'దిశ' కుటుంబాన్ని ఎవరూ ఇబ్బంది పెట్టొద్దు: సీపీ సజ్జనార్

దిశ కుటుంబాన్ని ఎవరూ ఇబ్బంది పెట్టొద్దు: సీపీ సజ్జనార్
x
Highlights

సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఎన్‌కౌంటర్‌ ఎలా జరిగింది నిందితులు తమపైకి ఎలా దాడికి పాల్పడ్డారో...

సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఎన్‌కౌంటర్‌ ఎలా జరిగింది నిందితులు తమపైకి ఎలా దాడికి పాల్పడ్డారో వివరించారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. దిశను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్టు తెలిపిన సీపీ ఈ కేసులో అనేక కోణాల్లో దర్యాప్తు చేశామన్నారు. మొత్తంగా దిశ హత్యోదంతం తర్వాత నలుగురిని అరెస్టు చేశామన్న సీపీ వారిని తిరిగి కస్టడీకి తీసుకున్నామని తెలిపారు. ఆధారాలు సేకరించడం కోసం ఘటనాస్థలికి తీసుకెళ్లిన తమపై దాడికి యత్నించడంతో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వచ్చిందని సీపీ వివరించారు.

దిశ నిందితులు కరుడగట్టిన నేరస్తులన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. నిందితులను కస్టడీలోకి తీసుకున్నాక ఈనెల 4, 5 తేదీల్లో నిందితులను విచారించామని చెప్పారు. హత్యోదంతంపై నిందితులు చాలా విషయాలు చెప్పినట్లు వెల్లడించారు. అంతకుముందు దిశను హత్య చేసిన నిందితులు మహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను నవంబరు 28న అరెస్ట్ చేశామని చెప్పారు. నవంబర్ 30వ తేదీన నిందితులను మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చామన్నారు.

షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో నిందితులను విచారించిన తర్వాత వారిని చర్లపల్లి జైలుకు తరలించామని తెలిపారు సజ్జనార్‌. చర్లపల్లి నుంచే నలుగురిని జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నామని, కస్టడీలోకి తీసుకున్న తర్వాత వారిని అనేక కోణాల్లో ప్రశ్నించామని వివరించారు. కొన్ని వస్తువులను రికవరీ కోసం ఘటనా స్థలానికి నిందితులను తీసుకొచ్చినట్టు తెలిపారు.

ఇవాళ ఉదయం సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పోలీసులపై దాడికి దిగారని తెలిపారు సీపీ సజ్జనార్ దిశ ఫోన్ ఇక్కడ పెట్టాం, అక్కడ పెట్టామంటూ కొద్దిసేపు అటూ ఇటూ తిరిగి ఆ తర్వాత పోలీసులపై రాళ్లు, చేతికి దొరికిన కర్రలతో దాడి చేశారని వెపన్స్ తీసుకుని పోలీసులపై కాల్పులకు యత్నించారని ఈ దాడిలో ఓ ఎస్సై, కానిస్టేబుల్‌కు గాయాలు కూడా అయ్యాయని తెలిపారు సీపీ.

అయితే, లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినా నిందితులు వినకపోవడంతో చివరకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. కొద్ది సేపటి తర్వాత ఎలాంటి స్పందన లేకపోవడంతో ముందుకు వెళ్లి చూడగా మృతదేహాలు పడిఉన్నాయని పోలీసుల కాల్పుల్లో నలుగురు నిందితులు మృతిచెందినట్టు వివరించారు. తెల్లవారు జామున 5.45 గంటల నుంచి 6.15 మధ్య ఈ ఘటన జరిగిందని సీపీ తెలిపారు.

ఇక, నిందితులు గతంలోనూ నేరాలకు పాల్పడినట్టు అనుమానంగా ఉందని ఇంకా లోతైన విచారణ జరుపుతామని వెల్లడించారు. ఆరిఫ్‌, చెన్నకేశవులు దగ్గర రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్సై వెంకటేశ్‌, కానిస్టేబుల్‌ అరవింద్‌గౌడ్‌ తలకు గాయాలయ్యాయని తెలిపారు. గాయపడ్డ పోలీసులను కేర్‌ ఆస్పత్రికి చికిత్స పొందుతున్నారని చెప్పారు సజ్జనార్‌. దిశ కుటుంబాన్ని ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని కోరారు. ఏమైనా వెటర్నరీ డాక్టర్‌ దిశను కిరాతకంగా చంపిన నలుగురు నిందితులను కూడా పోలీసులు అదే ఘటనాస్థలంలో మట్టుబెట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories