Telangana: TSPSC ప్రక్షాళనపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్

Telangana Government Is Focusing On TSPSC
x

Telangana: TSPSC ప్రక్షాళనపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్

Highlights

Telangana: మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి

Telangana: TSPSC ప్రక్షాళనపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెంచింది. ఉద్యోగ నియామకాలను అత్యంత పారదర్శకంగా..పకడ్బందీగా నిర్వహించేలా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ పనితీరును మెరుగుపరిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అవసరమైన సంస్కరణలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఉద్యోగ నియామకాలు, ప్రవేశపరీక్షలు సమర్థంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పీఎస్సీల పనితీరుపై అధ్యయనం చేసి.. నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌‌ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని స్పష్టం చేశారు.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, సిట్‌ అధిపతి ఏఆర్‌ శ్రీనివాస్‌‌లతో సీఎం మంగళవారం సమీక్ష నిర్వహించారు. యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాలను పంపించి.. అక్కడ నియామక ప్రక్రియపై అధ్యయనం చేయాలన్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకంగా చేపట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.

సుప్రీంకోర్టు జారీ చేసిన నిబంధనల మేరకు కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల నియామకాలు ఉండేలా మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పారు. టీఎస్‌పీఎస్సీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, అదనపు సిబ్బంది, మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ప్రశ్నపత్రాల లీకేజీకి కారణాలు, కేసు ప్రస్తుత స్థితి గురించి పోలీస్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. లీకేజీపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సీఎంకు వారు వివరించారు. ఈ కేసులో ఇప్పటికే 108 మందిని అరెస్టు చేశామని తెలిపారు. న్యాయస్థానంలో మొదటి ఛార్జిషీట్‌ దాఖలు చేశామని, రెండో ఛార్జిషీట్‌ కోసం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదిక రావాల్సి ఉందని పేర్కొన్నారు. సిట్‌లోని అధికారులంతా ఎన్నికల కారణంగా బదిలీ అయ్యారని వివరించారు. ఇక టీఎస్‌పీఎస్సీ పరీక్షల తాజా పరిస్థితిపై కూడా సీఎం ఆరా తీశారు.

కమిషన్‌ ఇప్పటివరకు ఎన్ని నోటిఫికేషన్లు జారీ చేసింది? ఎన్ని నోటిఫికేషన్ల పరీక్షలు రద్దయ్యాయి? ఎన్ని పూర్తి చేశారు? ఫలితాలు విడుదల చేశారా? కోర్టు కేసులు ఏమున్నాయనే అంశాలను అడిగి తెలుసుకున్నారు.

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి సోమవారం గవర్నర్‌ కార్యాలయంలో తన రాజీనామా లేఖ అందజేశారు. మరోవైపు, సభ్యులు కూడా రాజీనామాలకు సిద్ధమయ్యారు. ప్రొఫెసర్‌ బండి లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, సుమిత్రా ఆనంద్‌ తనోబా, కారం రవీందర్‌రెడ్డి, ఆర్‌.సత్యనారాయణలు సీఎం రేవంత్‌రెడ్డిని మంగళవారం కలిసి ఈమేరకు సమాచారం ఇచ్చారు. ఈ అయిదుగురు సభ్యులు ఇవాళ గవర్నర్‌కు రాజీనామాలు సమర్పించే అవకాశాలున్నాయి. ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందితే.. కొత్త బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

అందుకు కొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. కొత్త బోర్డులో ఛైర్మన్‌తో పాటు 11 మంది సభ్యులు ఉండే అవకాశం ఉంది. బోర్డు ఏర్పాటయ్యాక ప్రభుత్వ విభాగాల నుంచి ఖాళీల ప్రతిపాదనలు తీసుకుని కొత్త నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories