Top
logo

రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి మేము సిద్ధమే : సీఎం కేసీఆర్

రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి మేము సిద్ధమే : సీఎం కేసీఆర్
X
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదిపై ఇష్టానుసారం చేప‌ట్టిన‌ పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టుల నిర్మాణాలను ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదిపై ఇష్టానుసారం చేప‌ట్టిన‌ పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టుల నిర్మాణాలను చేపడుతూ పద్దతులను మార్చుకోకుండా ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుండా ఉంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్ - పెద్ద మరూర్ వద్ద బ్యారేజీ నిర్మిస్తుందని, దాంతో రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని రాష్ర్ట‌ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం ప్రగతి భవన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సిఎం కేసీఆర్ పాల్గొన్నారు. రెండు గంటలపాటు కొనసాగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణకున్న న్యాయమైన హక్కులు, వాటాల గురించి సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ నీటివాటాను కొల్లగొట్టాలని చూస్తే తమ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తామూ సిద్ధమేనని సీఎం ప్రకటించారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తే ఇకనుంచి కుదరదన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోల్పోయిన సాగునీటిని ప్రత్యేక రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుగా పొంది తీరుతామని సీఎం స్పష్టం చేశారు. ఆయకట్టు లేకుండా, నీటి కేటాయింపులు లేకుండా శ్రీశైలానికి గండిపెడుతూ నిర్మితమవుతున్న పోతిరెడ్డిపాడు కెనాల్ ను ఉద్యమకాలం నుంచే తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తున్నదన్నారు. భారత యూనియన్ లో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి అంతర్ రాష్ట్ర నదీజలాల్లో న్యాయమైనవాటాను పొందే హక్కు ఉంద‌న్నారు. నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయం ఫలితమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మొదట్లోనే అంటే 2014 జులై 14న, అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956-సెక్షన్ 3 కింద ఫిర్యాదుల స్వీకరణకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి లేఖ రాశామని ఆయన స్పష్టం చేసారు. లేఖకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఒక సంవత్సరం వేచిచూసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన నదీ జలాల వివరాలను సోదాహరణంగా కేంద్రానికి వివరించి తమకు జరుగుతున్న అన్యాయాన్ని తక్షణమే పరిష్కరించాలని సీఎం కేసీఆర్ డిమాండు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 89 కింద కృష్ణా నదీ జలాల వివాద ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడిటి-2)కు 'టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్' ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అలా ఏర్పాటు చేస్తే ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు జరపాలని సీఎం కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి స్మితాబర్వాల్, నీటిపారుదల శాఖ సలహాదారు ఎస్కే జోషీ , ప్రిన్సిపల్ సెక్రటరీ రజిత్ కుమార్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, ఈఎన్సీ మురళీధర్ రావు, నాగేందర్ రావు, నల్లా వెంకటేశ్వర్లు, బి. హరిరాం, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Web TitleTelangana cm kcr in Apex Council Meeting
Next Story