Liquor Shops: మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. డిసెంబర్‌ 31కి కుమ్ముడే కుమ్ముడు.. అర్ధరాత్రి వరకు వైన్స్

Liquor Shops
x

Liquor Shops: మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. డిసెంబర్‌ 31కి కుమ్ముడే కుమ్ముడు.. అర్ధరాత్రి వరకు వైన్స్

Highlights

Liquor Shops: తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

Liquor Shops: తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2025కు వీడ్కోలు పలుకుతూ 2026లోకి అడుగుపెట్టే సందర్భంలో మద్యం విక్రయాల సమయాన్ని పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వేడుకల రద్దీని దృష్టిలో ఉంచుకుని, అదే సమయంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

సాధారణంగా రాత్రి 10 గంటలకే మూసివేసే వైన్ షాపులకు డిసెంబర్ 31న రాత్రి 12 గంటల వరకు విక్రయాలు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారు. బార్ అండ్ రెస్టారెంట్లు, క్లబ్‌లు, పర్యాటక ప్రాంతాల్లోని హోటళ్లకు అర్ధరాత్రి ఒంటి గంట (1 AM) వరకు మద్యం సరఫరా చేసేందుకు వీలు కల్పించారు. అలాగే అనుమతి పొందిన న్యూ ఇయర్ ఈవెంట్లకు కూడా అర్ధరాత్రి ఒంటి గంట వరకు సమయం కేటాయించారు.

వేడుకల పేరుతో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం హెచ్చరించింది. పబ్బులు, బార్లలో డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు ప్రత్యేక డాగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించారు. నిమిషాల్లోనే ఫలితాలు ఇచ్చే అత్యాధునిక డ్రగ్ టెస్టింగ్ కిట్‌లను పోలీసులు సిద్ధం చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో డిసెంబర్ 31 రాత్రి భారీ తనిఖీలు నిర్వహించనున్నారు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారులు ముందుగానే డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే డ్యూటీ పెయిడ్ కాని మద్యంపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. నాటుసారా, గంజాయి విక్రయాలపై స్పెషల్ టీమ్‌లు దాడులు నిర్వహించనున్నాయి.

నూతన సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా సాగేందుకు ప్రభుత్వం కొన్ని కీలక మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఈవెంట్లలో వినియోగించే సౌండ్ సిస్టమ్స్ నిర్ణీత డెసిబుల్స్ పరిమితికి లోబడి ఉండాలి. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ శబ్దాలతో సంగీతాన్ని ప్లే చేయకూడదని ఆదేశించింది. నివాస ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించే వారు పొరుగువారికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories