Teacher And Student: ఒకే స్టేషన్‌లో గురు శిష్యులకు కొలువులు..

Teacher And Student Working in Same Police Station
x

ఒకే స్టేషన్‌లో గురు శిష్యులకు కొలువులు.. 

Highlights

వికారాబాద్ జిల్లా పరిగి మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన ప్రభావత్ లాల్యానాయక్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి నాలుగో తరగతిలో పరిగిలోని ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించడంతో అక్కడే ఉంటూ ఇంటర్ పూర్తి చేశారు.

Teacher And Student Working in Same Police Station : ఓ స్టేషన్‌‌కు‌ జబీనా‌బేగం ఎస్సైగా వెళ్లారు. అదే స్టేషన్‌లో లాల్యానాయక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఇంతకీ ఇందులో ఏముంది అనుకుంటున్నారా. ఇక్కడ ఓ ప్రత్యేకత ఉంది. వీరిద్దరూ గురుశిష్యులు. గురువు పనిచేస్తున్న అదే స్టేషన్‌కి జబీనాబేగం ఎస్సైగా వెళ్లారు. గురువు అంటే స్కూల్లోనే, కాలేజీలోనో ఉండాలి కదా.. మరి కానిస్టేబుల్‌గా స్టేషన్‌లో పనిచేయడం ఏంటి అనుకుంటున్నారా..? ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం.

వికారాబాద్ జిల్లా పరిగి మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన ప్రభావత్ లాల్యానాయక్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి నాలుగో తరగతిలో పరిగిలోని ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించడంతో అక్కడే ఉంటూ ఇంటర్ పూర్తి చేశారు. తర్వాత పాల్వంచలో డిగ్రీ పూర్తి చేసిన లాల్యానాయక్.. ఎంఏ, బీఎడ్ పూర్తి చేసి పరిగిలోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా చేరారు. కొవిడ్ సమయంలో కాలేజీ మూతపడడంతో ఉపాధి కోల్పోయారు. అయితే ప్రైవేట్ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు ఊడుతాయో తెలియదు. అందుకే ఎలాగైనా జాబ్ కొట్టాలని భావించారు. పట్టుదలతో చదువుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. 2020లో కానిస్టేబుల్‌ ఎంపికయ్యారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

అయితే లాల్యానాయక్ లెక్చరర్‌గా పనిచేస్తున్న సమయంలో అదే జిల్లాలోని మక్తా వెంకటాపూర్ గ్రామానికి చెందిన జబీనాబేగం ఇంటర్‌లో చేరారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన జబీనాబేగం చదువులో చురుగా ఉండడంతో లాల్యానాయక్ ఆమెను ఎంకరేజ్ చేశారు. ఇంటర్ రెండవ సంవత్సరంలో ఆమెకు తల్లితండ్రులు వివాహం జరిపించేందుకు ప్రయత్నాలు చేయడంతో.. వారితో మాట్లాడి రద్దు చేయించారు. ఆ తర్వాత ఇంటర్, డిగ్రీ చదివే వరకు అండగా నిలిచారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తన వంతు సహాయం చేశారు. గురువు లాల్యానాయక్ ప్రోత్సాహాంతో పాటు తన స్వయం కృషిని జోడించిన జబీనాబేగం 2024లో ఎస్సై పరీక్షల్లో అర్హత సాధించారు.

ఏడాది పూర్తి చేసుకుని ఎస్సైగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోస్టింగ్ పొందారు. ఏ గురువుకైనా తన శిష్యులు ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకుంటారు. అలాంటి శిష్యురాలు తాను పనిచేసే స్టేషన్‌కే ఎస్సైగా వస్తే ఆ గురువు ఆనందానికి అవధులు ఉండవు. తన శిష్యురాలు బుధవారం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించేందుకు వస్తున్నట్టు తెలుసుకున్న లాల్యానాయక్.. జబీనాబేగంకు సెల్యూట్ చేసి స్వాగతం పలికారు.

నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన లాల్యానాయక్, జబీనాబేగం ఇద్దరూ కూడా పేదరికం అనే అడ్డంకులను దాటుకుని ఎస్సై, కానిస్టేబుల్‌గా ఉద్యోగాలు సంపాదించడం ప్రత్యేకం.

Show Full Article
Print Article
Next Story
More Stories