
తెలంగాణ ఉద్యోగులకు బంపర్ ఆఫర్..15 రోజుల్లో కొత్త హెల్త్ స్కీమ్ ప్రారంభం
New Health Scheme : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ అదిరిపోయే హెల్త్ గిఫ్ట్ ఇచ్చింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త ఆరోగ్య పథకానికి ముహూర్తం ఖరారు చేసింది. కేవలం 15 రోజుల్లోనే ఈ సరికొత్త హెల్త్ స్కీమ్ పట్టాలెక్కబోతోంది. ఇకపై ఆసుపత్రి ఖర్చుల గురించి ఉద్యోగులు టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా, పక్కాగా క్యాష్ లెస్ చికిత్స అందేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. తెలంగాణ సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఈహెచ్ఎస్ పథకంలో ఉన్న ఇబ్బందులను తొలగించి, మరింత పారదర్శకంగా, వేగంగా వైద్యం అందేలా కొత్త విధివిధానాలను రూపొందించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 1.44 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారిపై ఆధారపడిన 12.84 లక్షల మంది కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరనుంది. అంటే దాదాపు 13 లక్షల మందికి పైగా వైద్య భరోసా లభించబోతోంది.
ఖర్చు ఎలా? వాటా ఎంత?
ఈ పథకం నిర్వహణ కోసం ప్రభుత్వం, ఉద్యోగులు సమానంగా నిధులు సమకూరుస్తారు. ఉద్యోగుల బేసిక్ సాలరీ నుంచి 1.5 శాతం మొత్తాన్ని హెల్త్ స్కీమ్ కోసం మినహాయిస్తారు. అంతే మొత్తాన్ని (1.5%) ప్రభుత్వం కూడా తన వంతుగా జమ చేస్తుంది. ప్రతి ఏటా ఉద్యోగుల నుంచి రూ. 523 కోట్లు, ప్రభుత్వం నుంచి రూ.523 కోట్లు.. వెరసి ఏటా రూ.1,046 కోట్లు ఈ ట్రస్ట్ నిధికి అందుతాయి. ఈ ట్రస్ట్‌లో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల నుంచి ఇద్దరు సభ్యులుగా ఉంటారు. ఒక ప్రభుత్వ అధికారిని దీనికి సీఈఓగా నియమిస్తారు.
ఎక్కడెక్కడ వర్తిస్తుంది?
ఈ పథకం కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా, అత్యవసర సమయాల్లో పక్క రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందేలా వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం 515 ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందేలా ఒప్పందాలు చేసుకున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు మోడల్ స్కూల్స్, గురుకులాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా, హెల్త్ కార్డు చూపించగానే చికిత్స ప్రారంభించేలా కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా గుడ్ న్యూస్
హెల్త్ స్కీమ్‌తో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల విషయంలోనూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా జీతాలు అందేవి, దీనివల్ల ఆలస్యం జరిగేది. ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వమే నేరుగా వారి ఖాతాల్లోకి జీతం జమ చేయాలని నిర్ణయించింది. అలాగే ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు పడుతుండటంతో ఉద్యోగ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. పెండింగ్‌లో ఉన్న డీఏలను కూడా విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




