Assembly Staff tested for covid positive : తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం

Assembly Staff tested for covid positive : తెలంగాణ అసెంబ్లీ మొదలైన రోజుల్లో కరోనా వైరస్ కలవరం పుట్టిస్తోంది....
Assembly Staff tested for covid positive : తెలంగాణ అసెంబ్లీ మొదలైన రోజుల్లో కరోనా వైరస్ కలవరం పుట్టిస్తోంది. సభ ప్రారంభానికి ముందే ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి అందులో నెగిటివ్ రిపోర్టు వచ్చిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అసెంబ్లీ నిర్వహణ సందర్భంగా కరోనా విషయంలో స్పీకర్, ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. ప్రజాప్రతినిధులతో పాటు అసెంబ్లీలో విధులు నిర్వహించే సిబ్బంది ఇలా ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, రిపోర్టుల్లో నెగిటివ్ అని తేలితేనే అసెంబ్లీలోకి అనుమతి ఇస్తామని స్పీకర్ తేల్చి చెప్పారు. ఇంతటి జాగ్రత్తలు పాటించినప్పటికీ అసెంబ్లీలో ఉన్నట్టుండి కరోనా కలకలం రేగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అసెంబ్లీలో పనిచేసే వ్యక్తికి సోమవారం కొన్ని కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన మరోసారి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నట్లు తెలిసింది. దీంతో అతనికి కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయం బయటపడింది. విషయం తెలిసిన వెంటనే అతను ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలపడంతో ఆ ఉద్యోగి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌కు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అనే అంశంపై చర్చ మొదలైంది. ఇక పోతే అసెంబ్లీలో కీలక విధులను నిర్వహించే ఉద్యోగికి వైరస్ సోకడంతో సభ్యులందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కరోనా సోకిన వ్యక్తి అసెంబ్లీలోనికి పాసులు జారీ చేసే ఉద్యోగి కావడం, ఆయన ఇప్పటికే మీడియా సిబ్బంది, అలాగే అసెంబ్లీలో పనిచేసే ఇతరులకు, వందల సంఖ్యలో పాసులు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో ఆ పాసులను తీసుకున్న వ్యక్తులు, ప్రజాప్రతినిధులు పీఏల్లో ఆందోళన నెలకొంది.