నవంబర్‌ 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ : సీఎం కేసీఆర్‌

నవంబర్‌ 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ : సీఎం కేసీఆర్‌
x
Highlights

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఈ నెల 23 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఈ నెల 23 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్ ప్రారంభమైన నేపథ్యంలో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ను లాంచ్‌ చేస్తారని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.

ప్రగతిభవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఉన్నతాధికారులతో చర్చించిన సీఎం కేసీఆర్‌.. ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆదరణ పొందుతోందని.. అద్భుతమైన ప్రతిస్పందన వస్తోందని అన్నారు. భూ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో మరొక చారిత్రక శకం ఆరంభమైనట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని వెల్లడించారు. ధరణి ద్వారా వారి వ్యవసాయ భూములకు భరోసా దొరికిందనే సంతృప్తిని, నిశ్చింతను ప్రజలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు కేసీఆర్.

ధరణి పోర్టల్ చిన్న చిన్న సమస్యలను అధిగమించిందని.. మరో మూడు నాలుగు రోజుల్లో నూటికి నూరుశాతం అన్ని రకాల సమస్యలను అధిగమించనున్నదని స్పష్టం చేశారు. సమస్యలన్నీ పరిష్కరించాకే వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలనుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. అందుకే కొన్ని రోజులు వేచి చూశామని.. నవంబర్ 23 సోమవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభిస్తారని వెల్లడించారు. ధరణి పోర్టల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దిన అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories