భవిష్యత్‌ తరాల కోసం హరితహారం : మంత్రి కేటీఆర్

భవిష్యత్‌ తరాల కోసం హరితహారం : మంత్రి కేటీఆర్
x
KTR (File Photo)
Highlights

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి ఏటా ఎంతో మంచి స్పందన లభిస్తుంది.

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి ఏటా ఎంతో మంచి స్పందన లభిస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా ప్రభుత్వం హరితహారం కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా ఈ నెల 25న ప్రారంభం కానున్న ఆరో విడత హరితహారం కార్యక్రమంపై సోమవారం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాలను మెరుగైన రాష్ట్రం, మెరుగైన పట్టణం అందించాలనే సంకల్పంతో ఈ హరితహారం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని కేటీఆర్ అన్నారు.

వారసత్వంగా వస్తున్న హైదరాబాద్ నగరాన్ని ఇప్పుడున్న దానికంటే కూడా ఇంకా మెరుగ్గా చేసి భవిష్యత్‌ తరాలకు అందించాలని దృఢమైన సంకల్పంతో కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే తరాలు ఆరోగ్యంగా బాగుండాలన్న ఉద్దేశంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారని ఆయన తెలిపారు. ఇతర పార్టీల నాయకులు మళ్లీ ఎన్నికల్లో గెలిచే కార్యక్రమాలపై దృష్టి పెడుతారని, రాజకీయ నాయకులు వారికి లబ్ధి చేకూరేలా, ఓట్లు వచ్చేలా కార్యక్రమాలు చేపడతారని తెలిపారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం అలా చేయలేదని భవిష్యత్తు తరాలవారి కోసం ఆలోచించారని తెలిపారు.

గ్రామాల్లో ప్రస్తుతం చెట్లు పెట్టాలన్న కల్చర్‌ వచ్చిందన్నారు. గ్రామాల్లో ఉండే ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ఆదరిస్తున్నారని, రాజకీయంగా ఏ లబ్ధి కోసం కాకుండా మంచి ఆలోచన, మంచి మనస్సుతో చేపట్టినందుకు ప్రజల్లోకి వెళ్లిందన్నారు. ఎదో ఒక సమయంలో ఇతర గ్రామాలకు వెళ్లినపుడు ఔటర్‌ రింగ్‌రోడ్డుపై చెట్లు పెరిగి పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుందన్నారు. అంతే కాక దేశాల నుంచి వచ్చిన వారు ఎయిర్‌పోర్టులో దిగి, ఔటర్‌ రింగ్‌రోడ్డు మీదుగా హైదరాబాద్‌కు వచ్చేటప్పుడు, ఇతర రాష్ట్రాలకు వెల్లేటపుడు రోడ్డు మార్గం పచ్చగా కనిపిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా విజయవంతం చేయాలని కోరారు.

అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లడుతూ ఈ ఏడాది కూడా హైదరాబాద్‌లో భారీ ఎత్తున హరితహారం కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి ఆగస్టు 15 వరకు కొనసాగే హరితహారం కార్యక్రమంలో భాగంగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అందరికీ మొక్కలు అందజేస్తామని తెలిపారు. మొక్కలు నాటడం, కాపాడడం సామాజిక బాధ్యతని, హైదరాబాద్‌లో ఉన్న పౌరులందరూ మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, దానం నాగేందర్‌ పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories