Telangana MLC elections: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

Telangana Mlc Elections
x

ఇమేజ్ సోర్స్ (TheHansindia)

Highlights

Telangana MLC elections: నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు..బ్యాలెట్‌ పద్దతిలో ఎమ్మెల్సీ ఎన్నికలు

Telangana MLC elections: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు.. అసెంబ్లీ ఎలక్షన్స్‌ను తలపిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీ గెలపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హోరా హోరీగా సాగుతున్న పట్టభద్ర ఎమ్మెల్సీ పోరులో అభ్యర్థులు ఆఖరి అస్త్రాలను సంధించే పనిలో పడ్డారు.

రాష్ట్రంలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. సాధారణ ఎన్నికల కంటే ఎక్కువగా ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఈ నెల 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 17న ఫలితాలు వెలువడనున్నాయి.

మూడు ఉమ్మడి జిల్లాల్లో 731 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 5లక్షల 5వేల 565 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుష ఓటర్లు 3లక్షల 32వేల 634 మంది, స్త్రీ ఓటర్లు లక్షా 72వేల 864 మంది, ట్రాన్స్‌జెండర్ల ఓటర్లు 67 మంది ఉన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలను లెక్కలోకి తీసుకుంటే మొత్తం 12 జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో గ్రాడ్యువేట్‌ ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 90 వేల 826 మంది ఓటర్లు ఉండగా.. ములుగు జిల్లాలో అత్యల్పoగా 10 వేల 323 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 71 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 15 మంది పార్టీల అభ్యర్థులు, 56 మంది స్వతంత్రులుగా బరిలో నిలిచారు.

ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలో జరగనున్న నేపథ్యంలో ప్రత్యేకంగా జంబో బ్యాలెట్‌ బాక్స్‌లను తయారు చేసి ఉపయోగించనున్నారు. బ్యాలెట్ పేపర్ కూడా న్యూస్ పేపర్ అంత సైజ్‌లో ముద్రించారు. పోలింగ్‌ కేంద్రాల్లో కరోనా నిబంధనలు అమలయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఈసారి వృద్ధులు, కరోనా అనుమానితులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు ఎన్నికల సంఘం కల్పించింది. ఈ ఉమ్మడి జిల్లాల్లో పోలింగ్ కోసం 8 వేల మంది సిబ్బందితో పాటు 11వేల మంది పోలీసులను భద్రత కోసం ఉపయోగిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. 17న జరిగే కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నల్గొండ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర గిడ్డంగుల గోడౌన్స్‌లో కౌంటింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 8 హాల్లో 56 టేబుల్స్ ఏర్పాటు చేసి.. లెక్కించనున్నారు.

మరోపక్క హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానానికి జరిగే ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ నెల 17న సరూర్‌నగర్‌ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. మొత్తం తొమ్మిది జిల్లాలైన మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణ పేట, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొంటారు.

మొత్తం 5 లక్షల 31 వేల 268 ఓటర్లు ఉండగా.. వీరిలో 3లక్షల 36 వేల 256 మంది పురుషులు, లక్షా 94వేల 944 మంది స్త్రీలు ఉన్నారు. 68 మంది ట్రాన్స్‌జెండర్ల ఓట్లు ఉన్నాయి. అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరిలో లక్షా 31వేల 284 మంది ఓటర్లు ఉండగా.. అతి తక్కువగా నారాయణపేట్ జిల్లాలో 13 వేల 899 మంది ఓటర్లు ఉన్నారు.

మూడు ఉమ్మడి జిల్లాలకు కలిపి 799 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల బరిలో అధికంగా 93 మంది ఉండడంతో జంబో బ్యాలెట్‌ పేపర్‌తో పాటు జంబో బ్యాలెట్‌ బాక్స్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి రెండు బాల్టీ బాక్సుల చొప్పున 15 వందల 98 బ్యాలెట్ బాక్సులు, అదనంగా 324 బాక్సులను సిద్ధంగా ఉంచారు. వృద్ధులు, కరోనా అనుమానితులకు పోస్టల్‌ ఓటు వేసే వెసులుబాటు కల్పించారు. ‎ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల నిర్వహణలో మొత్తం 3 వేల 835 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories