Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితకు బెయిల్ ఎందుకు రావడం లేదు?

Why Kalvakuntla Kavitha not Getting Bail in Delhi Liquor Policy Case Check Here Full Details
x

Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితకు బెయిల్ ఎందుకు రావడం లేదు?

Highlights

Kalvakuntla Kavitha: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకుడు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ మళ్లీమళ్లీ తిరస్కరణకు గురవుతోంది.

Kalvakuntla Kavitha: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకుడు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ మళ్లీమళ్లీ తిరస్కరణకు గురవుతోంది. దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన కవిత పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను తాజాగా దిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు మే 6న తిరస్కరించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న దశలో బెయిల్ ఇవ్వడం కుదరదని చెబుతూ స్పెషల్ జడ్జి కావేరీ బవేజా.. కవిత బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చారు. మరి అరెస్టై దాదాపు రెండు నెలలు కావస్తున్నా కవితకు బెయిలు ఎందుకు రావడం లేదు?

అసలేమిటీ కేసు?

ఈ కేసుకు మూలాలు తెలుసుకోవాలంటే 2022 జులైలో నాటి దిల్లీ చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్.. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు సమర్పించిన నివేదిక వరకూ వెళ్లాలి.

2021 వరకు దిల్లీలో ప్రభుత్వమే మద్యం విక్రయించేది. అయితే, దీన్ని ప్రైవేటుకు అప్పగించేందుకు 2021లో దిల్లీలోని ఆప్ సర్కారు కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది.

అయితే, ఈ కొత్త విధానం రూపకల్పనలో దిల్లీ ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోదియా ‘నిర్హేతుకంగా, ఏకపక్షంగా’ నిర్ణయాలు తీసుకున్నారని, మొత్తంగా ఈ కొత్త విధానంతో ప్రభుత్వ ఖజానాకు రూ.580 కోట్ల కంటే ఎక్కువే నష్టం జరిగిందని ఆ రిపోర్టులో చీఫ్ సెక్రటరీ పేర్కొన్నారు.

కొంతమంది లిక్కర్ వ్యాపారులకు డిస్కౌంట్లు, లైసెన్సు ఫీజుల్లో మినహాయింపులు లాంటి మేలు చేసేందుకు వారి నుంచి ఆప్ నాయకులు ముడుపులు తీసుకున్నారని నివేదికలో ఆరోపించారు. ఈ రిపోర్టును మొదట కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించారు. ఈ వివాదంపై 2022 ఆగస్టులో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదుచేసింది.

కవిత పేరు ఎలా బయటకు వచ్చింది?

ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనలో మనీష్ సిసోదియా, అరవింద్ కేజ్రీవాల్‌లతోపాటు కవితకు కూడా ప్రమేయముందని మొదట బీజేపీ నాయకులు ఆరోపణలు చేశారు. దిల్లీ మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ సిర్పా మొదట కవిత పేరును ప్రస్తావించారు. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ నాయకులూ తరచూ ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు.

ఈ కేసులో విట్‌నెస్‌గా హాజరుకావాలని 2022 డిసెంబరులో కవితకు ఈడీ సమన్లు పంపింది. ఏడాదిన్నర విచారణ అనంతరం 2024 మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసింది.

ఈ కేసులో కవిత పాత్రపై ఈడీ స్పందిస్తూ.. ‘‘దిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో కవిత అక్రమాలకు పాల్పడ్డారు. ఆప్ నాయకులు పొందిన రూ.100 కోట్లలో కవిత ప్రమేయముంది. సౌత్ గ్రూపు ప్రతినిధిగా ఆమె వ్యవహరించారు. లిక్కర్ హోల్‌సేల్ డీలర్ల నుంచి వచ్చిన లాభాలను కవిత, ఆమె అసోసియేట్స్ పంచుకున్నారు’’ అని ఆరోపణలు చేసింది.

బెయిలు ఎందుకు రావడం లేదు?

ఈడీ అరెస్టు చేసిన అనంతరం కవితను దిల్లీకి తరలించారు. జ్యుడీషియల్ కస్టడీలోనున్న ఆమెను ఇదే కేసులో 2024 ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది.

అక్రమ నగదు చెలామణీ నిరోధక చట్టం (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ - పీఎంఎల్ఏ) కింద కవితపై ఆరోపణలు మోపారు.

పీఎంఎల్‌ఏ కేసుల్లో దర్యాప్తు సంస్థ వ్యతిరేకిస్తే సదరు వ్యక్తికి బెయిలు రావడం దాదాపుగా అసాధ్యం. బెయిలుకు సంబంధించి పీఎంఎల్‌ఏలో సెక్షన్ 45లో రెండు నిబంధనలు ఉన్నాయి.

బెయిలు అభ్యర్థనపై తమ అభిప్రాయం చెప్పేందుకు లేదా దీన్ని వ్యతిరేకించేందుకు మొదటగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు అవకాశం ఇవ్వాలనేది దీనిలో మొదటి నిబంధన.

అయితే, ఒకవేళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ బెయిలు అభ్యర్థనను వ్యతిరేకిస్తే, ఆ నిందితుడు బెయిలుపై వెళ్లినప్పుడు మళ్లీ ఆ నేరం చేయడని లేదా కేసును ప్రభావితం చేయడని కోర్టు నిర్ధారించుకోవడమనేది రెండో నిబంధన.

ప్రస్తుత కేసులో కవిత బెయిలు అభ్యర్థనలను పబ్లిక్ ప్రాసిక్యూటర్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఆమె బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఆరోపిస్తున్నారు.

మహిళలకు మినహాయింపు ఉంటుందిగా?

పీఎంఎల్‌ఏ కేసుల్లో ఒక మినహాయింపు ఉంటుంది. ‘‘ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి 16 ఏళ్లలోపు వ్యక్తి అయినా లేదా మహిళ అయినా లేదా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా బెయిలు ఇవ్వొచ్చు. అయితే, దీనికి ప్రత్యేక కోర్టు అనుమతి అవసరం’’ అని ఆ మినహాయింపులో పేర్కొన్నారు.

ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని మహిళలు, మైనర్లకు ఉండే మినహాయింపుల్లానే ఈ మినహాయింపు పనిచేస్తుంది.

ఆ మినహాయింపును కింద కవితకు బెయిలు ఇవ్వాలని ఏప్రిల్ 8న కవిత తరఫున వాదించిన అభిషేక్ మను సింఘ్వి చెప్పారు.

అయితే, దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు స్పందిస్తూ.. ‘‘ఆమెమీ ఇంటికి పరిమితమయ్యే గృహిణి (హౌస్‌హోల్డ్ లేడీ) కాదు. ఆమెకు ఈ మినహాయింపు కింద అవకాశం ఇవ్వకూడదు’’ అని వాదించారు.

దీనిపై జడ్జి స్పందిస్తూ.. ‘‘గృహిణి లేదా మహిళా వ్యాపారవేత్త లేదా ప్రముఖురాలు.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా రాజ్యాంగంలో నిబంధనలు ఉండవు’’ అని చెప్పారు.

మరి తిరస్కరణ ఎందుకు?

అయితే, ప్రస్తుత కేసులో నిందితురాలు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని జడ్జి అభిప్రాయపడ్డారు.

‘‘కవిత విద్యావంతురాలు, సమాజంలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెను ‘వల్నరబుల్ ఉమన్’గా భావించి మినహాయింపు ఇవ్వలేం’’ అని జడ్జి స్పష్టంచేశారు.

అంతేకాదు ‘‘కోర్టు ముందున్న సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం ఈ కేసులో ఆధారాలు లేకుండా చేసేందుకు తన ఫోన్లను కవిత ఫార్మాటింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి’’ అని జడ్జి చెప్పారు. అందుకే కవిత బెయిలును తిరస్కరిస్తున్నట్లు వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories