నారు. జనరల్ మెడిసిన్ లో 110, జనరల్ సర్జరీ-91, గైనిక్-87, ఎనస్థీషియా-81, ఆర్థో-53, పీడియాట్రిక్స్లో 58 చొప్పున ఉన్నారు. మిగిలిన వారు రేడియాలజీ, ఆప్తమాలజీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, ఇతర స్పెషాల్టీలతోపాటు, పీజీ నాన్-క్లినికల్ కోర్సుల్లో పీజీ వైద్య విద్య పూర్తి చేశారు.
ఈ 784 మందిలో ప్రాంతీయ, సామాజిక, జిల్లా ఆసుపత్రు(మొత్తం 102)ల్లో కలిపి 393 మంది, మిగిలిన వారు 17 బోధనాసుపత్రుల్లో పనిచేయనున్నారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోని సీహెచ్సీ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లోని పడకల సంఖ్యకు అనుగుణంగా గుర్తించిన స్థానాలకు కొత్తగా రానున్న సీనియర్ రెసిడెంట్సువల్ల రోగులకు వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు తెలిపారు. అలాగే, సదరం శిబిరాలకు సీనియర్ వైద్యులు వెళ్తున్న తరుణంలో సీనియర్ రెసిడెంట్సువల్ల వైద్య సేవలు యధావిధిగా రోగులకు అందుబాటులో ఉంటాయన్నారు.
2014 నుంచి 2017 వరకు కొనసాగిన సీనియర్ రెసిడెంట్సు విధానం!
రాష్ట్ర కన్వీనర్ కోటాలో పీజీ వైద్య విద్యను పూర్తిచేసిన వారు తప్పనిసరిగా ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే విధానం 2014 నుంచి 2017 వరకు కొనసాగింది. వివిధ కారణాలతో ఆగిన ఈ విధానాన్ని రోగులకు అవసరమైన సేవలు మెరుగుపరిచేందుకు, వైద్యుల కొరత అధిగమించేందుకు మళ్ళీ పునరుద్ధరించారు. దీని ప్రకారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం శనివారం నుంచి ఆప్షన్ల నమోదు ప్రారంభమైంది. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆప్షన్ల స్వీకరణ జరుగుతుంది. కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్ లు ఇస్తామని డీఎంఈ చెప్పారు. తప్పనిసరిగా ఏడాదిపాటు సర్వీసు చేయని వారు రూ.40 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని డీఎంఈ డాక్టర్ రఘునందన్ తెలిపారు. పీజీ ప్రవేశాల సమయంలోనే పీజీ స్టూడెంట్స్ కాలేజీల ప్రిన్సిపాల్స్ కు బాండ్ ఇచ్చారని చెప్పారు.