చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Who attacked Hyderabad chilukuru balaji temple priest CS Rangarajan, Who is Kovvuri Veera Raghava Reddy in attack on Rangarajan case
x

చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Highlights

చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రామరాజ్యం స్థాపన పేరుతో పూజారిపై దాడి...

చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రామరాజ్యం స్థాపన పేరుతో పూజారిపై దాడి చేసింది ఎవరు? ఆ ముఠా నాయకుడు ఎవరు? ఎందుకు ఈ దాడి చేశారు? ఏమని బెదిరించారు? ఆయన నుండి వారు ఏం డిమాండ్ చేశారు? ఎప్పటివరకు డెడ్ లైన్ పెట్టారు?

ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు కొవ్వూరి వీర రాఘవ రెడ్డి సహా మొత్తం ఐదుగురుని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

రాజేంద్ర నగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ చెప్పిన వివరాలు ప్రకారం ఈ దాడి వెనుక ఒక ముఠా ఫుల్ టైమ్ జాబ్ చేస్తూ ఉందని తెలుస్తోంది. ఆ ముఠాకు వీర రాఘవ రెడ్డి నాయకుడు.

ఇంతకీ ఎవరీ వీర రాఘవ రెడ్డి?

కొవ్వూరి వీర రాఘవ రెడ్డి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా. హైదరాబాద్ మణికొండలో నివాసం ఉంటున్నారు. ఫేస్‌బుక్, యూట్యూబ్‌తో పాటు అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో రామ రాజ్యం పేరుతో పేజీలు, ఛానెల్స్ సృష్టించారు.

సోషల్ మీడియాలో భగవద్గీత శ్లోకాలు, నలుగురిని ఆకర్షించేలా నాలుగు స్ఫూర్తిదాయకమైన పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. హిందూ ధర్మాన్ని కాపాడాలంటూ ఒక ఆర్మీని తయారు చేశారు.

2024 సెప్టెంబర్ 1 నుండి డిసెంబర్ 31 2024 మధ్య పేరు నమోదు చేసుకున్న వారికి నెలకు రూ. 20,000 జీతం ఇచ్చి రామ రాజ్యం ఆర్మీలోకి ఉద్యోగులుగా తీసుకుంటానని ఆ సోషల్ మీడియా గ్రూప్స్‌లో ఒక ప్రకటన పోస్ట్ చేశారు.

ఆ ప్రకటన చూసి 25 మంది వీర రాఘవ రెడ్డిని కలిశారు. జనవరి 24న తణుకులో ఆయన వారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో చెప్పారు.

అందరూ అక్కడే నాలుగు రోజుల పాటు ఉన్నారు. తర్వాత కోటప్పకొండకు వెళ్లారు. అక్కడే రూ. 2000 కాంట్రిబ్యూట్ చేసి స్థానిక టైలర్‌తో యూనిఫామ్ కుట్టించుకున్నారు.

ఫిబ్రవరి 6న హైదరాబాద్ ఈసీఐఎల్ సమీపంలోని యాప్రాల్‌లో ఒక ఇంట్లో కలుసుకున్నారు. యూనిఫామ్ వేసుకుని, వెనుక వైపు రామ రాజ్యం లోగో కనిపించేలా ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఫిబ్రవరి 7న రాత్రి మూడు వాహనాల్లో చిలుకూరు వెళ్లారు.

ఆ రాత్రి ఏం జరిగిందంటే...

నలుపు రంగు యూనిఫామ్ వేసుకున్న 25 మంది అదే రోజు రాత్రి 8 గంటలకు రంగ రాజన్ ఇంటికి వెళ్లారు. రామ రాజ్యం ఆర్మీ కోసం భారీ మొత్తంలో డబ్బులు డొనేట్ చేయాల్సిందిగా ఆయన్ను డిమాండ్ చేశారు. అంతేకాకుండా రామ రాజ్యం ఆర్మీలోకి సైన్యాన్ని చేర్పించాల్సిందిగా పట్టుబట్టారు.

రంగరాజన్ పోలీసులక ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆయన వారి మాట విననందుకు తనపై దాడి చేశారని అన్నారు. వీర రాఘవ రెడ్డి తనని తాను శివుడి అవతారంగా చెప్పుకుంటూ దాడికి పాల్పడ్డారని రంగరాజన్ తెలిపారు. రాఘవ రెడ్డితో పాటు ఆయన వెంట వచ్చిన వారు కూడా దాడి చేశారు. ఇంకొంతమంది ఆ దాడిని ఫోటోలు, వీడియోలు తీశారు. ఈ ఉగాదిలోగా చెప్పినట్లు వినకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించి వెళ్లారు అని ఆయన చెప్పారు.

తను అనుకున్నది చేయడం కోసం అవసరమైతే ఎవరినైనా చంపడానికి కూడా వెనుకాడనని రాఘవ రెడ్డి బెదిరించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలో రామ సేన పేరుతో నక్సల్స్ కు సమాంతరమైన నెట్ వర్క్ ఏర్పావడం సమాజానికి అంత మంచిది కాదని రంగరాజన్ ఆవేదన వ్యక్తంచేశారు.

7 సెక్షన్ల కింద కేసు నమోదు

నిందితులపై బీఎన్ఎస్ సెక్షన్ 18(2) (చట్టవ్యతిరేక కార్యకలాపాల కోసం సమావేశమవడం), సెక్షన్ 333 (ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించడం), సెక్షన్ 308(5) ( డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరించడం), సెక్షన్ 352 (ఉద్దేశపూర్వకంగా అవమానించి శాంతిభద్రతలకు భంగం కలిగేలా రెచ్చగొట్టడం), సెక్షన్ 351(3)(చంపడం, తీవ్రంగా దాడి చేయడం, ఆస్తిని ధ్వంసం చేయడం), సెక్షన్ 115(2) ప్రకారం గాయపర్చడం వంటి నేరాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ జి పవన్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు.

స్పందించిన సీఎం రేవంత్, కేటీఆర్

చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన పూజారి సీఎస్ రంగరాజన్‌కు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోన్ చేసి పరామర్శించారు. మీకు ఎలాంటి హానీ లేకుండా చూసుకుంటామని రేవంత్ రెడ్డి ఆయనకు భరోసా ఇచ్చారు. సోమవారం బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా రంగరాజన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అర్చకుడిపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories