Top
logo

Maoists Call For Bandh: తెలంగాణా మన్యంలో ఉద్రిక్తత.. నేడు బంద్ కు పిలుపిచ్చిన మావోయిస్టులు

Maoists Call For Bandh: తెలంగాణా మన్యంలో ఉద్రిక్తత.. నేడు బంద్ కు పిలుపిచ్చిన మావోయిస్టులు
X

Maoists Call For Bandh

Highlights

Maoists Call For Bandh | కొన్నాళ్ల నుంచి నిశద్ధంగా ఉన్న తెలంగాణా మన్యం మరోసారి తుపాకుల మోత వినిపిస్తోంది..

Maoists Call For Bandh | కొన్నాళ్ల నుంచి నిశద్ధంగా ఉన్న తెలంగాణా మన్యం మరోసారి తుపాకుల మోత వినిపిస్తోంది... అటు మావోయిస్టులు, ఇటు పోలీసులు ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. గుండాల ఎన్ కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు నేడు బంద్ కు పిలుపునివ్వడంతో ఒక్కసారి వాతావరణం వెడెక్కింది... ఇలా ఇరు వర్గాల పోరులో తమకు ఏ సమయంలో ఏ ముప్పు సంభవిస్తుందోనని గిరిజనులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు, బిక్కు మంటూ గడుపుతున్నారు.

తెలంగాణలో తిరిగి పుంజుకునేందుకు మావోయిస్టుల ప్రయత్నాలు.. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ముమ్మరంగా కూంబింగ్‌.. వెరసి మన్యం అట్టుడికిపోతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దేవళ్లగూడెంలో ఇటీవలి ఎన్‌కౌంటర్, సరిహద్దున ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో నలుగురు జవాన్లను శనివారం మావోలు హతమార్చిన తాజా ఘటనలతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. మావోయిస్టులు ఈ నెల 6వ తేదీన ఉత్తర తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం నెలకొంది. మావోలు తమ ప్రాబల్యం పెంచుకునేందుకు కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. యాక్షన్‌ టీమ్‌లను ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణలోకి పంపారు.

జూలై 20న మావోయిస్టు పార్టీ కొత్తగా రాష్ట్ర కమిటీని, మరో 12 డివిజన్, ఏరియా కమిటీలను, రాష్ట్రస్థాయి యాక్షన్‌ టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసు యంత్రాంగం మావోలను నిరోధించేందుకు నిరంతరం సెర్చ్‌ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఈ నెల 3న గుండాల ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత హరిభూషణ్‌ గన్‌మన్, యాక్షన్‌ టీం కమిటీ సభ్యుడు దూది దేవాల్‌ అలియాస్‌ శంకర్‌ హతమయ్యాడు. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ లేఖలను విడుదల చేసిన మావోయిస్టు ఏరియా, డివిజన్‌ కమిటీ కార్యదర్శులు ఉత్తర తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుండటంతో అవాంఛనీయ, విధ్వంసక ఘటనలు జరగకుండా నిరోధించేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. యాక్షన్‌ టీమ్‌లు సంచరిస్తున్న గోదావరి పరీవాహక జిల్లాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో కీలకమైన ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.

డీజీపీ పర్యవేక్షణ

డీజీపీ మహేందర్‌రెడ్డి నాలుగు రోజులుగా ఆసిఫాబాద్‌ జిల్లాలోనే మకాం వేసి సెర్చ్‌ ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్నారు. నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి పరీవాహక జిల్లాల్లో కూంబింగ్‌ ఆపరేషన్లు జిల్లా ఎస్పీలు చూసుకుంటున్నారు. సబ్‌ డివిజినల్‌ పోలీసు అధికారులు ఏకంగా స్పెషల్‌ పార్టీ బలగాలతో కూంబింగ్‌ ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. కొన్ని నెలల కిందట ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని సబ్‌ డివిజన్లలో ఎస్‌డీపీఓలుగా ప్రభుత్వం ఐపీఎస్‌ అధికారులనే నియమించింది. భద్రాచలంతోపాటు మణుగూరు, ఏటూరునాగారం సబ్‌ డివిజన్లకు ఐపీఎస్‌లను కేటాయించారు.

మరోవైపు మూడు రోజుల కిందట భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జిల్లాల్లో ప్రజాప్రతినిధుల సిఫారసులతో సంబంధం లేకుండా పోలీస్‌బాస్‌ మార్క్‌తో ఓఎస్డీ, సీఐల బదిలీలు చేశారు. మావోయిస్టు ఆపరేషన్లు చేయడంలో అనుభవం ఉన్న వారిని కీలకమైన ఠాణాలకు కేటాయించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో హైఅలర్ట్‌ ప్రకటించారు. భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (బీటీపీఎస్‌), సీతారామ ఎత్తిపోతల పథకాలకు పోలీసులు భద్రత మరింత పెంచారు. ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తుండటంతో మావోలు వారిలో కలసిపోయే అవకాశం ఉండటంతో పోలీసులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారపార్టీ నాయకులను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

26 మంది కిడ్నాప్‌ నలుగురి హత్య

మావోయిస్టులు భద్రాద్రి ఏజెన్సీకి సరిహద్దుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలోని మోటాపోల్, పునాసార్‌ అనే రెండు గ్రామాలకు చెందిన నలుగురు గిరిజనులను శనివారం పోలీస్‌ ఇన్‌ఫార్మర్ల నెపంతో హతమార్చారు. ముందుగా ఈ రెండు గ్రామాలకు చెందిన 26 మందిని కిడ్నాప్‌ చేసిన మావోయిస్టులు ప్రజాకోర్టు ఏర్పాటు చేసి ఈ నలుగురిని గొంతుకోసి దారుణంగా చంపారు. ఆరుగురిని విడిచిపెట్టి, మరో 16 మందిని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. బలగాలు కూంబింగ్‌ ఆపరేషన్లను నిలిపేయకపోతే తమ అధీనంలో ఉన్న 16 మందిని హతమారుస్తామని మావోయిస్టులు హెచ్చరించారు.

Web TitleTension in Telangana Agency Maoists call for bandh today
Next Story