Krishna Water Dispute: కృష్ణా నది జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య గొడవ ఎందుకు?

Krishna Water Dispute: కృష్ణా నది జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య గొడవ ఎందుకు?
x
Highlights

Krishna Water Dispute: కృష్ణా నదిలో వాటాకు మించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటుందా? తెలంగాణ ఎందుకు తన వాటా నీటిని వాడుకోవడం లేదు?

Krishna Water Dispute: కృష్ణా నదిలో వాటాకు మించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటుందా? తెలంగాణ ఎందుకు తన వాటా నీటిని వాడుకోవడం లేదు? చంద్రబాబు సర్కార్ నీటిని తరలించుకుపోతున్నా రేవంత్ సర్కార్ మొద్దు నిద్రపోతోందనే బీఆర్ఎస్ ఆరోపణల్లో వాస్తవం ఎంత? గులాబీ పార్టీ విమర్శలపై హస్తం పార్టీ కౌంటర్ ఏంటి? ఈ ఏడాది కృష్ణా నదికి వచ్చిన నీళ్లు ఎన్ని? ఏపీ, తెలంగాణ ఎంత వాడుకున్నాయి? ఈ వేసవిలో తెలంగాణలో తాగు నీటి కష్టాలు వస్తాయా? కృష్ణా నీటిపై ఎవరి వాదన ఏంటో ఈ ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం.

అసలు వివాదం ఏంటి?

ఈ ఏడాది కృష్ణా నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. 1, 010 టీఎంసీలు నీరు కృష్ణానదికి వరద ద్వారా వచ్చింది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో అప్పట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తాత్కాలికంగా కృష్ణా నది జలాల పంపకంపై ఒప్పందం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు 66 శాతం, తెలంగాణకు 34 శాతం కృష్ణా నీటిని వాడుకోవాలనేది ఈ ఒప్పందం ఉద్దేశం.

ఈ వాటా ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు ఈ ఏడాది 666 టీఎంసీలు దక్కాలి. తెలంగాణ 343 టీఎంసీలు వాడుకోవాలి. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 657 టీఎంసీల నీటిని వాడుకుందని తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అంటే ఏపీ రాష్ట్రం వాడుకోవడానికి ఇంకా మిగిలింది 9 టీఎంసీలు మాత్రమే. ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా ఇంకా ఏపీ ప్రభుత్వం నీటిని తరలిస్తోందనేది గులాబీ పార్టీ ఆరోపణ.

తెలంగాణ ఇప్పటి వరకు 220 టీఎంసీలు వాడుకొంది. ఇంకా 123 టీఎంసీలను తెలంగాణ వాడుకునే హక్కుంది. అయితే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో 100 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. వాస్తవానికి తన వాటా ప్రకారం తెలంగాణకు 123 టీఎంసీలు దక్కాలి. కానీ, రిజర్వాయర్లలో అంత నీరు లేదు. దీంతో తెలంగాణ నష్టపోయింది. ఇంకా కూడా ఏపీ నీటిని తరలించుకుంటూ పోతే మరింత నష్టం జరిగే అవకాశం ఉంది.

పంటలకు పొంచి ఉన్న ప్రమాదం

నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద 6.38 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఈ పంటకు కనీసం నాలుగు తడులు నీరివ్వాలి. అంటే 30 నుంచి 35 టీఎంసీల నీరు అవసరం. మరో వైపు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ఆయకట్టు కింద 2.40 లక్షల ఎకరాల వరి సాగు చేశారు. ఈ పంటలు దెబ్బతినకుండా ఉండాలంటే ఎమ్మార్పీ ప్రాజెక్టుకు కూడా నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలి.

సూర్యాపేట, నల్గొండ, పాలేరు, ఖమ్మం, మహబూబాబాద్ తో పాటు హైదరాబాద్ కు తాగు నీటి అవసరాలకు కూడా నాగార్జున సాగర్ నీటిని వాడుకుంటాం. ప్రస్తుతం నాగార్జున సాగర్ లో 50 టీఎంసీలు, శ్రీశైలంలో 50 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ నీటిని జాగ్రత్తగా వాడుకోకపోతే వేసవిలో తాగు నీటి కష్టాలతో పాటు తెలంగాణలోని సుమారు ఎనిమిది లక్షల ఎకరాల్లో వేసిన వరి పంట దెబ్బతినే అవకాశం ఉంది.

తెలంగాణలో పూర్తి కాని ప్రాజెక్టులు

కృష్ణా నదిపై తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. దీంతో తెలంగాణ రాష్ట్రం తన వాటా నీటిని వాడుకోవడానికి ఇబ్బందులు పడుతోంది. ఎస్‌ఎల్‌బీసీకి 40 టీఎంసీలు, కల్వకుర్తికి 40 , నెట్టెంపాడుకు 25, పాలమూరు-రంగారెడ్డికి 95 టీఎంసీలు, డిండి ప్రాజెక్టుకు 30 టీఎంసీలు నీటిని వాడుకొనే వెసులుబాటు ఉంది.ఈ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం 1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. 199 టీఎంసీల నీటిని వాడుకొంది. గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తే పరిస్థితి మరోలా ఉండేదనేది రేవంత్ సర్కార్ వాదన.

సామర్ధ్యం పెంచుకున్న ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముచ్చుమర్రి సామర్ధ్యం పెంచారు. రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని డ్రా చేసుకొనేలా కెపాసిటీని 2017లో పెంచారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని 44, 600 క్యూసెక్యుల నుంచి లక్షన్నర క్యూసెక్కులకు పెంచారు. రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 3 టీఎంసీలను శ్రీశైలం నుంచి తరలించేందుకు ప్రణాళిక సిద్దం చేశారు. ఈ ప్లాన్ ను జగన్ సర్కార్ చేసింది. పోలవరం నుంచి బనకచర్లకు కృష్ణా నీటిని డైవర్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రతిపాదిస్తోంది. ఇది తెలంగాణకు నష్టమనే వాదన కూడా ఉంది. ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు చెప్పాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

రేవంత్ సర్కార్ మొద్దు నిద్రతో తెలంగాణకు నష్టం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజుకు 10 వేల క్యూసెక్కుల కృష్ణా నీటిని తరలించుకుపోతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. నాగార్జున సాగర్ కుడి కాల్వ ద్వారా కృష్ణా వాటర్ ను చంద్రబాబు సర్కార్ తమ రాష్ట్రానికి తీసుకెళ్తున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 657 టీఎంసీలు తరలించినా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.

గులాబీ పార్టీ ఆరోపణలను హస్తం పార్టీ తోసిపుచ్చింది. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కారణమని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తో అప్పటి కేసీఆర్ సర్కార్ విందులు, వినోదాలతో మునిగి తెలంగాణకు అన్యాయం జరిగినా పట్టించుకోలేదని ఆయన అన్నారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ, ముచ్చుమర్రి ప్రాజెక్టులకు నీటి సామర్ధ్యం పెంచుకునేందుకు సహకరించారని ఆయన ఆరోపించారు.

కేఆర్ఎంబీ భేటీ వాయిదా

కృష్ణా నది నీటి వాటాలు, ఇతర అంశాలపై చర్చించేందుకు ఫిబ్రవరి 21న కృష్ణా నది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఈ సమావేశం ఫిబ్రవరి 24కు వాయిదా పడింది. శ్రీశైలం,నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలను ఏ రాష్ట్రం ఎంత వాడుకోవాలనే దానిపై ఈ సమావేశంలో నిర్ణయించాల్సి ఉంది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కారణంగా ఈ సమావేశానికి తాను హాజరు కాలేనని.. ఫిబ్రవరి 24న సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఆర్ఎంబీ ఛైర్మన్ అతుల్ జైన్ ను కోరారు. దీంతో ఈ సమావేశం ఫిబ్రవరి 24కు వాయిదా పడింది.

కృష్ణా జలాలపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య పంచాయితీకి పుల్ స్టాప్ పెట్టేందుకు కేంద్రం చొరవ చూపాలి. నీటి వాటాల కంటే ఎక్కువ వాటాలు వాడుకోకుండా కేఆర్ఎంబీ చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేఆర్ఎంబీ నిబంధనల ప్రకారం వ్యవహరించకపోతే ఎవరికి తోచినట్టు వారు నీటిని వాడుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories