Cabinet Expansion: తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ ?

Time Fixed For The Expansion Of Telangana Cabinet?
x

Cabinet Expansion: తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ ?

Highlights

Cabinet Expansion: సీఎం రేవంత్ రెడ్డి టీమ్ రెడీ అయిందా ?

Cabinet Expansion: తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందా ? సీఎం రేవంత్ రెడ్డి టీమ్ రెడీ అయిందా ? త్వరలో మిగతా మంత్రులను ప్రకటించనున్నారా ? పార్లమెంట్ ఎన్నికల వేళ మంత్రులను ప్రకటించి.. వారితో ప్రత్యేక పని చేయించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందా ? వాచ్ ఇట్.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో డిసెంబర్ 7న సీఎంతో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసారు. అసెంబ్లీ స‌మావేశాల సమయంలో నలుగురు ఎమ్మెల్యేలకు విప్ బాధ్యతలు అప్పగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రేపో మాపో చీఫ్ విప్ ను కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే ఇదే సమయంలో క్యాబినెట్ విస్తరణకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న టీమ్ తోనే పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రభుత్వ పాలనను కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి వరకు భావించినా... పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలంటే మరి కొంత మందికి గెలుపు బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారట. ఒక్కో పార్లమెంట్ కి ఒక్కో మంత్రిని ఇన్‌చార్జీగా పెట్టాలని అనుకుంటున్నట్లు టాక్.

అయితే ఇప్ప‌టికే కొన్ని పార్లమెంట్ స్థానాలకు ఇన్‌చార్జీలను ప్రకటించిన రేవంత్ సర్కార్... ఇప్పుడు అన్ని స్థానాల్లో మంత్రులకు బాధ్యతలు అప్పగించాలనుకుంటుందట. చేవెళ్ల, మహాబూబ్ నగర్ సెగ్మెంట్లకి ఇన్‌చార్జీగా సీఏం రేవంత్ రెడ్డి ఉండగా... పొంగులేటికి ఖమ్మం, ఉత్తమ్ కి నల్లగొండ, పొన్నం ప్రభాకర్ కి కరీంనగర్, భట్టిని అదిలాబాద్ ఇన్‌చార్జీలుగా నియమించారు. ఇక మిగిలిని మరిన్ని స్థానాలకు కూడా ఇన్‌చార్జులను ప్రకటించాలంటే.. ముందుగా క్యాబినెట్ ని విస్త‌రించాల‌ని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోందట. అందుకనుగుణంగా రేవంత్ తన టీమ్ లోకి తీసుకోనున్న మంత్రుల జాబితా సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది.

దీంతో క్యాబినేట్ విస్తరణలో తమకు స్థానం లభిస్తుందనే ఆశతో పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కులాల సమీకరణలో తమకు క్యాబెన్‌లో బర్త్ కన్ఫామ్ అని కొందరు ఎమ్మెల్యేలు తమ అనుచరులు, సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా.. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగురు మంత్రులను నిర్ణయించాల్సి ఉంది. ఈ నియామకం కోసం పార్టీలో సీనియర్లుగా ఉన్న వాళ్ళతో పాటు విధేయుడిగా ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక గ్రేటర్ పరిధిలో బలం పెంచుకోవడానికి అక్కడ ఓడిపోయిన వారిని లేదా విధేయులుగా ఉన్న వారికి మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉన్నది టాక్.

నాంపల్లి నుండి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ ఓడిపోగా... కాంగ్రెస్ పార్టీలో ముస్లిం పాపులర్ లీడర్ లేకపోవడంతో ఫిరోజ్ కి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రిని చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కామారెడ్డి సీటుని రేవంత్ కోసం త్యాగం చేసినందుకు మాజీమంత్రి షబ్బీర్ అలీకి మంత్రిగా చాన్స్ రావచ్చు అంటున్నారు. వీరిద్దరిలో ఒకరికి మంత్రి బర్త్ కన్ఫర్మ్ అయితే ఇక మైనంపల్లి హన్మంతరావు కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారట. అయితే మైనంపల్లి హన్మంతరావు మల్కాజ్ గిరి నుండి లోక్ సభకి పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ భావిస్తోందట.

మొన్న పోటీ చేసి ఓడిపోయిన వారి పేర్లు కూడా మంత్రి పదవి కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కీ పేర్లు కూడా మంత్రివర్గ విస్తరణ కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి పేరు మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరు ప్రకటించి పక్కన పెట్టిన చిన్నారెడ్డి పేరు, టికెట్ రాకున్నా పార్టీకి లాయల్ గా ఉన్న అద్దంకి దయాకర్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం మంత్రి పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారట. వివేక్ బ్రదర్స్ లో ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్ మోహన్ రావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్లు సైతం మంత్రి పదవి కోసం గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఇప్పటికీ ఇందిరమ్మ ఇంట్లోనే ఉంటున్నాడని, అలాంటి సామాన్యులకి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని రేవంత్ పదేపదే చెప్తున్న నేపథ్యంలో అలాంటి వారికి మంత్రి పదవి ఇచ్చి ఒక ఉదాహరణగా సెట్ చేసే పనిలో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం.

ఇక బీసీ కులాల నుండి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రమోట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కురుమ‌ సామాజిక వర్గానికి చెందిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, రజక సామాజిక వర్గానికి చెందిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ల పేర్లు కూడా రేవంత్ పదేపదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో వారికి కూడా లక్ కలిసి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్. ఇక లంబ‌డా వ‌ర్గానికి చెందిన దెవ‌ర‌కొండ ఎమ్మెల్యే బాలు నాయ‌క్, ముదిరాజ్ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌క్త‌ల్ ఎమ్మెల్యే శ్రీహ‌రి ముదిరాజ్ ల పేర్లు కూడా మంత్రుల ప‌రిశీల‌న‌లో ఉన్నాయట.

పార్లమెంట్ ఎన్నికల వరకు మంత్రివర్గ విస్తరణ వద్దు అనుకున్న కాంగ్రెస్ పార్టీ త్వరగా మంత్రులను ప్రకటించి వారికి పార్లమెంట్ సెగ్మెంట్స్ ఇన్‌చార్జ్‌లుగా ప్రకటిస్తే లాభం ఉంటుందని భావిస్తోందట. మరి రేవంత్ టీమ్ లో ఎవరికి అవకాశం వస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories