తొమ్మిది రోజులుగా మదినిండుగా పూల పండుగ

తొమ్మిది రోజులుగా మదినిండుగా పూల పండుగ
x
Highlights

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఏ దేశంలోనూ, అలాగే ఏ రాష్ట్రంలోనూ ప్రత్యేకంగా మహిళలు జరుపుకునే పండగ లేదు. కానీ ఒక్క తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు...

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఏ దేశంలోనూ, అలాగే ఏ రాష్ట్రంలోనూ ప్రత్యేకంగా మహిళలు జరుపుకునే పండగ లేదు. కానీ ఒక్క తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు మాత్రమే ఆ భాగ్యం సొంతం అయింది. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్క ఆడపడుచు జరుపుకునే పండగ అదే బతుకమ్మ పండగ.

తొమ్మిది రోజులపాటు పూలను పూజించే గొప్ప సంస్కృతికి మన రాష్ట్రం వేదిక. బతుకమ్మ పండగ వచ్చిందంటే చాలు ఆడబిడ్డలు తమకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు ఉన్నా వాటిని మరచి ఆనందంగా గడిపే సమయమిది. పండుగ వస్తే అత్తవారింటి నుంచి తమ ఆడబిడ్డలను పుట్టింటికి ఆహ్వానిస్తారు. అయితే ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా వారం రోజుల నుంచి ఆటపాటలతో పూల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. శనివారం జరిగే సద్దుల బతుకమ్మతో గౌరమ్మను సాగనంపేందుకు సిద్ధమవుతున్నారు. తెల్లవారు జామునే ఆడపచులు లేచి ఇల్లు, వాకిలిని శుభ్రం చేసి, కొత్త దుస్తులు ధరిస్తారు. ఉపవాసం ఉండి మధ్యాహ్న సమయానికి అన్నదమ్ములు తీసుకుచ్చిన పూలతో బతుకమ్మను అందంగా పేర్చి భక్తి శ్రద్దలతో పూజ చేస్తారు.

అయితే ఈ బతుకమ్మను పేర్చడానికి మహిళలు గుమ్మడి, తంగేడు, గునుగు, పట్టుకుచ్చులు, చామంతి, కట్ల, గోరింట తదితర పూలను వాడతారు. బతుకమ్మ పైభాగంలో గౌరీదేవికి ప్రతిరూపమైన గుమ్మడి పువ్వు, పసుపు ముద్దలను ఉంచుతారు. ఆ తరువాత అగర్‌బత్తీలు, ప్రమిదలు వెలిగించి, వీధుల కూడళ్లకు తీసుకెళ్లి బతుకమ్మలను ఒక్కచోట చేర్చుతారు. పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ చివరికి గౌరీ దేవిని సమీపంలోని చెరువులు, కుంటలు, జలాశయాల్లో బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు.

సద్దుల పండగ రోజు ప్రతి ఇంట ఆడపడుచులు రెండు బతుకమ్మలను పేర్చి గౌరమ్మను సాగనంపుతారు. అయితే ఈ సాంప్రదాయం ఎందుకొచ్చింటే సాధారణంగా ఆడపిల్లలకి పెళ్లి చేసినపుడు ఆమెను అత్తారింటికి సాగనంపే సమయంలో తోడుపెళ్లి కూతురిని పంపిస్తాం. ఇదే సంప్రదాయాన్ని బతుకమ్మకూ కొనసాగిస్తున్నారు. ఇక బతుకమ్మలను సాగనంపే సమయంలో ఆడపడుచులు పసుపుకుంకుమలతో వాయనాలు ఇచ్చు కోవడం ఆనవాయితీ. వాయనాల్లో పెసలు, బియ్యం పిండితో సత్తు, పులిహోర, పెరుగన్నం తదితరాలు సిద్ధం చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories