జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ అధికారపక్షం: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం, వాయిదా

Telangana Assembly Adjourns Over Jagadish Reddy Comments
x

జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ అధికారపక్షం: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం, వాయిదా

Highlights

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో గురువారం గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేశారు.

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో గురువారం గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేశారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఇవాళ ఉదయం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఆ తర్వాత ఈ చర్చలో బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి , బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చర్చలో పాల్గొన్నారు. ఈ సమయంలో రైతుల గురించి, గొర్రెల పెంపకందారుల గురించి ప్రస్తావించారు. రైతుల గురించి మాట్లాడితే ఎందుకు ఇబ్బంది పడుతున్నారని జగదీశ్ రెడ్డి అధికారపక్షాన్ని ప్రశ్నించారు.

ఈ సమయంలో అధికారపక్షం తరపున మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. దళితులకు సీఎం పదవి, మూడు ఎకరాల భూమి ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా బీఆర్ఎస్ కొనుగోలు చేసిందని ఆయన విమర్శించారు. తప్పుడు హామీలతో కేసీఆర్ రెండుసార్లు అధికారంలోకి వచ్చారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. అదే సమయంలో జగదీశ్ రెడ్డిని మాట్లాడాలని స్పీకర్ కోరారు.

అదే సమయంలో జగదీశ్ రెడ్డిని మాట్లాడాలని స్పీకర్ కోరారు.అయితే ఈ సమయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జోక్యం చేసుకున్నారు. సంప్రదాయాల ప్రకారం సభ నడవాలని కోరారు. తమ సభ్యుడు జగదీశ్ రెడ్డి మాట్లాడే సమయంలో మంత్రులు, అధికారపక్ష సభ్యులు జోక్యం చేసుకోవడాన్ని ఆయన ప్రశ్నించారు. తమ సభ్యుడు లేవనెత్తిన అంశాలపై మంత్రులు రిప్లై ఇవ్వాలని ఆయన సూచించారు. తమ రెస్క్యూకు రావాలని ఆయన స్పీకర్ ను కోరారు. గవర్నర్ ప్రసంగంపైనే మాట్లాడాలని స్పీకర్ ప్రసాద్ కోరారు.

అధికారపక్షం తరపున మాట్లాడిన సభ్యులు గవర్నర్ ప్రసంగంపైనే మాట్లాడారా అని తలసాని శ్రీనివాస్ యాదవ్ అని తన స్థానంలో కూర్చొన్నారు. గవర్నర్ ప్రసంగంపైనే మాట్లాడాలని సూచిస్తూ జగదీశ్ రెడ్డిని మాట్లాడాలని స్పీకర్ కోరారు. ఆ సమయంలో ప్రసంగించేందుకు లేచిన జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ మీ వ్యాఖ్యలపై కూడా తాను స్పందిస్తానని జగదీశ్ రెడ్డి అన్నారు.ప్రజలంతా అసెంబ్లీలో ఏం జరుగుతోందో చూస్తున్నారు... గవర్నర్ ప్రసంగం నుంచి తాను పక్కకు వెళ్లానా.. ఎవరు వెళ్లారో తేల్చితే సభలో ఉండాలంటే లేకపోతే వెళ్లిపోతానని జగదీశ్ రెడ్డి ఆవేశంగా అన్నారు.

ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకున్నారు. జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు స్పీకర్ ను బెదిరించేలా ఉన్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. గవర్నర్ ప్రసంగానికి సంబంధం లేని అంశాలపై జగదీశ్ రెడ్డి మాట్లాడితేనే ఆదిశ్రీనివాస్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారని శ్రీధర్ బాబు అన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేయలేదో... తాము ఏం చేశామో తమ సభ్యులు చెప్పారన్నారు. బీఆర్ఎస్ చేయలేని పనులను ఏడాదిలో చేసి చూపించామని మంత్రి అన్నారు. తమ ప్రభుత్వం తప్పుదారిపడితే తమను సరిచేయాలని ఆయన కోరారు. ఈ సమయంలో జగదీశ్ రెడ్డిని మాట్లాడాలని మరోసారి స్పీకర్ కోరుతూ అసహానానికి గురి కావద్దన్నారు. సహనంతో మాట్లాడాలని స్పీకర్ సూచించారు. సభ సంప్రదాయాలను కాపాడాలని కోరారు. ఈ సమయంలో ఏ సభ, సంప్రదాయానికి విరుద్దంగా తాను ఏం మాట్లాడానో చెప్పాలని జగదీశ్ రెడ్డి స్పీకర్ ను కోరారు.

తనను ప్రశ్నించడమే సభ సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరించడమేనని స్పీకర్ ప్రసాద్ జగదీశ్ రెడ్డితో అన్నారు. ఆ సమయంలో జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ ఈ సభ అందరిది.. అందరికి సమానమైన హక్కులున్నాయన్నారు. తమ అందరి తరపున మీరు పెద్దమనిషిగా అక్కడ కూర్చొన్నారు... ఈ సభ మీ స్వంతం కూడా కాదు అంటూ జగదీశ్ రెడ్డి అనగానే అధికార పక్ష సభ్యులు తమ తమ స్థానాల్లో లేచి నిలబడి అభ్యంతరం తెలిపారు. ఈ సమయంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుంటూ జగదీశ్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాటను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ను దూషించినందుకు క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. వెంటనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడారు. జగదీశ్ రెడ్డి మాట్లాడిన మాటల్లో తప్పు ఏముందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకో, ప్రభుత్వానిదో సభ కాదన్నారు.

ప్రతిపక్షాలకు కూడా సమాన హక్కులున్నాయని జగదీశ్ రెడ్డి అన్నారని హరీశ్ రావు చెప్పారు. ఈ సమయంలో మాట్లాడాలని స్పీకర్ జగదీశ్ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చారు. అయితే అధికారపక్ష సభ్యులను కూర్చోపెట్టి తనకు అవకాశం ఇవ్వాలని జగదీశ్ రెడ్డి కోరారు. సభను ఆర్డర్ లో పెట్టి తనకు మైక్ ఇవ్వాలని జగదీశ్ రెడ్డి కోరారు. సభను ఆర్డర్ లో పెట్టాలి..సభా సంప్రదాయాలు తేలాలి.. స్పీకర్ అధికారాలు తేలాలి...సభ్యుల హక్కులు ఏంటో తేలాలి.. అన్ని తేలిన తర్వాతే తాను మాట్లాడుతానని జగదీశ్ రెడ్డి అన్నారు. ఈ సమయంలో అధికారపక్ష సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడారు. దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ ను కించపర్చినందుకు జగదీశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని కోరారు. అధికారపక్ష సభ్యులు జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. ఈ సమయంలో అసెంబ్లీలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో సభను 15 నిమిషాలపాటు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రసాద్ ప్రకటించారు

Show Full Article
Print Article
Next Story
More Stories