Telangana MSME policy 2024: ఎంఎస్ఎంఈలో ఎలా అప్లై చేసుకోవాలి, రుణంతో సహా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

Telangana MSME policy 2024: ఎంఎస్ఎంఈలో ఎలా అప్లై చేసుకోవాలి, రుణంతో సహా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
x
Highlights

Telangana MSME policy 2024: తెలంగాణలో నేటి నుండి కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ అందుబాటులొకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి శిల్పాకళా వేదికలో జరిగిన ఒక ప్రత్యేక...

Telangana MSME policy 2024: తెలంగాణలో నేటి నుండి కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ అందుబాటులొకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి శిల్పాకళా వేదికలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ పాలసీని ప్రవేశపెట్టారు. నాలుగు నెలల పాటు శ్రమించి, పారిశ్రామిక రంగంలో తీసుకురావాల్సిన విప్లవాత్మక మార్పులు, సాధించాల్సిన అభివృద్ధిపై పారిశ్రామికవేత్తలు, ఈ రంగంలోని నిపుణులు, పెట్టుబడిదారులు, ఈ రంగంతో ముడిపడి ఉన్న వారి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ పాలసీ రూపొందించాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

ఈ ఎంఎస్ఎంఈ పాలసీనే మనం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పాలసీ అని కూడా అంటుంటాం. ఇంతకీ ఈ ఎంఎస్ఎంఈ పాలసీలో ఏయే అంశాలు ఉంటాయి, ఒక నిరుద్యోగి ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే ఈ పాలసీ ఎలా ఉపయోగపడుతుంది? వ్యాపారం పెట్టడం, లేదా ఏదైనా పరిశ్రమను ఏర్పాటు చేయాలంటే ఎవరిని కలవాలి? రుణం ఎవరు ఇస్తారు? ఏ ప్రాతిపదికన ఇస్తారు? ఎంతిస్తారు? అనుమతులు ఎలా వస్తాయి అనే విషయంలో చాలామందికి సరైన అవగాహన ఉండదు. పబ్లిక్ డొమైన్‌లో సరైన సమాచారం అందుబాటులో లేకపోవడమే అందుకు కారణం. అందుకే అలాంటి సందేహాలను నివృత్తి చేసే లక్ష్యంతోనే ఈ డీటేయిల్స్ మీకోసం అందిస్తున్నాం.

MSME ఎదుర్కుంటున్న సవాళ్లు

కొత్తగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి తలెత్తే సమస్యలు వారికి పెను సవాళ్లుగా మారుతున్నాయి. ముఖ్యంగా తమ పరిశ్రమలకు అవసరమైన భూమి సౌలభ్యం, పెట్టుబడి సాయం, ఎంచుకున్న ఉత్పత్తులనుబట్టి అందుకు అవసరమైన ముడి పదార్థాల లభ్యత, శ్రామిక శక్తి కొరత, సాంకేతిక సౌలభ్యత లేకపోవడం, తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు మార్కెట్లతో అనుసంధానం లేకపోవడం వంటి సమస్యలు ఎంఎస్ఎంఈలను తీవ్రంగా వేధిస్తున్నాయి. దీంతో కొంతమంది ఆ సమస్యలను ఎదుర్కోలేక మధ్యలోనే తమ ప్రయత్నాలను విరమించుకుంటున్నారు. ఫలితంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కూడా క్రమక్రమంగా కుంటుపడుతూ వస్తోంది. ఈ కారణంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులేసే వారికి దారిచూపించి మార్గదర్శకం చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మరోసారి ఎంఎస్ఎంఈ పాలసీకి పదునుపెట్టి కొత్త పాలసీని తీసుకొచ్చామని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

సమస్యలకు పరిష్కారాలతో కొత్త పాలసీ

ఎంఎస్ఎంఈలు ఎదుర్కుంటున్న సమస్యలకు పరిష్కారం సూచించి దిశగానే కొత్త పాలసీని తీసుకొచ్చాం అని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. పరిశ్రమలకు అవసరమైన భూమిని సరసమైన ధలకే అందించడం, పెట్టుబడి కోసం రుణ సౌకర్యం సులభతరం చేయడం, నగర శివార్లలో ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేయనున్నట్లుగా చెబుతున్న స్కిల్డ్ యూనివర్శిటీ ద్వారా నైపుణ్యం కలిగిన కార్మిక శక్తిని పెంపొందించడం, సాంకేతిక వినియోగానికి ప్రోత్సహకాలు, మార్కెట్ సౌకర్యం కల్పించడం వంటి అంశాలను తెలంగాణ ప్రభుత్వం కొత్త పాలసీలో ప్రధానంగా ప్రస్తావించింది.

ఆలోచన నుండి ఆచరణ వరకు అంతటా మద్దతు

కొత్త ఆలోచనలతో ఈ రంగంలోకి వచ్చేవారిని ప్రోత్సహించేలా ఆలోచన నుండి ఆచరణలో పెట్టేంత వరకు ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ముఖ్యంగా సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు భూమి కొనుగోలు తలకుమించిన భారంగా మారిన నేపథ్యంలో ఇకపై భూమి కొనుగోలు విషయంలో ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. అందులో భాగంగానే ప్రతి పారిశ్రామిక పార్కులో ఎంఎస్ఎంఈల కోసం 20 శాతం ప్లాట్లు రిజర్వ్ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది. దీంతో పారిశ్రామికవేత్తలపై ఆర్ధిక భారం భారీగా తగ్గనుంది. అంతేకాదు.. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో పరిశ్రమలకు అవసరమైన భవనాలను కూడా ప్రభుత్వమే నిర్మించి ఇంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పరిశ్రమలకు ఇచ్చిన గడువులోగా వ్యాపార కార్యకలాపాలు మొదలుపెట్టని పక్షంలో ఆ సంస్థలకు కేటాయించిన భూమిని, భవనాలను వెనక్కి తీసుకునేలా ఈ కొత్త పాలసీని రూపొందించారు.

ఎంఎస్ఎంఈలో పరిశ్రమల స్థాయిని ఏ రకంగా గుర్తిస్తారంటే..

యంత్రాలతో సహా యూనిట్ నెలకొల్పేందుకు అయ్యే పెట్టుబడి రూ. 20 లక్షల వరకు ఉన్నట్లయితే దానిని సూక్ష్మ తరహా పరిశ్రమలు అంటారు. రూ. 20 లక్షల నుండి రూ. 5 కోట్ల మధ్యలో ఉంటే దానిని చిన్న తరహా పరిశ్రమలు అంటాం. అలాగే రూ. 5 కోట్ల నుండి 10 కోట్ల మధ్యలో పెట్టుబడి అవసరమయ్యే పరిశ్రమలను మధ్య తరహా పరిశ్రమలుగా గుర్తించడం జరుగుతుంది. ఇలా గుర్తించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వాల వరకు ప్రత్యేక దృష్టితో పరిగణిస్తూ ప్రాధాన్యత, తోడ్పాటుని అందిస్తాయి. ఫలితంగా దేశం ఆర్థికంగా ముందడుగేయడంతో పాటు ఉపాధి కల్పనకు కూడా అవకాశం ఉంటుందనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనగా ఉంటోంది.

ముందుగా చేయాల్సిన పని ఏంటంటే..

ఎంఎస్ఎంఈ పోర్టల్‌లో తమ పేరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ముందుగా మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలుకు సంబంధించిన అన్నిపత్రాలు మీ వద్ద సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అవసరాన్నిబట్టి పోర్టల్‌లో ఆ వివరాలు అందివ్వాల్సి ఉంటుంది. మీరు పరిశ్రమను నెలకొల్పేందుకు అప్పటికే ఏదైనా ఖర్చుపెట్టు ఉంటే.. ఆ లెక్కలు మీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్‌లో ఇచ్చిన వివరాలతోనూ మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఎంఎస్ఎంఈ అధికారుల పరిశీలనలో సమస్యలు ఎదుర్కునే ప్రమాదం ఉంది.

మీ పరిశ్రమ, లేదా వ్యాపారం ప్రతిపాదనల రూపకల్పన ప్రభుత్వానికి అర్థమయ్యేలా స్పష్టంగా ఉండాలి. అప్పుడే మీ ప్రతిపాదనకు ఎంఎస్ఎంఈ విభాగం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లేదంటే ఇక్కడే నిరాశ ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. కేవలం ఇలాంటి సమస్యల నుండి బయటపడేందుకే కొన్ని కన్సల్టెన్సీ సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. మీ ఆలోచనలు ఏంటో వారికి అర్థమయ్యేలా చెబితే.. వారే ఒక ప్రజెంటేషన్ రెడీ చేసి ఇస్తారు. అది తీసుకుని వెళ్లి సంబంధిత అధికారులకు చూపించి, అది అర్థమయ్యేలా వివరించడంలోనే మీ నైపుణ్యం ప్రదర్శించాల్సి ఉంటుంది. మీ అర్హతలు, ప్రతిపాదనల విజయావకాశాల ఆధారంగా ప్రభుత్వం వాటిని ఆమోదించి అన్ని ఇతర సౌకర్యాలు సమకూర్చుతుంది. ఆ డాక్యుమెంట్స్ ఆధారంగా బ్యాంకులు దరఖాస్తుదారులకు రుణం అందించడం జరుగుతుంది.

ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ చేసుకుంటే కలిగే లాభాలు

భూసేకరణలో ఇబ్బందులు ఉండవు.

వివిధ ప్రభుత్వ విభాగాల నుండి అనుమతుల మంజూరులో ప్రాధాన్యత ఉంటుంది.

కొన్నిరకాల ఎంఎస్ఎంఈలకు భవనాల నిర్మాణంతోనూ పనిలేదు. ఎందుకంటే ప్రభుత్వమే ప్రైవేటు భాగస్వామ్యంతో కలిసి భవనాలు కూడా నిర్మించి ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

సాధారణంగా ఎవరైనా లోన్ కావాలంటే అందుకోసం ఏదైనా సెక్యురిటీని తనఖా పెట్టాల్సి ఉంటుంది. కానీ ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ అయ్యే సంస్థలకు ఏ కొలేటరల్ సెక్యురిటీ లేకుండానే తక్కువ వడ్డీ రేటుతో రుణం మంజూరు చేస్తారు. సిబిల్ స్కోర్ ఆధారంగా మీకు ఇచ్చే రుణ పరిమితి ఉంటుంది. అందులో కూడా సబ్సీడీ ఇస్తారు. అంతేకాదు.. తక్కువ వడ్డీ రేటుతో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది.

పరిశ్రమకు అవసరమైన పనిముట్లు, యంత్రాల కొనుగోలు, సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునే విషయాల్లోనూ ప్రభుత్వం సబ్సీడీ అందిస్తుంది.

ఎంఎస్ఎంఈలో రాణించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల వారికి ప్రోత్సాహకాల కింద ఇంకొంత అధిక మొత్తంలో సబ్సీడీలు లభిస్తాయి.

ఎలాంటి అనుభవం లేకున్నా మీ ప్రతిపాదన ఆమోదం పొందే అవకాశం.

పరిశ్రమకు అవసరమైన విద్యుత్ వినియోగంలోనూ రాయితీలు పొందే అవకాశం ఉంది. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే పరిశ్రమలకు ఒకరకంగా ఇది వరంలా పనిచేస్తుంది.

మీ ఉత్పత్తిని మార్కెట్లో అమ్ముకునేందుకు అవసరమైన వాతావరణాన్ని కూడా ఎంఎస్ఎంఈ కల్పిస్తుంది.

పరిశ్రమలు, వ్యాపార నిర్వహణలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక యంత్రాంగం పనిచేస్తుంది. ప్రతీ నెలకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహించి, సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక విభాగం పనిచేస్తుంది. తద్వారా సమస్యల పరిష్కారం కూడా లభిస్తుంది.

ఇవేకాదు.. ఇలాంటివెన్నో ఇతర అంశాలు, ప్రయోజనాలు ఎంఎస్ఎంఈ పాలసీలో అంతర్బాగంగా ఉంటాయి. సమస్యను, సందర్భాన్నిబట్టి ఆ ప్రయోజనాలను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఇలాంటి ప్రయోజనాలు ఏవీ ఎంఎస్ఎంఈలో నమోదు కానీ పరిశ్రమలు, వ్యాపారాలకు వర్తించవు. అక్కడ వారి సమస్యలను వారే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories