అమ్మ కోసం!

అమ్మ కోసం!
x
Highlights

ఆడజన్మకి శాపమా? ఆడదై పుట్టడమే పాపమా? ఏ తప్పులకీ శిక్ష? ఈ జన్మకెందుకీ పరీక్ష? అభం శుభం తెలియిని ఓ పసికందు పాలుగారే వయసులోని మరో పసిబిడ్డల దీన గాథ! ఈ...

ఆడజన్మకి శాపమా? ఆడదై పుట్టడమే పాపమా? ఏ తప్పులకీ శిక్ష? ఈ జన్మకెందుకీ పరీక్ష? అభం శుభం తెలియిని ఓ పసికందు పాలుగారే వయసులోని మరో పసిబిడ్డల దీన గాథ! ఈ పాప చేసిన పాపం ఏంటి?

పుట్టీపుట్టగానే కన్నతల్లికి దూరమైంది ఓ చిట్టితల్లి. ఏ ఒత్తిళ్లో తెలియదు కానీ, తల్లి పొత్తిళ్ళలోంచి మరో మహిళ చేతుల్లో చిక్కి మెట్ పల్లి అంగట్లో బొమ్మైంది. రకరకాల మలుపుల్లో చివరకు శిశు హోంకి చేరి అమ్మ కోసం ఎదురు చూస్తున్నది. "అమ్మ"కానికి తెచ్చిన మహిళతోపాటు పట్టుబడ్డ మరో పాలుగారే వయసులోని మరో పాప పాపం తల్లి కోసం తల్లడిల్లుతున్నది.

పసికందు వయసు 11 రోజుల వయసులో కన్న తల్లి పొత్తిళ్ళ నుంచి నేరుగా మెట్ పల్లి అంగట్లోకి చేరింది. ఓ దళారి మహిళ చేతిలో సరుకైంది. తాను సాటి మహిళేనన్న నిజాన్ని మరచి, మెట్ పల్లి నడి బజారులో వేలం పెట్టింది జ్యోతి అనే ఆ మహా తల్లి. రూ.20 వేలిస్తే ఇస్తా నంటూ బేరం పెట్టింది. విషయం కాస్తా మీడియా కంట పడటంతో నా బిడ్డ నా ఇష్టం... చంపుకుంట... అమ్ముకుంట...మీ కేంది? అంటూ దౌర్జన్యంగా దర్జా ఒలకబోసింది.

బజారులో ఇద్దరు పసి బిడ్డలను పట్టుకుని వేలం వేసి ఆ మహిళ పాపం అక్కడే పండింది. బిడ్డలను అమ్మడం నేరమంటూ పోలీసులు ఆ మహిళను అరెస్టు చేశారు. ఆమె ఒల్లో ఉన్న పసి కందుని, వెంట వున్న ఎడపాపని కరీంనగర్ లోని స్త్రీ శిశు సంక్షేమశాక శిశు గృహానికి తరలించారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇక్కడే కథ ఓ కొత్త మలుపు తిరిగింది.

ఇంతలో నిజామాబాద్ జిల్లా ఆర్మూరు తన ఊరంటూ సుమలత అనే మహిళ తెర మీదకు వచ్చింది. తన బిడ్డని ఎవరో కిడ్నాప్ చేశారని, మెట్ పల్లిలో జ్యోతి అమ్మిచూపిన బిడ్డ తన కడుపు పంట అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు ఈ ఏడాది జూన్ 17న తమకు పసికందు కిడ్నాపైనట్లుగా ఫిర్యాదు అందిందని, అంతకుముందే మెట్ పల్లి పోలసులు ఓ పసికందుని అమ్మబోయిన మహిళని అరెస్టు చేశారని వివరించారు ఆర్మూరు సి ఐ రాఘవేంద్ర

ఇదిలావుండగా ప్రస్తుతం ఆ బిడ్డలిద్దరూ కరీంనగర్ శిశుగృహంలో ఉన్నారు. తమ తమ తల్లుల కోసం ఎదురు చూస్తున్నారు.

ఆ బిడ్డల తల్లిదండ్రులెవరూ నిర్ణీత సమయంలో రాకపోతే, నిబంధనల ప్రకారం ఆబిడ్డలను దత్తత ఇస్తామని, అప్పటి దాకా ఆ పిల్లలు ఏలోటూ లేకుండా తమ వద్దే ఉంటారంటున్నారు సంబంధిత అధికారిణి. నా బిడ్డని అమ్మకుంటా చంపుకుంటానన్న జ్యోతి ఆ పసికందుని తన బిడ్డ అంటుండగా, లేదు ఆ పసికందు తనబిడ్డేనంటూ సుమలత కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలా బిడ్డ ఎవరి బిడ్డో తేల్చి, మిస్టరీని ఛేదించే పనిలో ఉన్నారు పోలీసులు.

మరి ఆ తల్లీ, బిడ్డలు ఒక్కటవుతారా? ఎప్పటిలోగా పోలీసులు ఈ కేసుని ఛేదిస్తారు? డిఎన్ఎ లాంటి పరీక్షల ద్వాదా ఆ పసికందు ఎవ్వరనే విషయాన్ని తేల్చడానికి పోలీసులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే డిఎన్ ఎ కోసం రక్త నమూనాలు సేకరించారు. రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు.

ముక్కు పచ్చలారని మూడున్నరేళ్ళ ఆ బిడ్డని పలకరిస్తే తమది నిజామాబాద్ అని చెబుతున్నది. తన తల్లి గంగ జ్యోతి అని, తండ్రి సతీశ్ అని అంటున్నది. ఈ పాప చెబుతున్న ప్రకారం నిజామాబాద్ ఊరు, తల్లి జ్యోతి, తండ్రి సతీశ్. తండ్రి అడ్రస్ లేదు. తల్లి జ్యోతి అంటే.. ఈ పాప అరెస్టైన జ్యోతి బిడ్డే నా? బహుశా అవుననే అనుమానిస్తున్నారు పోలీసులు. అరెస్టైన సమయంలో జ్యోతి చెప్పిన ఊరు అర్మూరు. అర్మూరు నుంచి పాపని నేరుగా మెట్ పల్లికి తెచ్చింది కాబట్టి అర్మూర్ అని చెప్పి ఉంటుంది. ఇక ఈ పాప చెప్పే ప్రకారం ఆమె ఊరు నిజామాబాద్ అయ్యే అవకాశం ఉంది. పైగా జ్యోతి అరెస్ట్ అయిన కారణంగానే ఈ మూడున్నరేళ్ళ బిడ్డ కోసం ఎవరూ రాలేదేమో అనే యాంగిల్ ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు సుమలత బిడ్డే ఆ పసికందు అనే అనుమానాలు బలపడుతున్నాయి. బిడ్డతోపాటు దొరికిన జ్యోతి అర్మూరు నుంచి వచ్చాననడటం, సుమలతది ఆర్మూరే కావడం ఒక కారణంగా కాగా, ఆ బిడ్డ తన బిడ్డేనంటూ కిడ్నాప్ కి గురైందని సుమలత ఆరోపించడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా ఈ వాదానికి బలం చేకూరుస్తున్నాయి.

రకరకాల ములపులు తిరిగుతున్న ఈ మిస్టరీలో ఇక తేలాల్సినవి రెండే రెండు అంశాలు. జ్యోతి సుమలత బిడ్డని కిడ్నాప్ చేసి అమ్మకానికి పెట్టిందా? అనేది ఒకటైతే, రెండో బిడ్డ జ్యోతి బిడ్డేనా? అన్నది రెండోది. ఈ ప్రశ్నలకు పోలీసుల విచారణ, డిఎన్ఎ రిపోర్టులే సమాధానం చెప్పనున్నాయి.

ఇక్కడ ఆర్మూరు పెర్కిట్ లో కన్న బిడ్డ కోసం ఓ కన్న తల్లి తల్లడిల్లుతున్నది. అక్కడ మెట్ పల్లిలో తల్లి ఒడి కోసం, అమ్మ ఆలనా, పాలన కోసం రెండు పసి హృదయాలు పరితపిస్తున్నాయి. అసలు విషయం తేల్చాల్సిన మరో తల్లి జైలులో ఉన్నది. ఇక ఈ మిస్టరీని తేల్చాల్సింది పోలీసులే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories