వేములవాడ ప్రమాదంలో దోషులెవరు?

వేములవాడ ప్రమాదంలో దోషులెవరు?
x
Highlights

వేములవాడ ప్రమాదానికి కారణమెవరు? అధికారుల నిర్లక్ష్యమా? స్కూల్ యాజమాన్యం బాధ్యతా రాహిత్యమా? లేక డ్రైవర్‌ను తప్పుబట్టాలా? అసలు ఈ పాపానికి కారణమెవరు? ఈ...

వేములవాడ ప్రమాదానికి కారణమెవరు? అధికారుల నిర్లక్ష్యమా? స్కూల్ యాజమాన్యం బాధ్యతా రాహిత్యమా? లేక డ్రైవర్‌ను తప్పుబట్టాలా? అసలు ఈ పాపానికి కారణమెవరు? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు? జరగాల్సిన నష్టం జరిపోయాక హాస్టల్‌కి పర్మిషన్‌ లేదని బస్సు కండీషన్‌ సరిగా లేదని ర్యాష్ డ్రైవింగ్ అంటూ తీరిగ్గా చెబుతున్న అధికారులు మరి ఇప్పటివరకు ఏం చేసినట్లు? అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులు బలైపోవడానికి అధికారులు కారణం కాదా?

కేవలం ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే దానికి పర్మిషన్ లేదు దీనికి కండీషన్‌ లేదంటూ ప్రకటనలు చేసి చేతులు దులుపుకోవడమేనా అధికారుల పని? జరగాల్సిన ప్రాణనష్టం జరిగిపోయాక స్కూల్ పర్మిషన్ రద్దుచేస్తే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? ఇలాంటి ప్రమాదాలు ఎన్నిసార్లు జరిగినా ఇదే మాటా? ముందే ఎందుకు తనిఖీలు చేయరు? చర్యలు చేపట్టరు? బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రుల ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు?

వేములవాడ ప్రమాదంపై అధికార యంత్రాంగంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం అధికారుల నిర్లక్ష్యం స్కూల్ యాజమాన్యం బాధ్యతా రాహిత్యంతోనే ముగ్గురు చిన్నారులు బలైపోయారని మండిపడుతున్నారు. విద్యాశాఖ అధికారులు గానీ, రవాణాశాఖ అధికారులు గానీ పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. స్కూల్‌కి 6 కిలోమీటర్ల దూరంలో ఎలాంటి అనుమతుల్లేకుండా హాస్టల్ నిర్వహిస్తుంటే ఇన్నిరోజులూ ఏం చేశారంటూ ప్రశ్నిస్తున్నారు.

వేములవాడ ప్రమాదానికి కారణమైన వాగేశ్వరి స్కూల్ అనుమతులు రద్దు చేస్తున్నట్లు సిరిసిల్ల డీఈవో రాధాకిషన్ ప్రకటించారు. స్కూల్‌కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఎలాంటి అనుమతుల్లేకుండా హాస్టల్‌ నిర్వహిస్తున్నారన్న డీఈవో వాగేశ్వరి స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేములవాడ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్‌ అనంతరం హాస్పిటల్‌లో చికిత్స పొందుతోన్న విద్యార్ధులను పరామర్శించారు. వాగేశ్వరి స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా, యాక్సిడెంట్‌ స్పాట్‌ను పరిశీలించి హాస్పిటల్‌లో క్షతగాత్రులను పరామర్శించారు. గాయపడ్డ పిల్లలకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు, బిడ్డల్ని కోల్పోయిన కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉంటే, ర్యాష్ డ్రైవింగ్‌తో ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్‌ను విద్యార్ధి సంఘాలు చితకబాదాయి. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, రేపు విద్యాసంస్థలకు బంద్‌‌కి పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories