ముంచుకొస్తున్న సమయం.. ముద్రణకు నోచుకోని పుస్తకం.. ఆందోళన చెందుతున్న టీచర్స్, పేరెంట్స్

Telangana Sarkar not yet Started Textbooks Printing for Schools Telugu and English Medium | Live News
x

ముంచుకొస్తున్న సమయం.. ముద్రణకు నోచుకోని పుస్తకం.. ఆందోళన చెందుతున్న టీచర్స్, పేరెంట్స్

Highlights

TS News: ఈసారి 1 నుంచి 8 వరకు ఇంగ్లిష్ మీడియాన్ని కూడా అనౌన్స్ చేసింది కేసీఆర్ సర్కారు...

TS News: విద్యా సంవత్సరం మొదలవుతోంది. జూన్‌ 13 నుంచే పిల్లలంతా బిలబిలమంటూ స్కూళ్లకు పరుగులు తీస్తారు. మరోవైపు పేరెంట్స్‎ను సంతోషపెడుతూ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా 1 నుంచి 8 వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే పుస్తకాల పంపిణీ మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఈసారి తెలుగు మీడియానికి ఇంగ్లిష్ మీడియం తోడై పుస్తకాలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కరోనా ప్రభావం తరువాత స్కూళ్లు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈసారి 1 నుంచి 8 వరకు ఇంగ్లిష్ మీడియాన్ని కూడా అనౌన్స్ చేసింది కేసీఆర్ సర్కారు. తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందంటున్నారు. మరి.. వారందరికీ పుస్తకాలు అందుతాయా లేదా అన్న ఆందోళన పేరెంట్స్ లో కనిపిస్తోంది. ఉపాధ్యాయ సంఘాలు కూడా అదే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్న ప్రభుత్వం తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో బై-లింగ్వల్‌ పుస్తకాలు ముద్రించాలని నిర్ణయించింది. ఒకవైపు ఇంగ్లిష్, మరోవైపు తెలుగు భాషలో పాఠాలు ముద్రిస్తారు. దీంతో పుస్తకం బరువు దాదాపు రెట్టింపవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్కో సబ్జెక్టును రెండు భాగాలుగా విభజించారు. సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 వరకు ఉన్న సిలబస్‌ను ఒక పుస్తకంలో, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–2లో ఉన్న సిలబస్‌తో మరో పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయించారు.

దీంతో ఈసారి ఎక్కువ సంఖ్యలో పుస్తకాలు ప్రింట్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని 24 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా వీటిని అందజేస్తారు. ఉచిత పుస్తకాలను 2 కోట్ల 10 లక్షల వరకు, ప్రైవేటులో విక్రయానికి మరో కోటీ 40 లక్షల పుస్తకాలు ముద్రించాల్సి ఉంది. గతంలో ఉచితంగా అందించే పుస్తకాలకు 60 కోట్లు వెచ్చిస్తే... ఇప్పుడా మొత్తం 120 కోట్లవుతుంది. రెట్టింపు ఖర్చుతో పాటు.. ముద్రించే పని కూడా ఇంకా మొదలు కాకపోవడంతో ఉపాధ్యాయుల్లో అనుమానాలు బయల్దేరాయి.

ప్రభుత్వ ముద్రణాలయంలో యంత్రాలన్నీ చాలావరకు పాతబడి, ముద్రణకు అనుకూలంగా లేవని చెబుతున్నారు. దీంతో ప్రైవేటు ముద్రణాలయాల్లో ముద్రించాల్సి ఉంది. దీని కోసం ప్రత్యేకంగా కమిటీ ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ, పరిశ్రమల శాఖ నుంచి ఓ అధికారి, ప్రభుత్వ ముద్రణాలయం ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. అయితే ఇప్పటివరకు ఈ కమిటీ భేటీ అయిన దాఖలాల్లేవు.

మరి... టెండర్ల ప్రక్రియ ఎలా చేపట్టారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పేపర్‌ అందించడానికి తమిళనాడు పేపర్‌ మిల్స్, పంజాబ్‌కు చెందిన సాతియా పేపర్స్, చండీగఢ్‌కు చెందిన మరో సంస్థ టెండర్లు వేశాయి. ఆ ప్రక్రియ మాత్రం పూర్తి కాలేదు. కరోనా తెరిపినిచ్చిన తరువాత ఈసారి పుస్తకాలతోపాటు స్కూల్ యూనిఫామ్స్ అందించే విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories