తెలంగాణలో అన్నదాతల అవస్థలు.. నిలువు దోపిడీ చేస్తున్న మిల్లర్లు...

Telangana Farmers Problems to Sell Paddy Crop No Price Support Millers Cheating | Live News
x

తెలంగాణలో అన్నదాతల అవస్థలు.. నిలువు దోపిడీ చేస్తున్న మిల్లర్లు...

Highlights

Telangana Farmers: తాలు, తేమ సాకుగా చూపి దోపిడీ మిల్లర్లంతా సిండికేట్‌గా మారి మోసం...

Telangana Farmers: అన్నదాత(Farmers) లను అన్ని వైపులా కష్టాలు ముంచెత్తుతున్నాయి. నాటు వేసిన నాటి నుంచి ధాన్యం కొనుగోలు వరకు రైతన్నలు నానా కష్టాలు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన కొనుగోళు కేంద్రాలు లేక ఇబ్బందులు పడుతుంటే.... మరోవైపు మిల్లర్లంతా ఓ సిండికేట్‌గా ఏర్పడి దగా చేస్తున్నారు. తాలు, తేమ అంటూ అతి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో మిల్లర్లంతా సిండికేట్‌‌గా ఏర్పడి రైతుల కష్టాన్ని అప్పనంగా దోచుకుంటున్న వైనంపై హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ...

తెలంగాణ(Telangana) లో రైతన్నలకు కష్టాలు తప్పడం లేదు. పండిన యాసంగి వరికి మద్దతు ధర లభించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పండిన వరి మొత్తంలో 30 శాతం ఒక్క ఉమ్మడి నల్లగొండ(Nalgonda) జిల్లాలోనే పండింది. ఉమ్మడి జిల్లాలో పదిన్నర లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా ఇందులో సగానికి పైగా సన్నాలు సాగు చేశారు. దీంతో పద్నాలుగున్నర లక్షలకు పైగా ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేసి కొనుగోలు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు.

ఏటా ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోతుంది. మిల్లర్లంతా ఓ సిండికేట్‌గా ఏర్పడి ధాన్యం ధర తగ్గించి తమను ముంచుతున్నారని రైతులు వాపోతున్నారు. ఈ సీజన్‌లోనూ అదే దందా కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లుకు తీసువచ్చిన ధాన్యం రంగు మారిందని, తాలు, తేమ వంటివి సాకులుగా చూపుతూ క్వింటాళుకు నాలుగైదు కిలోలు కోత పెట్టి మోసం చేస్తున్నారని వాపోతున్నారు.

యాసంగిలో ఎక్కువగా సాగు చేసిన సన్నాలను మిల్లుల వద్దకు తీసుకువెళ్లినా మిల్లర్లు పట్టించుకోవడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు చేసేదేమీ లేక రోజుల తరబడి ధాన్యం రాశి వద్దే పడిగాపులు కాస్తున్నారు. మిల్లు వరకు వెళ్లిన ధాన్యం వెనక్కి తెచ్చుకోలేక నాణ్యత సాకుతో మిల్లర్లు విధించే కోతకు ఒప్పుకొని అమ్ముకోక తప్పడం లేదని చెబుతున్నారు.

ఒక మిల్లు నుంచి మరో మిల్లుకు తీసుకెళ్లినా అదే సీన్ రిపీట్ అవుతుందని రైతన్నలు అంటున్నారు. మిల్లర్లు చెప్పిన ధరకే ధాన్యం తెగ నమ్ముకొని కంటి నిండ కన్నీరుతో వెనుదిరుగుతుమంటున్నారు. మొత్తానికి పండిన పంటకు మద్దతు ధర మాట అటుంచితే.... మిల్లర్ల దోపిడీతో రైతన్నలు మరింత కుంగిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories