
హైవేపై సైన్ బోర్డులో చిక్కుకుని గాల్లో వేలాడుతున్న థార్ జీప్ వీడియో వైరల్ అవుతోంది. అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న ఆ వీడియో వెనుక ఉన్న నిజం తెలిస్తే అవాక్కవుతారు
మీరు ఓ హైవే పై కారులో వెళుతున్నారు. సడన్ గా మీకో దృశ్యం కనిపించింది. ఒక జీప్ లాంటిది ఎదురుగా ఉన్న సైన్ బోర్డుపై ఎక్కి వేలాడుతోంది. అప్పుడు మీకేమనిపిస్తుంది? వామ్మో ఏంటిది.. అసలు ఆ వెహికిల్ అంత ఎత్తుకు ఎలా వెళ్ళింది? అక్కడ ఎలా చిక్కుపడిపోయింది అని కదూ. సరిగ్గా ఇలాంటి ఆశ్చర్యమే కొన్ని రోజులుగా ఇలాంటి ఒక దృశ్యం ఉన్న వీడియో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. విషయం ఏమిటంటే..
దిల్లీలోని జాతీయ రహదారిపై ఉన్న ఓ సైన్‌బోర్డును మహీంద్రా థార్ ఎస్‌యూవీ వాహనం ఢీకొట్టి గాల్లోనే ఆగిపోయినట్లు కనిపిస్తోంది. ఈ ఘటన దిల్లీ–గురుగ్రామ్ మార్గంలో జరిగిన నిజమైన ప్రమాదమని కొందరు ప్రచారం చేశారు. ఈ వీడియో ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికలపై విస్తృతంగా షేర్ అవుతోంది. వీడియోలో జాతీయ రహదారిపై “దిల్లీ, గురుగ్రామ్, జైపూర్ ఎగ్జిట్ 22, ఎన్‌హెచ్-48” అని రాసి ఉన్న సైన్‌బోర్డు కనిపిస్తుంది. ఒక మహీంద్రా థార్ వాహనం ఆ బోర్డును ఢీకొట్టి అందులోనే చిక్కుకుని గాల్లో నిలిచిపోయినట్లుగా కనిపిస్తుంది. ఆ వీడియో ఇక్కడ మీరూ చూసేయండి..
ఆ రోడ్డుపై వెళ్తున్న మరో కారులోనుంచి ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లుగా వీడియో ఉంది. వాహనం సైన్‌బోర్డులో ఇరుక్కుపోయి కొన్ని గంటల పాటు గాల్లోనే నిలిచిపోయిందని ఈ వీడియోను షేర్ చేస్తూ కొందరు తమ పోస్టుల్లో పేర్కొన్నారు. ఈ ఘటన జైపూర్ సమీపంలో జరిగిందని కూడా కొన్ని వాదనలు వినిపించాయి.
అయితే, ఈ వీడియో నిజమైనదా.. కాదా అనే విషయంపై పీటీఐ వార్తా సంస్థ వెరిఫై చేసింది. ఆ వీడియోపై నిజం ఏమిటో చెప్పింది. పీటీఐ ప్రకారం ఈ వీడియో పూర్తిగా అబద్ధం. వీడియోలోని దృశ్యాలు, వాహనం స్థితి, భౌతిక సూత్రాలకు విరుద్ధంగా కనిపించే అంశాలను విశ్లేషించి చివరకు ఇది పూర్తిగా ఏఐ జనరేటివ్ వీడియో అని నిర్ధారించింది. వాస్తవానికి ఇలాంటి ప్రమాదం జరిగినట్లు ఎటువంటి అధికారిక సమాచారం లేదని పీటీఐ స్పష్టం చేసింది.
ఈ మధ్య కాలంలో ఏఐ తో విపరీతంగా వీడియోలు రూపొందిస్తున్నారు. అవి చూస్తే నిజమైన వీడియోల్లానే ఉంటున్నాయి. దాంతో ఆ సంఘటనలు నిజంగా జరిగాయేమో అని భావించడం జరుగుతుంది. అయితే, వాటిని జారత్తగా పరిశీలిస్తే విషయం అర్ధం అయిపోతుంది. ఈ వీడియోనే తీసుకుంటే.. నిజంగా థార్ లాంటి వెహికిల్ అంత ఎత్తుకు ఎగరాలంటే అత్యంత వేగంగా వెళ్ళాలి. ఆ రోడ్డుపై అంత వేగంగా వెళ్లగలిగేలా అవకాశం ఉండదు. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ అది ఏ రాత్రి సమయంలోనో జరిగింది అనుకుంటే.. వీడియో పట్టపగలు ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ ఆ వెహికిల్ నిజంగా అంత ఎత్తుకు ఎగిరి సైన్ బోర్డును ఢీకొడితే అది మొత్తం కదిలిపోతుంది. కనీసం ఆటో ఇటో వంగిపోతుంది. థార్ బరువుకి విరిగిపోవచ్చు. కానీ సైన్ బోర్డు స్థిరంగా ఉంది. థార్ చిక్కుకున్నట్టు కనిపిస్తున్న దానికి ఇరువైపులా అది చెక్కు చెదరలేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ విషయాలు అర్ధం అవుతాయి.
ఫ్యాక్ట్ చెక్ సంస్థలు సోషల్ మీడియాలో కనిపించే వింత వీడియోల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. ఏఐ తో రూపొందించిన వీడియోలను నిజమైనవిగా భావించి రీపోస్టులు చేయడం మంచిది కాదని చెబుతున్నాయి. దీనివలన అనవసరంగా గందరగోళం ఏర్పడుతుందని అంటున్నాయి. నిజం నిర్ధారణ చేసుకున్న తరువాతనే ఇలాంటి వీడియోలను షేర్ చేయాలని సూచిస్తున్నాయి.
ఇక ఈ వీడియో పూర్తిగా ఏఐ తో రూపొందించిందని తేలిపోయింది. అదండీ సంగతి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




