సాల్వ్ చేస్తారా? చేయమంటారా? : హైకోర్టు

సాల్వ్ చేస్తారా? చేయమంటారా? : హైకోర్టు
x
Highlights

ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వ తీరుపై మరోసారి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వానికి అధికారం ఉన్నట్లే కోర్టులకు కూడా అధికారాలు ఉంటాయనే సంగతి...

ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వ తీరుపై మరోసారి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వానికి అధికారం ఉన్నట్లే కోర్టులకు కూడా అధికారాలు ఉంటాయనే సంగతి మర్చిపోవద్దని హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కార్మికుల డిమాండ్లను మరోసారి పరిశీలించి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఈనెల 11లోపు కార్మికులతో చర్చలు జరపాలన్న హైకోర్టు ఒకవేళ సమస్యను పరిష్కరించలేకపోతే తామే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఆర్టీసీ స్థితిగతులు, బకాయిలపై ప్రభుత్వాధికారులు సమర్పించిన లెక్కలపై హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలుసా? అంటూ అధికారులను హెచ్చరించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు సమర్పించిన నివేదికలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.

ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్‌ శర్మ ఆర్ధికశాఖ ముఖ‌్య కార్యదర్శి రామకృష్ణారావు సమర్పించిన రెండు నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టు మండిపడింది. ఐఏఎస్ అధికారులు ఇలా కోర్టుకు అసంపూర్ణ నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించింది. అయితే, ప్రభుత్వ రికార్డుల ప్రకారమే తాము నివేదికలు ఇచ్చినట్లు అధికారులు హైకోర్టుకు తెలిపారు. దాంతో మొదటి నివేదికను పరిశీలించకుండానే ఇచ్చారా? అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. ఇంత దారుణంగా తప్పుడు వివరాలు ఇచ్చిన అధికారులను తన సర్వీసులో చూడలేదంటూ హైకోర్టు సీజే ఆర్ఎస్‌ చౌహాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు

అధికారులు సమర్పించిన నివేదికలను మరోసారి హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టడంతో ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు స్వయంగా వివరణ ఇచ్చారు. రికార్డుల ఆధారంగానే నివేదికలు రూపొందించామని పొరపాటుకు మన్నించాలని కోరారు. అయితే, క్షమాఫణ కోరడం సమాధానం కాదన్న హైకోర్టు వాస్తవాలు చెప్పాలంటూ వ్యాఖ్యానించింది. ఆర్ధికశాఖ ఆర్టీసీ నివేదికల్లోని అంకెలు వేర్వేరుగా ఉన్నాయంటూ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. సమస్యను తప్పుదోవ పట్టించేందుకు తెలివిగా గజిబిజి లెక్కలు పదాలు వాడారని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories