HYDRAA ఎక్స్‌ట్రా చేసిందా? తెలంగాణ హైకోర్టు ఎందుకు ఎంటరైంది?


hydra hyderabad
హైడ్రా అంటే భరోసా, బాధ్యత అని ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు.రెండు నెలలుగా ప్రజలు నివసిస్తున్న భవనాలను కూల్చలేదని ఆయన శనివారం చెప్పారు.
హైడ్రా పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. నోటీసులిచ్చిన మరునాడే నిర్మాణాలను కూల్చివేయడం ఏంటని కోర్టు ప్రశ్నించింది. ప్రారంభంలో హైడ్రా పనితీరుపై ప్రశంసలు వచ్చాయి. అభిమానించిన వారే ఎందుకు అనుమానిస్తున్నారు.
హైడ్రా తరహా సంస్థలు తమకు కూడా ఉండాలని జిల్లాల నుంచి వచ్చిన డిమాండ్ ఆ తర్వాత ఎందుకు వ్యతిరేకతగా మారింది.ఇప్పటి వరకు అక్రమ నిర్మాణాలనే కూల్చివేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. శనివారం తాజాగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కూడా ఆయన హైడ్రా అంటే భరోసా అని, హైడ్రాకు చిన్నా, పెద్దా తేడా లేదని అన్నారు.
హైడ్రా కమిషనర్ హాజరుకావాలని హైకోర్టు ఆదేశం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను సెప్టెంబర్ 30న వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా గానీ తమ ముందు హాజరు కావాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డిపూట పంచాయితీ పరిధిలో మహ్మద్ రపీ, గణేష్ కన్ స్ట్రక్షన్స్ కు చెందిన ఆసుపత్రి భవన్ కూల్చివేతలను హైకోర్టు తప్పుబట్టింది. సెప్టెంబర్ 5న ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించారని న్యాయస్థానం ఆదేశించింది.
ఈ లోపుగా అమీన్ పూర్ మున్సిపల్ అధికారులు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అమీన్ పూర్ సర్వే నెంబర్ లోని 164 లో ఆక్రమణలను 18 గంటల్లో తొలగించాలని సెప్టెంబర్ 20 న తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 20వ తేదీతో ఉన్న నోటీసులను ఈ నెల 21 సాయంత్రం ఆరున్నర గంటలకు జారీ చేశారు.
మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 22 ఉదయం ఏడున్నర గంటలకు ఐదంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చింది. సర్వే నెంబర్ 165, 166 లలో రఫీకి చెందిన 210 గజాల స్థలాన్ని గణేష్ కన్ స్ట్రక్షన్స్ కు విక్రయించారు. 2022 నవంబర్ 10న పంచాయితీ నుంచి అనుమతులు తీసుకుని భవనం నిర్మించారని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు.
ప్రభుత్వ స్థలాన్ని రక్షించే ఉద్దేశ్యంతోనే హైడ్రా రంగంలోకి దిగిందని ప్రభుత్వ తరపు న్యాయవాది కె. రవీందర్ రెడ్డి కోర్టుకు నివేదించారు. అయితే, హైడ్రా చట్టబద్దత ఏంటో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. నోడల్ ఏజెన్సీ అంత దూకుడుగా ఎందుకు వెళ్తుందో అర్ధం కావడం లేదని కోర్టు వ్యాఖ్యలు చేసింది.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రాపై ప్రశంసలు
ప్రభుత్వ భూములు, చెరువులు, నీటి వనరుల ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేతలను హైడ్రా ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఆగస్టు 24న ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేసింది. సినీ నటులు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడంపై చర్చ జరిగింది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిబంధనలకు విరుద్దంగా ఉన్న ఎన్ కన్వెన్షనైనా మరోటైనా ఒక్కటేనని రంగనాథ్ చెప్పారు.
ప్రకటించినట్టుగానే ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు. అక్రమాలకు పాల్పడినవారిని వదలబోమని ఈ ఘటనతో సంకేతాలిచ్చారు. దీంతో హైడ్రాకు మద్దతుగా హైద్రాబాద్ లో ప్రదర్శనలు చేశారు. ఇలాంటి వ్యవస్థలు కూడా జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్లు వచ్చాయి.
నిర్మాణంలో ఉన్న వాటినే కూల్చేయాలని నిర్ణయం
అక్రమ నిర్మాణాల విషయంలో హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. చెరువులతో పాటు, నీటివనరుల ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్లలోని భవనాలు నిర్మించి నివాసం ఉంటే వాటి జోలికి వెళ్లకూడదని హైడ్రా తేల్చి చెప్పింది.
వీటి పరిధిలో కొత్తగా నిర్మాణాలు చేపట్టినా,ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవాటిని కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ఈ మేరకు సెప్టెంబర్ 8న ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
కోర్టుకు వెళ్లిన బడా లీడర్లు
మాజీ మంత్రి మల్లారెడ్డి, ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కి చెందిన అనురాగ్ యూనివర్శిటీలు నీటి వనరుల్లో అక్రమంగా నిర్మించారని నోటీసులు ఇచ్చారు. ఈ సంస్థల భవనాలను కూల్చివేస్తే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుందని వీరికి సమయం ఇవ్వాలని హైడ్రా నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోపుగా నోటీసులు అందుకున్న భవనాల యజమానులు తమ అక్రమ నిర్మాణాలను కూల్చకపోతే తామే కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.
హైడ్రా ఈ నిర్ణయం తీసుకొనేలోపుగానే కొందరు భవనాల యజమానులు కోర్టును ఆశ్రయించి స్టే లు తెచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరులు ఎ. తిరుపతిరెడ్డికి ఆగస్టు 24న నోటీసులు జారీ అయ్యాయి. దుర్గం చెరువు బఫర్ జోన్ పరిధిలో ఉన్న నివాసానికి సంబంధించి ఆయన నోటీసు అందుకున్నారు. ఈ నోటీసులపై ఆయన కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. జయభేరి సంస్థకు కూడా నోటీసులు అందాయి. తమ సంస్థ అక్రమ నిర్మాణాన్ని తామే కూల్చివేస్తామని జయభేరి సంస్థ యజమాని మురళీమోహన్ ప్రకటించారు.
హైడ్రాపై వ్యతిరేకత ఎందుకు?
ప్రభుత్వ స్థలం, నీటి వనరుల్లో భవనాలు నిర్మించి వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న వారిని లక్ష్యంగా హైడ్రా పనిచేసిన సమయంలో ప్రశంసలు వచ్చాయి. నిలువ నీడ కోసం తాత్కాలిక నివాసాలు, ఇళ్లు కట్టుకున్న సామాన్యుల జోలికి హైడ్రా వెళ్లిన సమయంలో పరిస్థితిలో మార్పు వచ్చింది. పెద్దలను వదిలి పేదలపై పడ్డారనే విమర్శలు కూడా వచ్చాయి.
పలుకుబడిన నాయకులు, సంపన్నులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తమ నిర్మాణాలను కాపాడుకున్నారు. కానీ, కోర్టులకు వెళ్లలేని బాధితుల ఇండ్లు హైడ్రా బులోడ్జర్ల కింద శిథిలమయ్యాయి. 20 ఏళ్ల నుంచి ఉంటున్నాం. కానీ, తెల్లవారుజామునే వచ్చి ఇళ్లు ఖాళీ చేయాలని చెప్పారు. కనీసం తమ సామాను కూడా తీసుకోవడానికి సమయం కూడా ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు.
హైడ్రాకు మరిన్ని అధికారాలు
హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 20 జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. వాల్టా చట్టంతో పాటు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ బోర్డుకు ఇప్పుడున్న అధికారాలను హైడ్రా కమిషనర్‌కు అప్పగించారు.
హైద్రాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలను పరిరక్షించే బాధ్యతలను హైడ్రా తీసుకుంటుంది. హైడ్రా పరిధిలోకి జీహెచ్ఎంసీతో పాటు 27 అర్బన్ లోకల్ బాడీస్, 51 గ్రామ పంచాయతీలు వస్తాయి. వీటిలో హైడ్రా కమిషనర్‌కు అవసరమైన అధికారాలు కల్పించేలా చట్ట సవరణకు కేబినేట్ ఆమోదం తెలిపింది.
హై డ్రాకు అవసరమైన దాదాపు 169 మంది అధికారులు, 946 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్ మీద నియమించుకునేందుకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. హైడ్రాకు కట్టబెట్టిన అధికారాలపై ఆర్డినెన్స్ ను తీసుకురానున్నారు.
రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. ప్రస్తుతమున్న అధికారాలతోనే హైడ్రా హడలెత్తిస్తోంది. మరిన్ని అధికారాలను కట్టబెడితే పరిస్థితి ఏంటనే చర్చ కూడా లేకపోలేదు. హైడ్రా అంటే హైడ్రోజన్ బాంబుగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. ఎప్పుడు ఏ ఇల్లు కూల్చివేస్తారోననే భయంతో సామాన్యులు బతుకుతున్నారని ఆయన చెప్పారు. కూల్చివేతలతో హైద్రాబాద్ పేరును నాశనం చేస్తున్నారని ఆయన రేవంత్ రెడ్డి సర్కార్ పై విమర్శలు చేశారు.
మూసీ వెంట మార్కింగ్ లతో మాకు సంబంధం లేదు
మూసీ సుందరీకరణకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే మూసీ వెంట ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేయనున్నారు. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 27, 28 తేదీల్లో అధికారులు సర్వే నిర్వహించారు. పునరావాసం కల్పించాల్సిన ఇళ్లకు మార్కింగ్ చేశారు. ఈ ఇళ్లపై RBX అని మార్కింగ్ చేశారు. అయితే ఈ సర్వేకు వచ్చిన అధికారులపై స్థానికులు తిరగబడ్డారు. ఆందోళన చేశారు.
దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, మారుతినగర్ లో స్థానికుల ఆందోళనకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారో చెప్పాలని ఆయన రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.పేదల కళ్లలో నీళ్లు చూసిన పాలకులకు ఏనాడూ మంచి జరగదని ఆయన చెప్పారు. మరో వైపు మూసీ సుందరీకరణలో భాగంగా చేస్తున్న సర్వేకు హైడ్రాకు సంబంధం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు.
హైడ్రా అంటే భరోసా
తాజాగా 28 శనివారం నాడు రంగనాథ్ ప్రెస్ మీట్‌లో హైడ్రాపై వివరణ ఇచ్చారు. హైడ్రా అంటే భరోసా, బాధ్యత అని అన్నారు. రెండు నెలలుగా ప్రజలు నివసిస్తున్న భవనాలను కూల్చలేదని, ముందస్తుగా సమాచారం ఇచ్చినా కొందరు ఖాళీ చేయలేదని వివరించారు.
కూకట్ పల్లి నల్లచెరువులో ఆక్రమణల కూల్చివేతలను రంగనాథ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అమీన్ పూర్ లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని అన్నారు. పలుకుబడి గల వ్యక్తులు చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేశారని, హైడ్రా అందరినీ ఒకేలా చూస్తుందని కమిషనర్ తెలిపారు.
ముఖ్యంగా, హైడ్రా బూచి కాదు.. భరోసా అని రంగనాథ్ అన్నారు. సోషల్ మీడియాలో హైడ్రాపై వ్యతిరేక ప్రచారం జరుగుతుండడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
హైడ్రా విషయంలో ఒత్తిడులు ఉన్నాయన్న సీఎం రేవంత్
హైడ్రా విషయంలో తనపై అనేక ఒత్తిడులున్నాయని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. కానీ, ఒక నిర్ణయం తీసుకున్నాక ముందుకు వెళ్లాల్సిందేనని, ప్రభుత్వం వెనక్కి తగ్గదని ఆయన అన్నారు.
ఏది ఏమైనా, హైడ్రా దృష్టిలో అందరూ ఒక్కటేననే అభిప్రాయం ప్రజలకు కలిగినప్పుడే ఈ సంస్థ క్రెడిబిలిటీ నిలబడుతుంది. దీనిపై రెండో అభిప్రాయం వస్తే అది రాజకీయ కాలుష్యంలో చిక్కుకుపోతుంది. ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారో, ఆ లక్ష్యం నెరవేరకుండా పోతుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



