Telangana : ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

Telangana Budget Meetings From February 3
x

Telangana : ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

Highlights

TS Budget: 2023-24 బడ్జెట్‌పై భారీ అంచనాలు

TS Budget: తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారీ బడ్జెట్‌కు రంగం సిద్ధం చేసింది. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించేందుకు అనువైన, ప్రజల మెప్పు పొందే సంక్షేమ పథకాలు, అభివృద్ది అంశాలకు పెద్ద పీట వేస్తూ పద్దుల రూపకల్పన చేసింది. ఆర్థికశాఖతో పలు దఫాలుగా సమీక్షల అనంతరం సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఈ వార్షిక సంవత్సరానికి 3 లక్షల కోట్ల బడ్జెట్ దాదాపు ఖరారు అయ్యింది. ఇందులో దళితుల, బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయబోతున్నట్లు తెలుస్తోంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఫిబ్రవరి 3న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. మరుసటి రోజు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. సీఎం కేసీఆర్ సూచనల మేరకు మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను రూపొందించినట్టు సమాచారం. ఇందులో దళితుల అభ్యున్నతికి తొలి ప్రాధాన్యతగా, బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీటవేయనుంది. వ్యవసాయ తోడ్పాటు, మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌ను ఊతంగా చేసుకోనుంది. రాష్ట్రంలోని అత్యధిక కుటుంబాలకు ప్రభుత్వ పథకాలతో చేరువయ్యేలా సరికొత్త రీతిలో 2023-24 బడ్జెట్‌కు రూపకల్పన జరుగుతోంది. 2014-15లో తెలంగాణ తొలి బడ్జెట్‌ 2014 నవంబర్‌ 5న 10 నెలల కాలానికి లక్షా 6వందల 48 కోట్లుగా ప్రతిపాదించగా, 8 ఏళ్ల తర్వాత ఈ బడ్జెట్‌ మూడింతలకు పైగా పెరగనుంది.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. స్టేట్ ఓన్ రెవిన్యూ టాక్స్‌తో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ముందుకు సాగుతోంది సర్కార్. కేంద్ర బడ్జెట్‌తో ఎంత మేరకు సాయమందనుందో ఫిబ్రవరి 1న స్పష్టం కానుంది. కేంద్రంపై ఆశలు పెట్టు కోకుండానే, కేంద్ర బడ్జెట్‌తో సంబంధం లేకుండానే తెలంగాణ రాష్ట్రం వార్షిక బడ్జెట్‌‌కు సిద్దమవుతోంది. దేశంలోనే GSDP వాటాలో రెండో స్థానం సాధించిన తెలంగాణ.. 8శాతం సొంత పన్నుల ఆదాయం వాటాతో కేంద్ర ఆర్ధిక ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తోంది. 2019-20లో 69శాతం, 2020-21లో 72శాతం, 2021-22లో 73శాతం సొంత వనరుల రాబడి నుంచే ప్రభుత్వం వ్యయాలు చేసి సొంత కాళ్లపై నిల్చింది. ఇక కేంద్రం నుంచి 2014-15లో పన్నుల వాటా 8వేల 189కోట్లు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ల రూపంలో 6వేల 736కోట్లు, 2022-23లో కేంద్ర పన్నుల వాటా 18వేల కోట్ల అంచనాల్లో 12వేల 407 కోట్లకు సవరించారు. నవంబర్‌ నాటికి 7వేల 568 కోట్లే ఖజానాకు చేరాయి. గ్రాంట్లు 8వేల 619కోట్లు మాత్రమే వచ్చాయి. గతంకంటే ఈ రెండు భారీగా తగ్గుదల నమోదయ్యాయి. అప్పుల్లో 19 వేల కోట్లు కోతలు విధించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాదిలో కేంద్రం నుంచి 59వేల కోట్ల అంచనాల్లో 24వేలకోట్లే వాస్తవంలో తెలంగాణకు దక్కనున్నాయి.

ఈ నేపథ్యంలో హ్యాట్రిక్‌ విజయానికి ఈ బడ్జెట్‌ కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రెండేళ్లుగా ఆర్ధిక ఒడిదుడుకులు ఎదురవుతున్నప్పటికీ ప్రభుత్వం పెద్దగా పన్నుల పెంపు జోలికి వెళ్లలేదు. ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ప్రత్యామ్నాయ ఆదాయాలపై దృష్టి పెట్టి వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తోంది సర్కార్. పరిశ్రమలు, గృహ వినియోగానికి కోతలు లేని నిరంతర కరెంట్‌ సరఫరాతో సమాజానికి మేలు జరుగుతోంది. గృహ వినియోగదారుల్లో 70శాతానికి పైగా గణనీయమైన సంఖ్యలో రైతులే ఉన్నారు. ఈ బడ్జెట్‌తో కూడా ప్రజలపై పన్నుల పెంపునకు సిద్దంగా లేదు. ఇక పథకాలను తగ్గించేందుకు కూడా ససేమిరా అంటోది. భూముల అమ్మకాలను వేగవంతం చేయాలని భావించినా అది కూడా ఈ ఏడాది మార్చి చివరినాటికి ఆశించిన స్థాయిలో విజయవంతం అయ్యే పరిస్థితి కనిపించడంలేదు. 2022-23లో రాష్ట్రాలకు కీలక సొంత వనరుల రాబడి వనరుల్లో SGST 23శాతం, అమ్మకం పన్ను 23 శాతం, ఎక్సైజ్‌ సుంకాలు 14శాతం, వాహన పన్నులు 5శాతం, ఎలక్ట్రిసిటీ పన్నులు, సుంకాల వాటా 3శాతంగా ఉంది. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల రాబడి గతేడాది ఇదే సమయంకంటే 16శాతం వృద్ధిరేటును సాకారం చేసుకుంది తెలంగాణ.

కొత్తగా సొంత ఇంటి జాగా కలిగిన వారికి 3 లక్షలు రూపాయల స్కీములు అందుబాటులోకి తేవడంతో పాటు బీసీలకు పెద్దపీట వేసేందుకు సర్కార్ వ్యూహ రచన చేసింది. ఇదిలా ఉంటే గిరిజన బంధుకు మాత్రం ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించే పరిస్థితి లేదు. ఇక ప్రణాళికేతర వ్యయాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలని చూస్తోంది ప్రభుత్వం. ప్రణాళికేతర వ్యయాల్లో భారీగా ఉద్యోగులు వేతనాలు, ఫించన్లు, పీఆర్సీ పరిహారాలు వంటివి ఉన్నాయి. ప్రతీనెలా దాదాపు వివిధ మార్గాల్లో 10వేల కోట్ల రాబడి ఉంటే.. ఖర్చు 12వేల కోట్లుగా ఉంటోంది అని ఆర్థిక శాఖ చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర బడ్జెట్ తర్వాత రాష్ట్ర బడ్జెట్‌ను సర్దుబాట్లు చేసి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది తెలంగాణ సర్కార్.

Show Full Article
Print Article
Next Story
More Stories