Vinayaka Chavithi 2020: గ్రామానికి ఒకే వినాయకుడు.. ఉపాధి కోల్పోయిన తయారీ దారులు

Vinayaka Chavithi 2020: గ్రామానికి ఒకే వినాయకుడు.. ఉపాధి కోల్పోయిన తయారీ దారులు
x
Highlights

Vinayaka Chavithi 2020: వినాయక చవితి వచ్చేస్తుంది. వీధి వీధికి పందిళ్లు ఏర్పాటు చేసి, కోలాహలంగా పండగలు చేస్తుంటారు.

Vinayaka Chavithi 2020: వినాయక చవితి వచ్చేస్తుంది. వీధి వీధికి పందిళ్లు ఏర్పాటు చేసి, కోలాహలంగా పండగలు చేస్తుంటారు. వారి వారి స్థోమతను బట్టి వారం, పది, పన్నెండు, పదిహేను రోజుల పాటు వేడుకలు చేస్తుంటారు. ఈ కార్యక్రమాల్లో వందలాది మంది పాల్గొంటారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఇలాంటి చర్యలకు పాల్పడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై నియంత్రణకు పలు సూచనలు చేశాయి. తప్పకుండా అమలు చేయాలంటూ నిబంధనలు విధించాయి.

కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో పండుగలపై కూడా ఆ ప్రభావం పడింది. మార్చి మొదలు ఇప్పటివరకు జరిగిన పండుగలను ఇళ్లలోనే ఉండి చేసుకున్నారు ప్రజలు. ఇక ఈ నెలలో రాబోతున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే పలు రాష్ట్రాలు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశాయి. విగ్రహం ఎత్తు ఎక్కువగా ఉండకూడదని, నిమజ్జనాలకు సైతం ఎక్కువగా రాకూడదని ఆంక్షలు పెట్టారు. ఈ క్రమంలో మాట్లాడిన నల్గొండ డీసీపీ నారాయణ రెడ్డి.. కరోనా పరిస్థితుల దృష్ట్యా గ్రామానికి ఒకే వినాయక విగ్రహం పెట్టాలని సూచించారు. అది కూడా మూడు అడుగుల ఎత్తుకు మించకుండా ఉండాలని తెలిపారు. అలాగే ఉత్సవాల సయంలో జనం గుమికూడకుండా ఉండాలని, ఉత్సవ నిర్వాహకులు బలవంతంగా చందాలు వసూలు చేయొద్దని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని నారాయణ రెడ్డి హెచ్చరించారు.

కరోనా మహమ్మారి వినాయక విగ్రహాల తయారీదారుల నోట్లో మట్టికొట్టింది. వైరస్‌ ఉధృతి, లాక్‌డౌన్‌ నిబంధనలతో ఈ ఏడాది వినాయక చవితిని ఘనంగా నిర్వహించలేని పరిస్థితులేర్పడ్డాయి. ప్రతి ఏటా గణేశుడి పండుగ వస్తోందంటే చాలు చిన్న, పెద్ద, పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా మండపాలు ఏర్పాటు చేసుకుని పోటా పోటీగా విగ్రహాలను ప్రతిష్ఠించేవారు.

ఇళ్లలో చిన్న విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నా, వీధుల్లోనూ, అపార్ట్‌మెంట్‌ల వద్ద స్తోమతను బట్టి భారీ విగ్రహాలు నిలిపేవారు. ఈ క్రమంలో విగ్రహాల తయారీదారులు కూడా పండుగకు చాలా ముందు రోజుల నుంచే వివిధ ఆకృతుల్లో, ఆకర్షణీయంగా బొజ్జ గణపయ్యలను తయారు చేసేవారు. గిట్టుబాటు బాగుండటంతో పెట్టుబడులు భారీగానే పెట్టేవారు. అయితే ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైన కరోనా అప్పటి నుంచి అన్ని పండుగలను ఇళ్లకే పరిమితం చేసింది. ఎవరికి వారు ఇంటికి పరిమితమై పూజలు, పునస్కారాలు చేసుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది. ఇందులో భాగంగా ఈ నెల 22న రానున్న వినాయక చవితి పండుగను కూడా ఎవరికి వారు ఇళ్లలోనే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వైరస్‌ ప్రభావం, లాక్‌డౌన్‌ ఇంత సుదీర్ఘకాలం పాటు ఉంటుందని ఊహించని గణేష్‌ విగ్రహాల తయారీదారులు బొమ్మల తయారీకి అవసరమైన సరంజామాను రూ.లక్షలు వెచ్చించి తెచ్చిపెట్టుకున్నారు. కొందరు విగ్రహాలు కూడా తయారు చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విగ్రహాలు అమ్ముడుపోని పరిస్థితి నెలకొనడంతో విగ్రహాల తయారీదారుల పరిస్థితి అతలాకుతలమైంది. జీవనం దుర్భరమైంది. కొంత మంది తయారీదారులు తయారు చేసే విగ్రహాలను టెంట్లలోనే వదిలేసి సొంతూర్లకు వెళ్లిపోవడం గమనార్హం.

పెట్టుబడి రాదు... అప్పులు తీరవు!

కొందరు విగ్రహాల తయారీదారులు గతేడాది జరిగిన వ్యాపారాన్ని బట్టి మరో పది శాతం పెంచి ముడిసరుకు కోసం లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. విగ్రహం తయారీ కోసం అవసరమైన ప్లాస్టరాఫ్‌ ప్యారీస్‌, రంగులు, చెక్కలు, కర్రలు, ఇనుప చువ్వలు తదితర సామగ్రిని ముందస్తుగానే సిద్ధం చేసుకున్నారు. మార్చి మొదటివారం నుంచే విగ్రహాలను తయారు చేసేందుకు శ్రీకారం చుట్టారు.

జూన్‌ ఆఖరు వరకూ విగ్రహాలు తయారు చేయడంలోనే నిమగ్నమయ్యారు. ఈ లెక్కన ఒక్కో నిర్వాహకుడు రూ.5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. విగ్రహాలు తయారు చేసి సిద్ధంగా ఉంచుకున్నారు. సాధారణ రోజుల్లో అయితే జూలై మొదటి వారం నుంచే భారీ విగ్రహాలు కావాల్సినవారు తయారీదారులను సంప్రదించేవారు. అడ్వాన్సు ఇచ్చివెళ్లేవారు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో విగ్రహాలు పెట్టేందుకు అనుమతుల్లేవని, ఎవరికి వారు ఇళ్లలోనే జరుపుకోవాలనే నిబంధనలు విధిస్తుండంతో తయారీదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

విగ్రహాల తయారీకి అవసరమైన సామగ్రి కోసం చేసిన అప్పులే వారికి మిగిలాయి. విగ్రహాలు కొనే నాథుడు లేకపోవడంతో జీవనం కష్టంగా మారింది. పస్తులు ఉండలేక చిన్న విగ్రహాలు తయారుచేసి వాటి ద్వారా ఆకలి తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఉపాధి కోల్పోయిన వందలాది కుటుంబాలు

ఒక్కో జిల్లాలో 200 మందికి పైగా విగ్రహాల తయారీదారులున్నారు. వీరి పరిధిలో దాదాపు 10 వేల మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా వినాయక చవితి ముందు రోజుల నుంచే మరో వెయ్యి మందిదాకా తోపుడు బండ్లపై చిన్న విగ్రహాలను విక్రయించి ఉపాధి పొందేవారు. ప్రధానంగా గుంతకల్లులో తయారుచేసిన విగ్రహాలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. ఒక్కో విగ్రహాల తయారీదారుడు సగటున రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టారు. అంటే ఈలెక్కన విగ్రహాల తయారీకి రూ.15 కోట్ల దాకా నష్టం చవిచూడాల్సివచ్చింది. రోజుకు రూ.500 నుంచి రూ.600 వరకూ కూలి పొందుతున్న వేలాదిమంది ఉపాధి కోల్పోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories