రాజీనామా ప్రకటన ఉత్తమ్‌ ఇప్పుడే ఎందుకు చేశారు?

రాజీనామా ప్రకటన ఉత్తమ్‌ ఇప్పుడే ఎందుకు చేశారు?
x
ఉత్తమ్ కుమార్ రెడ్డి
Highlights

రాజీనామా ఊహించిందే. కానీ ఇప్పుడే ప్రకటించడానికి కారణమేంటి? మున్సిపల్‌ ఎన్నికలకు ముందే, రాజీనామా ముచ్చట చెప్పడం వెనక ఉత్తమ్‌ ఉద్దేశమేంటి? ఉత్తమ్...

రాజీనామా ఊహించిందే. కానీ ఇప్పుడే ప్రకటించడానికి కారణమేంటి? మున్సిపల్‌ ఎన్నికలకు ముందే, రాజీనామా ముచ్చట చెప్పడం వెనక ఉత్తమ్‌ ఉద్దేశమేంటి?

ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కొత్త సంవత్సర ప్రారంభానికి కొద్ది గంటల ముందు అభిమానులకు చేదు వార్త అందించారు. త్వరలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. హుజూర్‌నగర్‌లో కార్యకర్తలతో సమావేశంలో ఈ ప్రకటన చేశారు. ఉత్తమ్‌ రాజీనామా ముందే ఊహించిందే అయినా, ఇప్పుడే ఎందుకు బహిరంగంగా ప్రకటించారన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలతో సొంత నియోజకవర్గానికి సరిగా సమయం కేటాయించలేకపోతున్నానని కార్యకర్తల ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఉత్తమ్. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరించారు. హుజూర్‌నగర్ కాంగ్రెస్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు ఉత్తమ్. ఇకపై హుజూర్‌ నగర్, కోదాడ ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

టీపీసీసీ చీఫ్ పదవి విషయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో కొంత కాలంగా దుమారం రేగుతోంది. పిసిసి అధ్యక్ష పదవికి అర డజనుకు పైగా నేతలు పోటీ పడుతున్నారు. గత సంవత్సరం నవంబర్ 5న గాంధీభవన్‌లో నేతల వాగ్వివాదంతో ఈ అంశం ప్రస్ఫుటమైంది. గాంధీభవన్ వేదికగా కాంగ్రెస్ అంతర్గత కలహాలు బయటపడ్డాయి. ఏఐసీసీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ సాక్షిగా తెలంగాణ నేతలు ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు.

టీపీసీసీ పదవిపై ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కన్నేశారు. చివరి నిమిషంలో ఈ పదవిని ఆయనకు ఏఐసిసి పెద్దలు అప్పగిస్తారని అంతా భావించినా, నిర్ణయం వాయిదా పడింది. రేవంత్‌కు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించడానికి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోగా, వీహెచ్‌తో పాటు కొందరు నేతలు ఆరెస్సెస్ కార్డుతో అడ్డుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. పీసీసీ బాధ్యతలు తనకు అప్పగించాలంటూ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు బహిరంగంగానే డిమాండ్ చేశారు. గాంధీభవన్‌ వద్ద కోమటిరెడ్డి అనుచరులు పీసీసీ పదవి తమ నేతకు అప్పగించాలంటూ నినాదాలు చేశారు. ఆ పదవి తనకే దక్కుతుందని ధీమాగా ఉన్నారు కోమటిరెడ్డి.

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డితో పాటు కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టు విక్రమార్క, పార్టీ సీనియర్ నేతలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, జగ్గారెడ్డి తదితర నేతలు కూడా పీసీసీ పదవిని ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. హుజూర్‌నగర్ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి ఓటమి తర్వాత పీసీసీ పదవి మార్పు కోసం పార్టీలో డిమాండ్ పెరిగింది. దీర్ఘకాలంగా ఉత్తమ్ పిసిసి అధ్యక్షునిగా పనిచేస్తున్నా, ఆయన నేతృత్వంలో పార్టీ బలపడటం లేదని, పిసిసి అధ్యక్షున్ని మార్చాలని పార్టీ నేతలు పట్టుబట్టారు. అయితే ఈ విషయాన్ని ముందే గ్రహించిన ఉత్తమ్ హుజూర్‌నగర్ ఎన్నికల్లో ఓటమి తర్వాత పీసీసీ పదవికి తానే స్వయంగా రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

మొత్తానికి ఎలాగూ కాంగ్రెస్ అధిష్టానం పిసిసికి, కొత్త నేతను నిర్ణయించేలోపే తానే రాజీనామా చేస్తే బాగుంటుందని ఉత్తంకుమార్ రెడ్డి భావించినట్లు తెలుస్తోంది. అయితే మున్సిపల్ ఎన్నికలు ముంచుకొచ్చిన నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు ఉత్తమే పీసీసీ చీఫ్‌గా కంటిన్యూ అవుతారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి బాధ్యత నుంచి తప్పుకోవడానికే, తాను రాజీనామా చేయబోతున్నట్లు ఉత్తమ్ ప్రకటిస్తున్నారని టిఆర్ఎస్ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. మొత్తానికి ఉత్తమ్ రాజీనామా ముందే ఊహించినా, కొత్త పీసీసీ చీఫ్ రాకను గాంధీభవన్‌ స్వాగతిస్తుందా ప్రకంపనలు రేపుతుందా అన్నది చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories