
వాహనదారులకు బంపర్ ఆఫర్..ఇంటి నుంచే ఆర్టీఏ పనులన్నీ ఫినిష్
Telangana RTA : తెలంగాణ వాహనదారులకు రేవంత్ రెడ్డి సర్కార్ అదిరిపోయే తీపి కబురు అందించింది. ఇకపై ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సిన పనిలేదు. బ్రోకర్ల బెడద అంతకన్నా ఉండదు. మన రాష్ట్ర రవాణా శాఖను కేంద్ర ప్రభుత్వ జాతీయ నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్సుల కోసం సారథిని తీసుకొచ్చిన సర్కార్, ఇప్పుడు వాహన రిజిస్ట్రేషన్ల కోసం వాహన్ పోర్టల్‌ను రంగంలోకి దించింది. దీనివల్ల తెలంగాణ రవాణా రంగం స్వరూపమే మారిపోబోతోంది.
వన్ నేషన్ – వన్ రిజిస్ట్రీ
తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అధికారికంగా జాతీయ వాహన రిజిస్ట్రీలో భాగం కాబోతోంది. దీనివల్ల వన్ నేషన్ – వన్ రిజిస్ట్రీ అనే లక్ష్యం నెరవేరుతుంది. గతంలో వేరే రాష్ట్రం నుంచి బండి కొని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించాలన్నా లేదా ఇక్కడి బండిని వేరే రాష్ట్రానికి తీసుకెళ్లాలన్నా చుక్కలు కనిపించేవి. ఎన్ఓసీ కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు డేటా అంతా కేంద్ర సర్వర్‌లో ఉండటం వల్ల ఇతర రాష్ట్రాల ఆర్టీఏల మధ్య సమన్వయం పెరుగుతుంది. దీంతో ఎన్ఓసీలు, బదిలీలు నిమిషాల వ్యవధిలోనే పూర్తవుతాయి.
సెకండ్ హ్యాండ్ బండి కొంటున్నారా?
చాలామంది పాత వాహనాలను కొనేటప్పుడు అవి దొంగిలించినవా? లేక వాటిపై ఏవైనా భారీగా చలాన్లు ఉన్నాయా? అని భయపడుతుంటారు. ఇప్పుడు ఆ టెన్షన్ అక్కర్లేదు. వాహన్ పోర్టల్‌లో ఇంజిన్ నంబర్, ఛాసిస్ నంబర్ కొడితే చాలు.. ఆ బండి అసలు రంగు బయటపడుతుంది. గతంలో ఆ వాహనంపై ఏవైనా క్రిమినల్ కేసులు ఉన్నా, లోన్లు క్లియర్ అవ్వకపోయినా వెంటనే తెలిసిపోతుంది. దీనివల్ల సెకండ్ హ్యాండ్ వాహనాల మార్కెట్లో మోసాలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుంది.
డిజిటల్ ఆర్సీకి పచ్చజెండా
డూప్లికేట్ ఆర్సీ కావాలా? అడ్రస్ మార్చుకోవాలా? లేక లోన్ కట్టేసాక హైపోథికేషన్ రద్దు చేయాలా? వీటన్నింటికీ ఇక ఆర్టీఏ ఆఫీసు మెట్లు ఎక్కక్కర్లేదు. ఇంటి దగ్గరే కూర్చుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు, జేబులో ఫిజికల్ డాక్యుమెంట్లు లేకున్నా పర్వాలేదు. డిజీ లాకర్ లేదా ఎం-పరివాహన్ యాప్‌లో ఉండే డిజిటల్ ఆర్సీని ట్రాఫిక్ పోలీసులు అంగీకరించాల్సిందే. దీనివల్ల సామాన్యులకు బ్రోకర్ల దోపిడీ నుంచి విముక్తి లభిస్తుంది.
నేరస్థుల ఆట కట్టిస్తున్న జాతీయ నెట్‌వర్క్
వాహన దొంగతనాల విషయంలో ఈ కొత్త సిస్టమ్ పోలీసులకు ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. తెలంగాణలో బండి దొంగిలించి పక్క రాష్ట్రాల్లో నంబర్ ప్లేట్ మార్చి అమ్మేద్దామనుకుంటే ఇక పప్పులు ఉడకవు. ఛాసిస్ నంబర్ ఆధారంగా దేశంలో ఎక్కడైనా వాహనాన్ని గుర్తించవచ్చు. అలాగే ఇతర రాష్ట్రాల్లో నేరాలు చేసి ఇక్కడ తలదాచుకునే వాహనాలను కూడా ఈజీగా పట్టుకోవచ్చు. ఈ విప్లవాత్మక మార్పుతో తెలంగాణ రవాణా శాఖ దేశంలోనే ఆదర్శంగా నిలవబోతోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




