Telangana Rains: తెలంగాణను వీడని వర్షాలు.. నేడు ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

Telangana Rains
x

Telangana Rains: తెలంగాణను వీడని వర్షాలు.. నేడు ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

Highlights

Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు ఏమాత్రం తగ్గడం లేదు.

Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఒడిశాలోని గోపాల్‌పూర్ వద్ద తీరం దాటిన ఈ వాయుగుండం, నేడు దక్షిణ ఒడిశా-ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ జిల్లాలకు వర్ష సూచన

నేడు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షం కురిసే సమయంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.

శనివారం అత్యధికంగా వికారాబాద్ జిల్లాలోని మోమిన్‌పేటలో 15.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా లింగాయిపల్లిలో 10.4 సెం.మీ., సంగారెడ్డి జిల్లా మానూరులో 9.2 సెం.మీ., వరంగల్ జిల్లా మేడిపల్లిలో 9.1 సెం.మీ., ఆసిఫాబాద్‌లో 6.1 సెం.మీ. వర్షం కురిసింది.

ఉగ్రరూపం దాల్చిన మూసీ నది

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా మూసీ నది మహోగ్రరూపం దాల్చింది. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గరిష్ఠ స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎంజీబీఎస్, చాదర్‌ఘాట్, మూసారంబాగ్ పరిసరాల్లోని కాలనీలు నీట మునిగాయి. దాదాపు 2 వేల ఇళ్లు వరదలో చిక్కుకున్నాయి. వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, నగరం ట్రాఫిక్ జామ్‌తో స్తంభించిపోయింది.

మరో అల్పపీడనం రాక

ఈ నెల 30 నాటికి ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడవచ్చని, దీని ప్రభావంతో అక్టోబర్ 1 నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది కూడా వర్షాల తీవ్రతను మరింత పెంచే అవకాశం ఉందని, అక్టోబర్ మొదటి వారం నుంచి రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories