Congress: 'సింగిరెడ్డి' ఇటు.. 'తోటకూర' అటు.. మరి కాంగ్రెస్ ఎటు..?

Telangana Congress That Does Not Care About Singireddy Harivardhan Reddy At All
x

Congress: 'సింగిరెడ్డి' ఇటు.. 'తోటకూర' అటు.. మరి కాంగ్రెస్ ఎటు..?

Highlights

Congress: ప్రచారం అవసరం లేదంటున్న తోటకూర అజయ్ యాదవ్

Congress: మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీగా గత ఎన్నికల్లో పోటీ చేసిన రేవంత్ రెడ్డి గెలుపు కోసం తోటకూర జంగయ్య యాదవ్, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పడరాని పాట్లు పడ్డారు. పోటా పోటీగా ప్రచారం చేసి రేవంత్ రెడ్డిని గెలిపించారు. అప్పటినుంచి మేడ్చల్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు, సమస్యల పోరాటానికి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కృషి చేశారు. టికెట్ నాకే వస్తుందనే ధీమాతో ప్రతిరోజు తిరుగుతూ మంత్రి చామకూర మల్లారెడ్డితో ఢీ అంటే ఢీ అంటూ పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపుతూ ఆ పార్టీకి రూపురేఖలు తీసుకొచ్చారు.

ఇదే సందర్భంలో తోటకూర జంగయ్య యాదవ్ బీసీ గళంతోపాటు రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశానని, టీ పీసీసీ చీఫ్‌కు నమ్మిన బంటునని చెప్పుకుంటూ... కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకే వస్తుందని ఆయన వర్గానికి చెప్పారు. ఇద్దరి నేతల మధ్య టికెట్ విషయంలో ఎటు తేల్చకుండా నాన్చుడు ధోరణి ప్రదర్శించింది కాంగ్రెస్ పార్టీ... ఇద్దరి మధ్య వైరాన్ని పెంచి.. వర్గ పోరుతో కొట్టుకున్న సందర్భాలు తీసుకొచ్చింది... చివరకు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డికి కాకుండా తోటకూర జంగయ్య యాదవ్‌కు టికెట్ కేటాయించడంతో ఒక్క సారిగా వర్గ పోరు భగ్గుమంది.

మేడ్చల్ నియోజకవర్గంపై మంచి పట్టు ఉన్నప్పటికీ సర్వేల్లో కూడా హరివర్ధన్ రెడ్డికే గెలుపు అవకాశాలు ఉన్నాయని ఎన్నో సందర్భాల్లో స్వయంగా సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి చెప్పినప్పటికీ... ఆయన మాటను ఏ మాత్రం పట్టించుకోకుండా చివరకు తోటకూర జంగయ్యకు టికెట్ కన్ఫర్మ్ చేశారు.

మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా తోటకూర జంగయ్య యాదవ్‌కు టికెట్ కన్ఫర్మ్ చేసి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డికి ఎలాంటి హామీ ఇవ్వకుండా.... కనీసం పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉండు... లేకుంటే లేదు... అనే తీరులో వదిలేశారు. జిల్లాకు చెందిన కొందరు పెద్దలు వచ్చి కొన్ని సందర్భాల్లో బుజ్జగించినప్పటికీ హామీ ఇవ్వకపోవడంతో అభ్యర్థి తోటకూర జంగయ్యకు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సహకరించడం లేదు... ప్రచారంలో పాల్గొనడం లేదు.

నియోజకవర్గంలో బలమైన శ్రేణులను ఏర్పాటు చేసుకున్న సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో పాల్గొనకపోవడంతో ఆయన వర్గం కూడా మౌనంగా ఉండిపోయారు. కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానం నుంచి కూడా ఎటువంటి దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడంతో హరివర్ధన్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటాడా...? లేదా...? అనేది ఉత్కంఠ నెలకొంది. తోటకూర జంగయ్య యాదవ్ కూడా హరి వర్ధన్ రెడ్డి పట్టు ఉన్న ప్రాంతాల్లో ఎలా పర్యటించాలి, ఆయనకు సంబంధించిన వర్గానికి ఎలా దగ్గర అవ్వాలి అనే సమాలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి టికెట్ తెచ్చుకున్న తోటకూర జంగయ్య యాదవ్ కుమారుడు ప్రస్తుత బోడుప్పల్ కార్పొరేటర్ తోటకూర అజయ్ యాదవ్ మరింత దూకుడు ప్రదర్శిస్తూ... ప్రచార కార్యక్రమంలో సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి వస్తే ఏంటి..? రాకుంటే ఏంటి...? అంటూ... వాళ్ల ప్రచారం అవసరం లేదని అంటున్నాడని ఆరోపణలు గుప్పుమన్నాయి.. ఈ విషయం టీ పీసీసీ చీఫ్ రేవంత్‌కు తెలియడంతో కార్పొరేటర్ అజయ్ యాదవ్ మాట తీరుపై గుస్సా అయినట్టు తెలిసింది.

ఇదే విధానాన్ని, మాట తీరును కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్టు సమాచారం. పార్టీలో టికెట్ వచ్చిన వాళ్లు టికెట్ రానివాళ్లతో కలుపుకొని పనిచేసుకోవాలని హెచ్చరించారని తెలుస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో బహిరంగ చర్చలు కూడా జరిపారు. టికెట్ వచ్చిన అభ్యర్థి నుంచి టికెట్ రాని అభ్యర్థికి కూడా ఏమాత్రం సాయోధ్య కుదరలేదని వైరం ఇంకా కొనసాగుతోందని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో స్పష్టంగా అర్థమయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories