Warangal: వరంగల్‌కు పొంచి ఉన్న వరదముప్పు

Warangal is Under Flood Threat | TS News
x

Warangal: వరంగల్‌కు పొంచి ఉన్న వరదముప్పు

Highlights

Warangal: పరిస్థితికి చెక్ పెట్టేందుకు వరంగల్ నిట్ నిపుణుల పరిశోధన

Warangal: వరంగల్ నగరం చారిత్రక ప్రాధాన్యంతో పాటు.. అభివృద్ధిలోనూ శరవేగంగా దూసుకుపోతున్న సిటీ. కాని చిన్నపాటి వర్షానికే వరంగల్ రోడ్లు బురదమయమై నరకాన్ని తలపిస్తాయి. ముఖ్యంగా ఓరుగల్లుకు వరద ముప్పు పొంచి ఉంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టడానికి నిట్‌లో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంతకూ నిట్ పరిశోధకుల ప్రయోగమేంటి...? రోడ్లపై నీళ్లు నిలవకుండా నిట్ విద్యార్థులు చేస్తున్న వినూత్న ప్రయోగంపై hmtv స్పెషల్ స్టోరీ.

హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండవ నగరం వరంగల్. అటువంటి వరంగల్ నగరంలో ఏ చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లపై నీళ్లు నిలిచే పరిస్థితి నెలకొంది. దీంతో వచ్చిపోయే వాహనాలతోపాటు పాదచారులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. అదే భారీ వర్షాలు కురిస్తే రోడ్లపై నీళ్లతోపాటు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితికి చెక్‌ పెట్టేందుకు తోడ్పడే పోరస్‌ ఆస్ఫాల్ట్‌ రోడ్లు, పేవ్‌మెంట్ల నిర్మాణంపై వరంగల్‌ నిట్‌ నిపుణులు పరిశోధన చేస్తున్నారు. నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు ఇంకిపోయే ఈ తరహా రోడ్లను విదేశాల్లో పార్కింగ్‌ స్థలాలు, ఉద్యానవనాలు వంటి చోట్ల ఇప్పటికే వినియోగిస్తున్నారు. దీనిని మన స్థానిక పరిస్థితులకనుగుణంగా అభివృద్ధి చేయడంపై నిట్‌ సివిల్‌ విభాగం ట్రాన్స్‌పోర్ట్‌ డివిజన్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.శంకర్, పీహెచ్‌డీ స్కాలర్‌ గుమ్మడి చిరంజీవి పరిశోధన చేస్తున్నారు.

సురక్షితమైన ప్రయాణానికి వీలు కల్పించే తారు, సీసీ రోడ్డు మాదిరిగానే ఈ ఆస్ఫాల్ట్‌ రోడ్డు నిర్మాణం ఉంటుంది. పోరస్‌ ఆస్ఫాల్ట్‌ రోడ్డును 16 దశల్లో వేర్వేరుగా నిర్మిస్తారు. వివిధ పరిమాణాల్లో ఉన్న కంకరను ఈ రోడ్డు నిర్మాణానికి వినియోగిస్తారు. రోడ్డు దృఢంగా ఉంటూనే పెద్ద సంఖ్యలో చిన్నచిన్న రంధ్రాలు ఏర్పడేలా చూస్తారు. నీటి ప్రవాహానికి తగినట్టుగా రంధ్రాలు ఉండేలా చూస్తారు. వర్షాలు పడినప్పుడు ఈ రోడ్లు నీటిని పీల్చుకుని భూగర్భంలోకి పంపేస్తాయి. వెంట వెంటనే నీళ్లు ఇంకిపోవడం వల్ల నీటి నిల్వ ఉండటం ముంపునకు కారణం కావడం వంటివి సమస్యలు ఉండవు. పట్టణాల్లో ఇలాంటి రోడ్లు, పేవ్‌మెంట్లను నిర్మించినప్పుడు వాటి దిగువ నుంచి నీళ్లు డ్రైనేజీల్లోకి వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేస్తారు. దీంతో ఎంత వానపడినా నీళ్లు నిలవవు. పోరస్‌ ఆస్ఫాల్ట్‌ రోడ్లులో నీరు నిల్వ ఉండకపోవడం వల్ల దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందవని రోగాలు ప్రబలకుండా ఉంటాయని స్కాలర్ చిరంజీవి చెబుతున్నాడు.

నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో తొలుత పోరస్‌ ఆస్ఫాల్ట్ రోడ్డును 50 మీటర్ల మేర ఏర్పాటు చేయనున్నారు. దానిని పరిశీలించి అవసరమైన మార్పులు చేస్తామని.. గ్రేటర్‌ వరంగల్‌లో వాన ముంపును నివారించేందుకు ఈ విధానాన్ని అందజేస్తామని అధ్యాపకులు చెప్పారు. సైడ్‌ డ్రెయిన్స్‌ లేని ప్రాంతాల్లో, ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఈ రోడ్లను వేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని సివిల్‌ విభాగం ప్రోఫెసర్ శంకర్ అన్నారు.

ఏదేమైనా నిట్ పరిశోధనలు పూర్తి స్థాయిలో ఫలించి ప్రజలకు అందుబాటులోకి వస్తే వరంగల్‌లో ముంపు సమస్య దాదాపు తీరినట్లే. మరి ఈ పరిశోధనలకు ప్రభుత్వ పరమైన సహకారం అందిస్తే త్వరితగతిన పోరస్‌ ఆస్ఫాల్ట్‌ రోడ్లతో ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories