
తెలంగాణలో ఫాంహౌస్‌లకు కొత్త రూల్స్.. ఇకపై ఇష్టమొచ్చినట్టు కడితే కుదరదు
Telangana Farmhouse Policy : తెలంగాణలో ఫాంహౌస్ సంస్కృతికి కొత్త రూపునిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అడ్డూఅదుపు లేకుండా వెలుస్తున్న ఫాంహౌస్ నిర్మాణాలకు చెక్ పెడుతూనే, వాటిని క్రమబద్ధీకరించేలా ఒక సమగ్రమైన ఫాంహౌస్ పాలసీని తీసుకురావాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఫాంహౌస్‌ల నిర్మాణాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు లేవు. దీనివల్ల రియల్టర్లు తమకు నచ్చిన రీతిలో చిన్న చిన్న స్థలాల్లో కూడా ఫాంహౌస్ లేఅవుట్లు వేసి విక్రయిస్తున్నారు. ఈ అస్తవ్యస్త అభివృద్ధిని అరికట్టి, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా కొత్త విధివిధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం తీసుకురాబోయే కొత్త పాలసీలో కొన్ని కీలక మార్పులు ఉండబోతున్నాయి. గతంలో ఫాంహౌస్‌లకు కొన్ని జోన్లలో మాత్రమే అనుమతి ఉండేది. కానీ ఇప్పుడు జోన్ పరిమితులు లేకుండా కన్వర్షన్, బయో కన్వర్షన్, కమర్షియల్, ఇండస్ట్రియల్ జోన్లలో కూడా ఫాంహౌస్‌లకు పచ్చజెండా ఊపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఉత్తమ విధానాలను అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ పాలసీ అమల్లోకి వస్తే అక్రమ నిర్మాణాలకు చెక్ పడటమే కాకుండా, డెవలప్మెంట్ ఛార్జీల రూపంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు చేరనున్నాయి.
కరోనా మహమ్మారి తర్వాత నగరవాసుల్లో ప్రకృతి ఒడిలో గడపాలనే ఆశ పెరిగింది. వీకెండ్ హోమ్స్ పేరుతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలైన మొయినాబాద్, శంషాబాద్, శంకర్పల్లి, మేడ్చల్ వంటి ఏరియాల్లో ఫాంహౌస్‌ల డిమాండ్ విపరీతంగా పెరిగింది. అయితే ఇదే అదునుగా కొందరు బిల్డర్లు 100, 200 గజాల వంటి చిన్న ప్లాట్లలో కూడా ఫాంహౌస్ అని నమ్మిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. వ్యవసాయ భూమిని గుంటల లెక్కన రిజిస్ట్రేషన్ చేస్తూ కొనుగోలుదారులను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. కొత్త పాలసీ ద్వారా ఇలాంటి అక్రమ వెంచర్లకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
కొత్త పాలసీ నిబంధనలు ఇవే!
ప్రభుత్వం సిద్ధం చేసిన ముసాయిదా ప్రకారం ఫాంహౌస్ నిర్మించాలంటే కొన్ని కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
* కనిష్ట స్థలం: ఫాంహౌస్ కోసం కనీసం 1,200 చదరపు గజాల స్థలం ఉండాలి. అంతకంటే తక్కువ స్థలంలో ఫాంహౌస్‌లకు అనుమతి ఉండదు.
* రోడ్డు వెడల్పు: ఫాంహౌస్ వెంచర్‌కు కనీసం 30 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డు తప్పనిసరి.
* నిర్మాణ విస్తీర్ణం: మొత్తం స్థలంలో కేవలం 20 శాతం మాత్రమే కాంక్రీట్ నిర్మాణానికి (భవనం కోసం) కేటాయించాలి. అంటే 1,200 గజాల్లో కేవలం 240 గజాల్లో మాత్రమే ఇల్లు కట్టుకోవాలి.
* అంతస్తుల పరిమితి: భవనం ఎత్తు 6 మీటర్లకు మించకూడదు. కేవలం జీ ప్లస్ వన్ (G+1) భవనానికి మాత్రమే అనుమతి ఉంటుంది.
* ప్రకృతి సాగు: మిగిలిన 80 శాతం భూమిలో ఖచ్చితంగా తోటలు, పండ్ల చెట్లు లేదా కూరగాయల సాగు చేపట్టాలి. అప్పుడే దానికి ఫాంహౌస్ హోదా లభిస్తుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




