రేపటి నుంచి దుబ్బాకలోనే ఉంటా...ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు

రేపటి నుంచి దుబ్బాకలోనే ఉంటా...ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు
x
Highlights

దుబ్బాక ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థి పేరు హైకమాండ్ పరిశీలనలో ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. అభ్యర్ధుల పేరును బుధవారం...

దుబ్బాక ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థి పేరు హైకమాండ్ పరిశీలనలో ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. అభ్యర్ధుల పేరును బుధవారం ప్రకటిస్తామని, అలాగే దుబ్బాక ఎన్నికలు ముగిసే వరకూ బుధవారం నుంచి ఆ నియోజకవర్గంలోనే ఉంటానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రపంచంలో ఎక్కడా లేని అవినీతి చోటుచేసుకుందని, సీఎం నుంచి వీఆర్వో వరకు ప్రతి ఒక్కరూ దోచుకుంటున్నారని మండిపడ్డారు.

యావత్ కాంగ్రెస్ కుటుంబం దుబ్బాక ఎన్నికల్లో అభ్యర్థికి సహకరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ న్యాయం చేశారా.. అన్యాయం చేశారా అనేది ఈ ఎన్నికలతో తేలిపోవాలి అని అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థులు డబ్బు ఎవరు పంపిణీ చేసినా ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయండి అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ సీఎం అయ్యాక.. తెలంగాణను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎల్‌ఆర్‌ఎస్ పథకం ద్వారా ప్రభుత్వం దోపిడీ చేస్తోందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసారు. తమ ప్లాట్లను క్రమబద్దీకరించుకునేందుకు ఇప్పుడెవరూ డబ్బు కట్టొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉచితంగా చేస్తామని పేర్కొన్నారు.

అనంతరం ఈ సమావేశంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుందని అన్నారు. 2023 ఎన్నికలకు దుబ్బాక ఉప ఎన్నిక నాంది కావాలని చెప్పారు. దౌల్తాబాద్ మండలంలో ఈ నెల 8న సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. దుబ్బాకలో వచ్చే 15 రోజులు కష్టపడితే విజయం మనదే అని కార్యకర్తల్లో ధైర్యం నింపారు. అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ నేతలందరూ ఓటు నమోదును సీరియస్‌గా తీసుకోవాలని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరుగా పేరు నమోదు చేయించుకోవడం కీలకమని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories