ఎంజీఎం ఘటనపై ప్రభుత్వం సీరియస్.. పేషెంట్‌ను ఎలుకలు కొరకడంపై...

Telangana Govt Serious on Rats Biting in ICU MGM Hospital | Live News
x

ఎంజీఎం ఘటనపై ప్రభుత్వం సీరియస్.. పేషెంట్‌ను ఎలుకలు కొరకడంపై...

Highlights

Warangal - MGM Hospital: *ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాస రావుపై బదిలీ వేటు *నిర్లక్ష్యం వహించిన వైద్యుల సస్పెండ్

Warangal - MGM Hospital: వరంగల్ ఎంజీఎం ఘ‌ట‌న‌పై తెలంగాణ ప్రభుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంది. పేషెంట్ ను ఎలుకలు కొరికిన విష‌యం వెలుగులోకి వ‌చ్చిన వెంట‌నే వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు సీరియస్ గా స్పందించారు. ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు త‌క్ష‌ణం నివేదిక రూపంలో పంపించాల‌ని, రోగికి నాణ్య‌మైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ మేర‌కు నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. సూపరింటెండెంట్ ను‌ బదిలీ చేయడంతో పాటు ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేశారు

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న భీమారానికి చెందిన శ్రీనివాస్ అనే పేషెంట్ కాళ్లు, చేతులను ఎలుకలు కొరికాయి. దీంతో రోగికి తీవ్రంగా రక్తస్రావం జరిగింది. రోగి బంధువులు స్థానిక సిబ్బందికి చెప్పినా పట్టించుకోకపోవడంతో వారు మీడియాను ఆశ్రయించారు. ప్రస్తుతం రోగి శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తక్షణమే విచారణకు ఆదేశించారు.దీంతో వైద్యారోగ్య శాఖ అధికారులు, వివిధ విభాగాధిప‌తులు ఆర్ఐసీయు, ఆసుప‌త్రి ప్రాంగ‌ణం అంతా క్షుణ్ణంగా ప‌రిశీలించారు. ఘ‌ట‌న‌కు కార‌ణాల‌ను ఆరా తీసిన విచార‌ణ అధికారులు నివేదిక రూపొందించి ప్ర‌భుత్వానికి అందించారు. ఈ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ను బదిలీ చేయడంతో పాటు విధుల్లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించినందుకు గాను ఇద్ద‌రు వైద్యులను సస్పెండ్ చేసింది.

గతంలో ఎంజీఎం సూపరింటెండెంట్ గా ఉన్న చంద్రశేఖర్ కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉపేక్షించదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. మరోవైపు వరంగల్ అడిషనల్ కలెక్టర్ శ్రీవాత్సవ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చి రోగి బంధువులతో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఐసీయూలోకి ఎలుకలు ఎలా వచ్చాయనే విషయంపై అడిషనల్ కలెక్టర్ శ్రీవాత్సవ ఆరా తీశారు. ఆసుపత్రిలో శానిటేషన్ పనులు సరిగా చేయకపోవడం వల్లే ఎలుకలు వస్తున్నాయని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో ఆస్పత్రిలో డ్రైనేజీ, పారిశుధ్య పనులను మెరుగుపర్చాలని అధికారులను అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు. శానిటేషన్ ఏజన్సీ పై కూడా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories