ఏపీ తెలంగాణ మధ్య జల జగడం.. జగన్ సర్కార్ తీరుపై కేసీఆర్ సీరియస్!

ఏపీ తెలంగాణ మధ్య జల జగడం.. జగన్ సర్కార్ తీరుపై కేసీఆర్ సీరియస్!
x
KCR, YS Jagan (File Photo)
Highlights

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి నీటి యుద్ధం మొదలైంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి నీటి యుద్ధం మొదలైంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విభజన చట్టానికి విరుద్ధమని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఏపీ చేసిన తప్పిదాలుగా కేసిఆర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెంటనే కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేయాలని కేసిఆర్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని ధోరణి అవలంభిస్తామని తేల్చి చెప్పారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

మంత్రులు ఈటల రాజేంద్ర, మహమూద్ అలీ, శ్రీనివాస గౌడ్, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, నీటి పారుదల సలహాదారు ఎస్.కె.జోషి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఇఎన్సి మురళీధర్, ఎజి బి.ఎస్. ప్రసాద్, అడిషనల్ ఎజి రాంచందర్ రావు, లీగల్ కన్సల్టెంట్ రవీందర్ రావు, రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాం ప్రసాద్ రెడ్డి పలువురు అధికారులు హాజరైయ్యారు.

ఈ సమావేశంలో ఏపీ సర్కార్ తలపెట్టిన కొత్త ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరం కాబట్టి, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. గతంలో ఉన్న వివాదాలను, విబేధాలను పక్కన పెట్టి రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కి స్నేహహస్తం అందించింది.

బేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని నేనే చొరవ చూపించాను. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా శ్రీశైలంలో నీటిని లిఫ్టు చేయడానికి ఏకపక్షంగా కొత్త పథకం ప్రకటించడం అత్యంత బాధాకరం. పరస్పర సహకారంతో నీటిని వాడుకుందామనే స్పూర్తికి ఇది విఘాతం కలిగించింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే రాజీ పడే ప్రసక్తే లేదు. ఏపి తలపెట్టిన కొత్త ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరడమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories