Health Mission-100 : తెలంగాణలో 'హెల్త్ మిషన్-100' షురూ.. మార్చి 2 నుంచి 100 రోజుల పాటు ఆరోగ్య పండగ

Health Mission-100 : తెలంగాణలో హెల్త్ మిషన్-100 షురూ.. మార్చి 2 నుంచి 100 రోజుల పాటు ఆరోగ్య పండగ
x
Highlights

తెలంగాణలో 'హెల్త్ మిషన్-100' షురూ.. మార్చి 2 నుంచి 100 రోజుల పాటు ఆరోగ్య పండగ

Health Mission-100 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై భారీ యుద్ధాన్ని ప్రకటించింది. గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు ప్రభుత్వ వైద్య సేవలను ప్రజల ముంగిటకే చేర్చడమే లక్ష్యంగా హెల్త్ మిషన్–100 పేరుతో 100 రోజుల సమగ్ర ఆరోగ్య ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. మార్చి 2 నుంచి జూన్ 9 వరకు జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం చికిత్స మాత్రమే కాకుండా, వ్యాధి రాకముందే గుర్తించి నివారించేలా ఈ మిషన్‌ను రూపొందించడం విశేషం.

ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 42 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు టీ-డయాగ్నస్టిక్స్ ద్వారా సుమారు 30 రకాల వైద్య పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నారు. అంతేకాదు ప్రతి మహిళకు ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించి, వారి ఆరోగ్య వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. దీనివల్ల భవిష్యత్తులో వారికి ఎలాంటి అత్యవసర చికిత్స అవసరమైనా, వారి ఆరోగ్య చరిత్ర వైద్యులకు ఇట్టే తెలిసిపోతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, పరికరాలు, సిబ్బంది కొరత లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు.

మార్చి నెలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్ వంటి స్పెషలిస్ట్ వైద్యులతో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. వృద్ధుల కోసం 33 ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ప్రత్యేక స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటవుతాయి. రక్తహీనతను అరికట్టేందుకు ఐరన్ మాత్రల పంపిణీతో పాటు, మహిళల్లో ప్రమాదకరంగా మారుతున్న రొమ్ము గర్భాశయ క్యాన్సర్ పరీక్షలను ముమ్మరం చేస్తారు. పాఠశాలలు, అంగన్‌వాడీల్లోని చిన్నారులకు కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి టీకాలు, పౌష్టికాహారాన్ని అందిస్తారు.

ఏప్రిల్ నెలలో ప్రభుత్వం క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి సారించనుంది. ఇకపై క్యాన్సర్‌ను నోటిఫైడ్ వ్యాధిగా గుర్తించి, రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల వివరాలతో కూడిన రిజిస్ట్రీని ఏర్పాటు చేస్తారు. జిల్లా కేంద్రాల్లోని డే-కేర్ సెంటర్లలో కీమోథెరపీ సేవలను మరింత విస్తరిస్తారు. మే నెల వరకు టీబీ, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులతో పాటు, వేసవి తాపాన్ని తట్టుకునేలా వడదెబ్బ చికిత్స కోసం ప్రత్యేక వార్డులను సిద్ధం చేస్తారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోని ప్రధాన ఆసుపత్రుల్లో వడదెబ్బ బాధితులకు తక్షణ చికిత్స అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ మిషన్ ముగింపు దశలో అంటే మే 16 నుంచి జూన్ 9 వరకు పట్టణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలను పాలీ క్లినిక్‎లుగా అప్‌గ్రేడ్ చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్, థలసీమియా వంటి రక్త సంబంధిత వ్యాధుల గుర్తింపు కోసం మొబైల్ మెడికల్ యూనిట్లు నిరంతరం పర్యటిస్తాయి. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ 100 రోజుల మిషన్ సాధించిన విజయాలను ప్రభుత్వం ప్రజలకు వివరించనుంది. మొత్తానికి ఈ హెల్త్ మిషన్-100 ద్వారా తెలంగాణను ఒక ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా యంత్రాంగం కదులుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories