గవర్నర్‌ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి టీఎస్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

గవర్నర్‌ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి టీఎస్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
x
Highlights

* గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్‌కు అవకాశం * గవర్నర్ ఆమోదానికి పంపిన రాష్ట్ర కేబినెట్‌

తెలంగాణ మండలిలోకి కొత్త ఎమ్మెల్సీలు అడుగు పెట్టబోతున్నారు. సామాజిక వర్గాల సమీకరణంతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ కేబినెట్‌.. పార్టీలో, ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురిని గవర్నర్ కోటాలో ఎంపిక చేసింది. అభ్యర్థుల పేర్లను గవర్నర్‌ ఆమోదానికి పంపగా.. ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

గవర్నర్‌ కోటాలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలను రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేసింది. గతంలో దివంగత నాయిని నర్సింహారెడ్డి, కర్నె ప్రభాకర్, రాములు నాయక్ లు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు గా ప్రాతినిధ్యం వహించారు. ఆ స్థానాలు ఖాళీ కావడంతో తెలంగాణ ప్రభుత్వం మరో ముగ్గురికి అవకాశం కల్పించింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ కవి గోరటి వెంకన్న, బీసీ రజక సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, వైశ్య సామాజిక వర్గం నుంచి బొగ్గారపు దయానంద్‌ గుప్తాను మంత్రివర్గం ఎంపిక చేసింది. గత కొద్ది కాలంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు గా, రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణి దేవి పేర్లు వినిపించిన సీఎం కేసీఆర్ కొత్త వారికే పదవులు కట్టబెట్టారు.

నాగర్ కర్నూలు జిల్లా గౌరారం గ్రామానికి చెందిన గోరటి వెంకన్న ఉస్మానియా యూనివర్సిటీలో దూరవిద్య విధానం ద్వారా ఎంఏ తెలుగు చదివారు. రేల పూతలు, అలసేంద్ర వంక, పూసిన పున్నమి, వల్లంకితలం తదితర పుస్తకాలను రాశారు. ప్రజా వాగ్గేయకారుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తన పాటల ద్వారా ప్రజలను కదిలించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. రాష్ట్ర ప్రభుత్వం 2016లో ప్రతిష్టాత్మక కాళోజీ అవార్డుతో గోరటి వెంకన్నను సత్కరించింది. గవర్నర్ కోటాలో కళాకారులకు అవకాశం కల్పించడానికి సీఎం కేసీఆర్ గోరేటి వెంకన్న కు అవకాశం కల్పించారు

వరంగల్​ జిల్లాకు చెందిన బస్వరాజు సారయ్య మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. 2012 నుంచి 2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఐటీఐ చదివిన బస్వరాజు విద్యార్థి నాయకుడిగా చేశారు. మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు చెందిన సారయ్య కు అవకాశం కల్పించడం ద్వారా ఆయా వర్గాల్లో టిఆర్ఎస్ పట్ల సానుకూల వైఖరి కల్పించినట్లు భావించి సీఎం సారయ్యను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కలిసివస్తుందని భావిస్తున్నారు. మరోవైపు టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పట్నుంచే పార్టీ జనరల్ సెక్రటరీగా అధిష్టానం అప్పగించిన పనులన్నీ చేసిన నేతగా సారయ్యకు మంచి పేరుంది. సీఎంకు ధన్యవాదాలు తెలిపిన సారయ్య.. ఏంబీసీల అభ్యున్నతి కోసం పాటుపడతానన్నారు.

ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ గుప్తా ప్రభుత్వ ప్రొటోకాల్ విభాగం ఉన్నత స్థాయి అధికారి గా పనిచేసే 2003లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన బొగ్గారపు దయానంద్ గుప్తా 2014లో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ కొత్తపేటకు చెందిన బొగ్గారపు దయానంద్ గుప్తా బీఎస్సీ చదివారు. వైశ్య కులానికి చెందిన దయానంద్ గుప్త కు నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కలిసి వస్తుందని భావిస్తున్నారు. వాసవీ సేవా కేంద్రం ద్వారా ఆ వర్గంలో మంచి పట్టున్న నేతగా టిఆర్ఎస్ గుర్తించే అవకాశం కల్పించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories