BRS: భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన టీఆర్ఎస్..

Telangana CM KCR to Announce Name of National Party on Today
x

BRS: భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన టీఆర్ఎస్..

Highlights

BRS: దేశ, రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలకఘట్టం ఆవిష్కృతం కానుంది.

BRS: దేశ, రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలకఘట్టం ఆవిష్కృతం కానుంది. ఉద్యమ పార్టీగా వచ్చిన టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో విస్తరించబోతుంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ కీలక ప్రకటన చేయనున్నారు. విజయదశమి పండగ రోజున భారత రాజకీయాల్లోకి కొత్త పార్టీతో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్. ఇప్పటికే పలువురితో సంప్రదింపులు జరిపిన కేసీఆర్ పక్క రాష్ట్రమైన ఏపీ నేతలతోనూ టచ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇతర పార్టీల నుంచి వలసలు ఉంటాయనే వార్తలు వస్తున్నాయి. ఇక కేసీఆర్ జాతీయ పార్టీపై పలు పక్షాలు స్వాగతిస్తే మరికొన్ని పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ఇవాళ ఉదయం 11 గంటలకు పార్టీ జనరల్‌‌ బాడీ సమావేశం ప్రారంభమవుతుంది. 2001లో టీఆర్‌‌ఎస్‌‌ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక ఘట్టాలు, నిరాహార దీక్ష, కేంద్ర ప్రభుత్వ ప్రకటన, సీమాంధ్ర నాయకుల కుట్రలతో కేంద్రం వెనక్కి తగ్గడం చివరికి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ముఖ్య అంశాలపై కేసీఆర్ ప్రసంగిస్తారు. అనంతరం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో విదేశాల్లో దేశం ప్రతిష్ట ఎలా మసకబారుతున్నది.. దేశంలోని వనరుల సద్వినియోగంలో దేశాన్ని పాలించిన వాళ్లు ఎలా విఫలమయ్యారు, టీఆర్‌‌ఎస్‌‌ను ఎందుకు బీఆర్‌‌ఎస్‌‌గా మార్చబోతున్నాం అనే వాటిపైనా కేసీఆర్‌‌ మాట్లాడుతారు. తర్వాత టీఆర్‌‌ఎస్‌‌ పేరును బీఆర్‌‌ఎస్‌‌గా మార్చుతూ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌ రెడ్డి తీర్మానం ప్రవేశపెడుతారు. దానికి సభ్యులు ఆమోదం తెలిపాక సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంట 19 నిమిషాలకు కేసీఆర్‌‌ జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తారు.

టీఆర్‌ఎస్‌ పేరును BRSగా మారుస్తూ నేడు తీర్మానం చేయనున్నారు. మరోవైపు సమావేశంలో మునుగోడు అభ్యర్థిని కూడా సీఎం కేసీఆర్‌ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. BRS పేరు మీదే మునుగోడు ఉప ఎన్నిక బరిలో దిగే అవకాశం ఉంది. నామినేషన్‌, చండూరు సభ తేదీలను కూడా గులాబీ బాస్ ఖరారు చేయనున్నట్లు సమాచారం. మునుగోడులో గెలిచి జాతీయ పార్టీగా తొలి విజయాన్ని ఖాతాలో వేసకోవాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారు. నామినేషన్‌ వేసే నాటికే BRS రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందని నేతలకు ఇప్పటికే కేసీఆర్‌ చెప్పినట్లు టాక్.

ఇక ఇవాళ జరిగే సమావేశంపై పార్టీ శ్రేణుల్లో, ప్రజల్లో ఆసక్తినెలకొన్నది. హైదరాబాద్‌ జిల్లా TRS నేతలు, GHMC పరిధిలోని ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు తమ అధినేత చేసే ప్రకటన అనంతరం సంబురాలు చేసుకొనేందుకు సమాయత్తం అవుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories